కేంద్ర ప్రభుత్వం సోమవారం (జనవరి 25) ప్రకటించిన భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాల్లో లెజెండ్ గాయకులైన ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంను పద్మవిభూషణ్, కె.ఎస్. చిత్రను పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. అయితే సింగర్ చిత్రకు సముచిత పురస్కారంతో గౌరవం దక్కిందని అంతా అనుకుంటున్నప్పటికీ దివంగత ప్రఖ్యాత గాయకుడైన ఎస్.పి. బాలుకు వచ్చిన పురస్కారం విషయంలోనే అందరూ పెదవి విరుస్తున్నారు. మాములుగా అయితే ఆయనకి వచ్చిన అవార్డ్ చిన్నదేమీ కాదు.. అత్యున్నత పురస్కారాలలోనే రెండవది. మొదటిది భారతరత్న కాగా, రెండోవది పద్మవిభూషణ్.
ఎస్.పి. బాలుకి పద్మవిభూషణ్ రావడం పట్ల సంతోషంగా ఉన్నప్పటికీ కొందరు మాత్రం ఆయనకు 'భారతరత్న' వచ్చి ఉంటే సముచిత గౌరవం దక్కేదని భావిస్తున్నారు. ఎస్.పి. బాలుకు పద్మవిభూషణ్ అని ప్రకటించగానే.. చాలా మంది సోషల్ మీడియా వేదికగా.. పద్మవిభూషణ్ ఓకే కానీ.. భారతరత్న వచ్చి ఉంటే బాగుండేది అంటూ వ్యక్తపరిచారు. వారిలో సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. వాస్తవానికి ఏ పురస్కారానికైనా ఎస్.పి. బాలుని మించిన అర్హుడు లేడనేది జగమెరిగిన సత్యం. మరి మన ప్రభుత్వాల లోపమో.. లేక కేంద్రప్రభుత్వం చాలని అనుకుందో తెలియదు కానీ.. 'పద్మవిభూషణ్'తో సరిపెట్టేసింది.
కానీ పలు సందర్భాల్లో ఎస్.పి. బాలు చెప్పినట్లుగా.. అభిమానాన్ని మించిన అవార్డు, క్లాప్స్కి మించిన ప్రశంస లేదనేది ఇప్పటికీ, ఎప్పటికీ కళాకారుడు కోరుకునే వాటిలో ప్రథమ స్థానంలో ఉంటాయి. ఆ లెక్కన చూస్తే.. ఏ అవార్డు గౌరవించలేని గొప్ప అవార్డులు ఆయన ఎన్నో పొందారు. అయినా మనిషి జీవించి ఉన్నప్పుడు గుర్తించని ఈ గౌరవం.. ఆ మనిషి లేనప్పుడు మాత్రం ఎందుకు అనేలా కూడా కొందరు అభిప్రాయపడుతుండటం కొసమెరుపు.