వైరస్‌తో పోరాడి అంతా గెలిచారు

ABN , First Publish Date - 2020-06-22T05:30:00+05:30 IST

నాలుగేళ్ల చిన్నారి నుంచి అరవై రెండేళ్ల వృద్ధుల వరకు... పద్ధెనిమిది మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. లాక్‌డౌన్‌తో అంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది...

వైరస్‌తో పోరాడి అంతా గెలిచారు

నాలుగేళ్ల చిన్నారి నుంచి అరవై రెండేళ్ల వృద్ధుల వరకు... పద్ధెనిమిది మంది సభ్యులున్న ఉమ్మడి కుటుంబం. లాక్‌డౌన్‌తో అంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. కానీ అంతలోనే వారి ఆనందం ఆవిరైంది. కరోనా మహమ్మారి ఒక్కరితో మొదలై... అందరికీ సోకింది. అయినా వారు కుంగిపోలేదు. భయంతో బిక్కచచ్చిపోలేదు. వైరస్‌పై యుద్ధం చేసి చివరకు విజయం సాధించారు. ఎలా..? మహారాష్ట్రకు చెందిన ఆ కుటుంబ సభ్యురాలు నేహాలీ పవార్‌ మాటల్లోనే... 


‘‘ముంబయ్‌లోని వాడాల పరిసర ప్రాంతం. చుట్టుపక్కల గుడిసెలు. కిటకిటలాడే వీధులు. అక్కడే మా ఇల్లు. మా కుటుంబంలో పద్ధెనిమిది మంది. అందరికీ సరిపోయేలా తొమ్మిది గదుల ఇల్లు. లాక్‌డౌన్‌ ప్రకటించగానే అందరిలానే మేమంతా ఇంట్లోనే ఉంటున్నాం. కొందరు ఉద్యోగ నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చేది. నేను వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేసేదాన్ని. కరోనా సోకకుండా జాగ్రత్తలన్నీ తీసుకున్నాం. తరచూ చేతులు కడుక్కోవడం... ఇల్లంతా రోజూ శుభ్రం చేసుకోవడం... వేడి నీళ్లు తాగడం... ఇలా ప్రభుత్వం, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఇచ్చిన సూచనలన్నీ పాటించాం. ఆటలు ఆడుకొంటూ... పాటలు పాడుకొంటూ... కొత్త కొత్త రుచులు ఆస్వాదిస్తూ... ఎంతో హాయిగా సాగిపోతోంది. 


ఇంతలో ఓ కుదుపు..! 

మా వారు అమిత్‌ పవార్‌ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఒక్కోసారి ఆయన రెండు మూడు రోజులు విధుల్లోనే ఉండాల్సి వచ్చేది. మా బావది సెక్యూరిటీ ఏజెన్సీలో ఉద్యోగం. మామగారు సామాజిక కార్యకర్త. విధుల్లో భాగంగా వారు బయటకు వెళ్లి రావాల్సి వచ్చేది. ఏమూలో నాలో భయం. వారివల్ల మిగతావారికి కూడా ఇబ్బందులు వస్తాయేమోనని! ఇంట్లో అన్ని జాగ్రత్తలూ తీసుకొంటున్నాం కానీ... బయట నుంచి వచ్చాక వారితో భౌతిక దూరం పాటించలేదు. మా కుటుంబంలో ఆప్యాయతలు ఎక్కువ. దీంతో ఎవరినీ దూరం పెట్టలేకపోయాం. చివరకు అదే పెద్ద శాపమైంది. 


ఒక్కసారిగా నిశ్శబ్దం...  

