అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. ట్రంప్‌కు బదులు నల్లజాతీయుడు..!

ABN , First Publish Date - 2020-07-05T21:37:26+05:30 IST

అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్‌ల మధ్య రసవత్తర పోరు నెలకొన్న విషయం...

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కొత్త ట్విస్ట్.. ట్రంప్‌కు బదులు నల్లజాతీయుడు..!

వాషింగ్టన్: అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బిడెన్‌ల మధ్య రసవత్తర పోరు నెలకొన్న విషయం తెలిసిందే. మరో 4 నెలల్లో జరగనున్న ఎన్నికల కోసం వీరివురూ హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో మరో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. నల్లజాతీయుడైన ప్రముఖ ర్యాపర్ కెన్యే వెస్ట్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలో ట్రంప్‌కు మద్దతు పలికిన కెన్యే, ఇప్పుడు ఆయన్ని వెనక్కి నెట్టి తానే పోటీ చేసేందుకు సిద్ధపడ్డారు. తాను రిపబ్లికన్‌ల తరపున పోటీ చేస్తానని, డెమోక్రాట్ అభ్యర్థి జో బిడెన్ తన ప్రత్యర్థి అని చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు కావలసిన మద్దతుదారులు తనకూ ఉన్నారని, తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తానని కెన్యే పేర్కొన్నారు. "అమెరికన్లు దేవుడిపై నమ్మకం ఉంచుతారు. ఆ నమ్మకంతోనే మన భవిష్యత్తును నిర్మించుకోవాలి. దానికి అవసరమైన హామీలను నెరవేర్చుకోవాలి. దానికోసమే నేను అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయాలని అనుకుంటున్నాను’ అంటూ వెస్ట్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం రిపబ్లికన్ల తరపున పోటీచేస్తున్న ట్రంప్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఒకవేళ వెస్ట్ రిపబ్లికన్ల తరపున పోటీ చేస్తుంటే ట్రంప్‌ పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఇదిలా ఉంటే వెస్ట్‌కు ప్రముఖ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ మద్దతు తెలిపారు. దీంతో వాతావరణం మరింత వేడెక్కింది. వెస్ట్ పోటీపై సర్వత్రా చర్చ సాగుతోంది. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేయడంపై వెస్ట్ సీరియస్‌గా ఉన్నారా.. లేదా.. అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీచేసేందుకు అవసరమైన దరఖాస్తులను వెస్ట్ అందజేశారా.. లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.


ప్రస్తుతం అమెరికాలో నల్లజాతీయుల హక్కుల కోసం తీవ్ర స్థాయిలో ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఓ నల్లజాతీయుడు ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని తెలియడం ప్రాధాన్యం సంతరించుకుంది. అదికూడా ట్రంప్‌కు బదులుగా రిపబ్లికన్ల తరపునే పోటీ చేయనుండడం చర్చనీయాంశమైంది.

Updated Date - 2020-07-05T21:37:26+05:30 IST