ప్రతి గిరిజన కుటుంబానికి సాగుభూమి

ABN , First Publish Date - 2020-08-05T11:52:38+05:30 IST

అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి సాగులో ఉన్న భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ..

ప్రతి గిరిజన కుటుంబానికి సాగుభూమి

 రంపచోడవరం, ఆగస్టు 4: అర్హత కలిగిన ప్రతి గిరిజన కుటుంబానికి సాగులో ఉన్న భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ అన్నారు.  విజయవాడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రంపచోడవరం డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్న ఆయన  రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం మూడో దశలో పంపిణీకి తీసుకున్న చర్యలపై సమీక్షించారు.  ఆగస్టు 15 నాటికి అర్హత కలిగిన లబ్ధిదారులకు భూములపై హక్కులు సంక్రమింపచేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యక్తిగత, ఉమ్మడి అటవీ హక్కుల కింద ఇప్పటివరకు 6.5 లక్షల ఎకరాల భూములపై హక్కులు కల్పించామన్నారు.


దీనిలో వ్యక్తిగత పట్టాల కింద 2.2 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించామని తెలిపారు.  రంపచోడవరం ఐటీడీఏ పరిధిలో మూడో విడతలో సుమారు 21,419 ఎకరాల పంపిణీ చర్యలు చేపట్టామన్నారు. అలాగే 287 వనసంరక్షణ సమితులను రద్దు చేసి ఆయా భూములను 230 కమ్యూనిటీలకు అప్పజెప్పేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో ఇళ్ల స్థలాల పట్టాలు జారీకి తీసుకున్న చర్యలను జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం తాళ్లపాలెం, భీమవరం గ్రామాలలో ఉన్న వన సంరక్షణ సమితులకు చెందిన భూములను పరిశీలించారు. పీఎంఆర్‌సీలో ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్‌ అనంతబాబు, ముఖ్యకార్యదర్శులు, జిల్లా కలెక్టరు, జిల్లా జాయింట్‌ కలెక్టర్లు, ఐటీడీఏ పీవోలు సమావేశమై  గిరిజన ప్రాంత సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, గిరిజన సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే, జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మిశ, అటవీ సంరక్షణాఽధికారి నాగేశ్వరరావు, జిల్లా అటవీశాఖాఽధికారి సునీల్‌కుమార్‌, ఐటీడీఏ పీవోలు ప్రవీణ్‌ఆదిత్య, ఎ.వెంకటరమణ, ఏఎస్పీ బిందుమాధవ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T11:52:38+05:30 IST