నా భార్య నాపై పెట్రోల్ పోసింది.. ఎవరో నిప్పంటించారంటూ భర్త ఫిర్యాదు..

ABN , First Publish Date - 2020-05-21T16:15:37+05:30 IST

కుటుంబంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్‌ సుఖ్‌దేవ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. పాతబస్తీకి చెందిన ఓ మహిళతో వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు భార్యా పిల్లలను వదిలేశాడు.

నా భార్య నాపై పెట్రోల్ పోసింది.. ఎవరో నిప్పంటించారంటూ భర్త ఫిర్యాదు..

ప్రాణాలు తీసిన కుటుంబ వివాదం

బంజారాహిల్స్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కుటుంబంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. బంజారాహిల్స్‌ సుఖ్‌దేవ్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ హుస్సేన్‌ ప్రైవేట్‌ ఉద్యోగి. పాతబస్తీకి చెందిన ఓ మహిళతో వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మద్యానికి బానిసైన అతడు భార్యా పిల్లలను వదిలేశాడు. కొంతకాలం తర్వాత గురుబ్రహ్మనగర్‌కు చెందిన నౌనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ కుమార్తె ఉంది. కరోనా నేపథ్యంలో ఉద్యోగం లేదు. ఉన్న డబ్బుతో హుస్సేన్‌ మద్యం తాగేవాడు. అద్దె కట్టకపోవడంతో రెండు నెలల క్రితం ఇంటి యజమాని ఖాళీ చేయించడంతో అత్తగారు ఉంటున్న గురుబ్రహ్మనగర్‌ వెళ్లాడు. నౌనిత తల్లి, సోదరుడు రేకుల షెడ్డులో అద్దెకు ఉంటున్నారు. అందులోనే కుమార్తె, అల్లుడుకు ఓ పక్కన తడికెలు వేసి గది ఇచ్చారు. హుస్సేన్‌ రోజూ మద్యం తాగొచ్చి గొడవ పడేవాడు. తమ పరువు పోతుందని.. వెళ్లిపొమ్మని నౌనిత తల్లి పద్మ చెప్పింది. ఈ విషయంపై తల్లీ కుమార్తె మధ్య మంగళవారం గొడవ జరిగింది. ఇదే విషయాన్ని నౌనిత భర్తకు ఫోన్‌ చేసి చెప్పింది. 


అప్పటికే మద్యం తాగి మత్తులో ఇంటికి వచ్చిన హుస్సేన్‌ ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొద్ది సేపటికి గదిలో నుంచి పొగలు రావడంతో కుటుంబ సభ్యులు తలుపులు పగులగొట్టి మంటలు ఆర్పి అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తన భార్య నౌనిత  తనను గదిలోకి తీసుకెళ్లి పెట్రోల్‌ పోసిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అత్త పద్మ, బావమరిది హేమంత్‌, బంధువు మహేష్‌ అందరూ అక్కడే ఉన్నారని.. ఎవరో నిప్పంటించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అతడి భార్యసహా నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హుస్సేన్‌ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందాడు.  

Updated Date - 2020-05-21T16:15:37+05:30 IST