ఒకరోజు మావారు ఆస్పత్రి నుంచి తిరిగొచ్చారు. చూస్తే జ్వరం. కానీ కొద్ది సేపటికే తగ్గిపోయింది. కొవిడ్‌-19 సోకితే దగ్గు, తుమ్ములు వస్తాయని విన్నాం. అయితే ఆ లక్షణాలేవీ ఆయనలో కనిపించలేదు. చన్నీళ్లతో స్నానం చేయడం వల్లే జ్వరం వచ్చిందనుకున్నాం. అప్పుడు పెద్దగా పట్టించుకోలేదు. ఇంతలో మా ఇంటి దగ్గర్లోనే కరోనా పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. మా వారు వెంటనే స్వాబ్‌ టెస్ట్‌ చేయించుకున్నారు. నాలుగు రోజులు గడిచిపోయాయి. ఆ రోజు ఆయన డ్యూటీకి వెళ్లారు. అదే సమయంలో ఇంటి దగ్గర కొందరు పీపీఈ సూట్లు వేసుకుని కనిపించారు. మా ప్రాంతమంతా శానిటైజ్‌ చేస్తున్నారు. ఆరా తీస్తే... మా వారికి కరోనా వైరస్‌ సోకిందని చెప్పారు. ఒక్కసారిగా మా ఇంట్లో నిశ్శబ్దం. అందరి ముఖాల్లో తెలియని భయం. మరుసటి రోజే ఆయనను తీసుకెళ్లేందుకు అంబులెన్స్‌ వచ్చింది. ఆ సమయంలో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా వారిని మళ్లీ చూడగలుగుతానా? ఇంకా మా ఇంట్లో ఎంతమందికి వైరస్‌ సోకింది? ఆందోళన మొదలైంది. 


ఫేస్‌బుక్‌లో పెడితే... 

అమిత్‌ను తీసుకువెళ్లిన తరువాత మా అందరినీ ఇంట్లోనే క్వారంటైన్‌లో పెట్టారు. క్రమంగా ఒకరి తరువాత ఒకరు అనారోగ్యం పాలవుతూవచ్చాం. అధికారులకు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా పరీక్షల కిట్లు అయిపోయాయని వారు చెబుతూ వచ్చారు. చేతిపై క్వారంటైన్‌ స్టాంప్‌ వేయడంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. అలా మూడు రోజులు మాకు ఎలాంటి సహాయం అందలేదు. మా మరుదుల్లో ఒకరు కళాకారుడు. అతను మా పరిస్థితి వివరిస్తూ ఫేస్‌బుక్‌లో లైవ్‌ పెట్టారు. ఇది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్‌ అయింది. మీడియా సంస్థలకూ తెలిసింది. దీంతో లక్షణాలున్నవారికి అధికారులు పరీక్షలు చేస్తే, వారంతా పాజిటివ్‌గా తేలారు. ఎనిమిది మందిని   ఐసొలేషన్‌ వార్డుకు తరలించారు. మిగిలిన వాళ్లను ఇంట్లో క్వారంటైన్‌లో పెట్టారు. వీరిలో నాలుగేళ్ల బాబు కూడా ఉన్నాడు. అతడి అమ్మానాన్న ఆస్పత్రిలో ఉన్నారు. ఎవరూ ఎత్తుకొని ఆడించడానికి లేదు. దీంతో వాడిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మా పెద్ద మామగారి వయసు 62 సంవత్సరాలు. ఆస్పత్రిలో ఆయనకు కృత్రిమ శ్వాస అందిస్తున్నారు. అరవై ఏళ్లున్న ఇంకొక మామగారిని ఐసీయూలో ఉంచారు. ఆయనకు గుండె జబ్బు. ఇద్దరూ షుగర్‌ వ్యాధి బాధితులే. 




ఆ రోజు శుభవార్త... 

ఆ తరువాత ఇంట్లో ఉన్నవారందరికీ వైరస్‌ సోకింది. ఆస్పత్రులు... క్వారంటైన్‌ సెంటర్లు... రెండు మూడు వారాలు ఇదే గోల... అంతా గందరగోళం. ఆ రోజు బుద్ధపూర్ణిమ. శుభవార్త విన్నాం. మా ఆయన అమిత్‌ కోలుకున్నారని తెలిసింది. టెస్టుల్లో నెగెటివ్‌ వచ్చింది. పది పన్నెండు రోజుల్లో ఒక్కొక్కరుగా అంతా కోలుకున్నారు. చివరకు అంతా ఇంటికి వచ్చేశాం. అయితే ఇప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటిస్తున్నాం. మనుషులమే కాదు... మా వస్తువులు, వస్త్రాలు, భోజనాలు అన్నీ దూరం దూరంగానే! కరోనా సోకినప్పటికీ పిల్లల నుంచి వృద్ధుల వరకు... ఎవరూ ధైర్యం కోల్పోలేదు. కరోనా ‘పాజిటివ్‌’ వచ్చినా ‘నెగెటివ్‌’ ఆలోచనల్లోకి ఎవరినీ వెళ్లనీయలేదు. బహుశా అదే మా ఇంట్లో ఆనందాన్ని తిరిగి తీసుకువచ్చింది అనుకుంటున్నాను.’’


Updated Date - 2020-06-22T05:30:00+05:30 IST