భారత ఆటగాళ్ల అహం.. భారత క్రికెట్ కంటే గొప్పది: విరుచుకుపడుతున్న అభిమానులు

ABN , First Publish Date - 2021-12-15T01:24:58+05:30 IST

టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించి రోహిత్‌కు పగ్గాలు అప్పగించడంతో

భారత ఆటగాళ్ల అహం.. భారత క్రికెట్ కంటే గొప్పది: విరుచుకుపడుతున్న అభిమానులు

న్యూఢిల్లీ: టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తప్పించి రోహిత్‌కు పగ్గాలు అప్పగించడంతో భారత క్రికెట్‌లో మొదలైన గందరగోళం కొనసాగుతోంది. గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ నుంచి రోహిత్ తప్పుకోవడం, వ్యక్తిగత కారణాలతో వన్డే సిరీస్ నుంచి కోహ్లీ తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తలతో ఇండియన్ క్రికెట్‌లో ఏం జరుగుతోందో తెలియక సగటు అభిమాని బుర్ర బద్దలుగొట్టుకుంటున్నాడు.


దీనికి తోడు వన్డే కెప్టెన్సీ నుంచి తనను తొలగించడం, ఆ స్థానంలో రోహిత్ శర్మను నియమించడంపై కోహ్లీ ఇప్పటి వరకు పెదవి విప్పకపోవడం చూస్తుంటే ఈ ఇద్దరి సీనియర్ల మధ్య చెడిందని చెబుతున్నారు.  


కోహ్లీ కెప్టెన్సీలో టెస్టులు ఆడాల్సి వస్తుంది కాబట్టి రోహిత్.. వన్డేల్లో అతడి కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుంది కాబట్టి కోహ్లీ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ఉందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కోహ్లీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని బీసీసీఐ సరిగా చక్కదద్దలేకపోతోందంటూ విరుచుకుపడుతున్నారు. 


చూస్తుంటే బోర్డులో రాజకీయాలు పరాకాష్టకు చేరుకున్నట్టు అనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఇదేదో అవార్డు విన్నింగ్ స్క్రిప్ట్‌లా ఉందని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అభిమానులే పిచ్చోళ్లు అయిపోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మేం వారి పెళ్లికి వెళ్లలేదు కాబట్టి.. వారు మా పెళ్లికి రానట్టుగా వీరు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వీరి అహం భారత క్రికెట్ కంటే గొప్పదంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాగా, సౌతాఫ్రికా టూర్‌పై కోహ్లీ ఇప్పటి వరకు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

Updated Date - 2021-12-15T01:24:58+05:30 IST