ప్రముఖ శిల్పకారుడు ‘పట్నాయక్‌’ కన్నుమూత

ABN , First Publish Date - 2022-08-12T08:50:59+05:30 IST

ప్రముఖ శిల్పకారుడు ‘పట్నాయక్‌’ కన్నుమూత

ప్రముఖ శిల్పకారుడు ‘పట్నాయక్‌’ కన్నుమూత

విశాఖపట్నం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): ప్రముఖ శిల్పకారుడు చౌదరి సత్యనారాయణ పట్నాయక్‌(97) గురువారం సాయంత్రం కన్నుమూశారు. ప్రకృతి రమణీయ దృశ్యాలకు కుంచెతో ప్రాణం పోయడమే కాకుండా... వ్యక్తిని చూసిందే తడవుగా ఆకృతిని ముమ్మూర్తులా విగ్రహాన్ని మలిచే శిల్పిగా పట్నాయక్‌ పేరుగాంచారు. శ్రీకాకుళం జిల్లా బాదం గ్రామానికి చెందిన పట్నాయక్‌ 1925 డిసెంబర్‌ 6న జన్మించారు. చిన్న వయసులోనే చిత్రకళపై ఆసక్తి కనబర్చారు. ప్రముఖ చిత్రకారులు అంట్యాకుల పైడిరాజు సలహాపై 1950లో మద్రాసు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌లో డిప్లమో పూర్తిచేశారు. అనంతరం గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో శిల్పాచార్యునిగా చేరి కొన్నేళ్లు పనిచేశారు. పదవీ విరమణ తరువాత 2009లో విశాఖ వచ్చి స్థిరపడ్డారు. ఈ రంగానికి ఆయన చేసిన సేవలకుగాను రోశయ్య ప్రభుత్వం కళారత్న, 2011లో కేంద్ర ప్రభుత్వం వయో శ్రేష్ఠ పురస్కారంతో సత్కరించింది. పట్నాయక్‌ భార్య, కుమారుడు రవిశంకర్‌ పట్నాయక్‌, కోడలు సంగీత పట్నాయక్‌ కూడా శిల్పులే. రెండేళ్ల కిందట కొవిడ్‌తో కుమారుడు మృతిచెందారు. నాటి నుంచి మంచానికే పరిమితమైన ఆయన గురువారం తుది శ్వాస విడిచారు.

Updated Date - 2022-08-12T08:50:59+05:30 IST