Abn logo
Oct 30 2020 @ 05:21AM

రైతువేదికల నిర్మాణంలో జాప్యం

 గడువు ముగిసినా పూర్తి కాని భవనాలు

జిల్లాలో మరో 20 శాతం పనులు పెండింగ్‌


మంచిర్యాల, అక్టోబరు 29: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతువేదికల భవనాలు పనులు గడువులోగా పూర్తి చేయలేదు.  దసరా పండుగలోపు పూర్తి చేయాలన్న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతరయ్యాయి. మరో 20 శాతం పనులు పెండింగులో ఉన్నాయి. ఈ పనులు పూర్త చేసేందుకు వారం, పది రోజులు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. 


55 భవనాల నిర్మాణానికి అనుమతి..

జిల్లాలోని 311 గ్రామ పంచాయతీలకుగాను మొత్తం 55 చోట్ల రైతు వేదికల భవనాల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక్కో రైతువేదికను రూ. 22 లక్షల అంచనా వ్యయంతో నిర్మించాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం 44 నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 11 నిర్మాణాలు ఫినిషింగ్‌ స్థాయిలో ఉండగా మరో 10 రోజులు గడిస్తేగాని నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితి కానరావడం లేదు. దసరా పండుగ వరకు పూర్తి చేయాలన్న అప్పటి జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి ఆదేశాలు బేఖాతరయ్యాయి. కన్నెపల్లి మండలంలోని జనకాపూర్‌లో రైతు వేదిక నిర్మాణ పనులు పెండింగులో ఉన్నాయి. లక్షెట్టిపేట మండలం జెండా వెంకటాపూర్‌, సూరారంలో పనులు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే చెన్నూరు మండలంలోని కిష్టంపేట, సుందరశాలలో పనులు చివరిదశలో ఉండగా సోమన్నపల్లి, అంగరాజు పల్లిలో నత్తనడకన నడుస్తున్నాయి. దండేపల్లి మండలంలోని గూడెం, మేదరిపేట, లింగాపూర్‌లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. భీమారం మండలంలో పనులు చివరి దశకు చేరుకోగా, కోటపల్లి మండలం సిర్సాలో ఫ్లోరింగ్‌, పెయింటింగ్‌ పనులు చేపట్టాల్సి ఉంది. హాజీపూర్‌ మండలం ముల్కల్ల గ్రామంలో రైతు వేధిక పనులు కొనసాగుతున్నాయి. వేమనపల్లి మండలం కేంధ్రంలో రైతు వేదిక నిర్మాణ పనులు సగం వరకు పూర్తికాగా, ఇక్కడ మరో 20 రోజులు పట్టే అవకాశం ఉంది. 


వారం రోజుల్లోగా పూర్తి చేయాలని..

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న రైతువేదికల భవనాల పనులు వారం రోజుల్లోపు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఈ నెల 28న ఆదేశించారు. అయితే 11 రైతు వేదికలకు సంబంధించి పెద్ద మొత్తంలో పనులు పెండింగులో ఉన్నాయి. తుది గడువులోపు పూర్తయ్యే అవకాశాలు కానరావడం లేదు. ఓ వైపు సీఎం కేసీఆర్‌ శుక్రవారం  రైతువేదికలను అధికారికంగా ప్రారంభించనున్నారు. కాగా జిల్లాలో మాత్రం నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. కాగా జిల్లా వ్యాప్తంగా 11 నిర్మాణాలు చివరిదశలో ఉండగా మరో వారం, పది రోజుల్లోపు పూర్తి చేయన్నుట్లు పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. 


గడువులోగా పూర్తి చేస్తాం..ప్రకాశ్‌జాదవ్‌, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ 

జిల్లా వ్యాప్తంగా రైతు వేధికల నిర్మాణం గడువులోగా పూర్తి చేసేం దుకు ప్రయత్నిస్తున్నాం. సంబంధిత శాఖల అధికారులతో ఎప్పటికప్పు డు పర్యవేక్షణ చేపట్టడం ద్వారా నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నాం. దాదాపు 90 శాతం పనులు ఇప్పటికే పూర్తి అయ్యాయి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులను పురమాయించాం. జిల్లా అధనపు కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారం రోజు ల్లోగా వంద శాతం పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం. 

Advertisement
Advertisement