ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-10-20T05:22:08+05:30 IST

నగరంలో మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రహమతుల్లా వీధిలో ఉన్న ఆస్థాన్‌ ఏ బుఖారియ పీఠంలో మిలాదున్‌ నబీ ఉత్సవాలను పురష్కరించుకొని ఘనంగా ఆసారే షరీఫ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు
నగరంలో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

కడప(మారుతీనగర్‌/సెవెన్‌రోడ్స్‌), అక్టోబరు 19: నగరంలో మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రహమతుల్లా వీధిలో ఉన్న ఆస్థాన్‌ ఏ బుఖారియ పీఠంలో మిలాదున్‌ నబీ ఉత్సవాలను పురష్కరించుకొని ఘనంగా ఆసారే షరీఫ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా, రాష్ట్ర హజ్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ మగ్దూం బుఖారి, ఖజాత్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ సిరాజుద్దీన్‌ బుఖారి పాల్గొని మాట్లాడారు. పవిత్రమైన మిలాదున్‌ నబీ శుభ సందర్భంగా ఈ నెల అంతా బార్మీ అన్నదాన కార్యక్రమాలతో పాటు, మొహమ్మద్‌ ప్రవక్త గురించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ జహీర్‌బుఖారి, హబీబ్‌ బుఖారి, కార్పొరేటర్లు అజ్మతుల్లాఖాన్‌, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి

ప్రజలంతా సుఖసంతోషాలతో, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని పలువురు మైనార్టీ నేతలు ఆకాంక్షించారు. మహమ్మద్‌ ప్రవక్త జన్మదినం, మిలాదున్నబీ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని అమీనియా బ్లడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో మంగళవారం తొలుత స్థానిక పెద్దదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, తదుపరి నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దర్గా నుంచి అల్మా్‌సపేట, వన్‌టౌన్‌, గోకుల్‌లాడ్జి, 7రోడ్స్‌, పాతబస్టాండ్‌, గుంతబజార్‌ మసీదు వరకు సాగింది. కార్యక్రమంలో నగర మైనార్టీ నాయకులు, అమీర్‌బాబు, సుభాన్‌బాష, నజీర్‌ అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు. 


కమలాపురంలో: మహమ్మద్‌ ప్రవక్త జన్మించిన సందర్భంగా మిలాద్‌ వున్‌ నబీ వేడుకలను మండల పరిధిలోని లేటపల్లె, పెద్దచెప్పలి, కోగటం, గంగవరం, మీరాపురం, చిన్నచెప్పలి, కమలాపురం తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక దర్గాయే గఫారియా పీఠాధిపతి ఫైజుల్‌ గఫార్‌షాఖాద్రి ఆధ్వర్యంలో జెండా ఊరేగింపు నిర్వహించారు. దర్గాలో పూలచాంద్‌ను సమర్పించి ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


చెన్నూరులో : మహమ్మద్‌ ప్రవకర్త సర్వమానవాళికి స్నేహాన్ని, అప్యాయతల్ని, మంచితనాన్ని పంచాడని ఆయన చూపిన దైవిక మార్గంలో ప్రతిఒక్కరూ నడుచుకోవాలని చెన్నూరు మసీదు మతగురువు రఫి అన్నారు. మిలాదున్‌నబీ సందర్భంగా చెన్నూరు దర్గా, మసీదులలో ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి అల్లా చూపిన బాట నేటికీ ప్రతి ముస్లిం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అలాగే మండలంలోని పలు గ్రామాల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. 

Updated Date - 2021-10-20T05:22:08+05:30 IST