వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదు: మోదీ

ABN , First Publish Date - 2022-03-15T19:32:01+05:30 IST

వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ..

వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదు: మోదీ

న్యూఢిల్లీ: వారసత్వ రాజకీయాలకు బీజేపీలో చోటు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ద్వంద్వంగా ప్రకటించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతోందని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో  పార్టీ నేతల పిల్లలకు టిక్కెట్లు నిరాకరించడం జరిగితే దానికి తానే బాధ్యుడనని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్రాల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంతో ఢిల్లీలోని అంబేడ్కర్ కేంద్రంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ  నడ్డాను నేతలు సన్మానించారు. ఈ సందర్భంగా మోదీ వారసత్వ రాజకీయాల ప్రస్తావన చేశారు. ఉక్రెయిన్ రాజకీయాలు, కశ్మీర్ ఫైల్స్ సినిమాను కూడా మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు.


యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్ నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకురావడంలో కేంద్రం తీసుకున్న చొరవను సమావేశంలో మోదీ వివరించారు. ఈ అంశంపై బీజేపీయేతర ముఖ్యమంత్రులు రాజకీయాలు చేయడాన్ని ప్రస్తావించారు. కాగా, 1990వ దశకంలో కశ్మీర్ నుంచి హిందువులు వెళ్లిపోవడానికి దారితీసిన పరిస్థితులపై తీసిన 'కశ్మీర్ ఫైల్స్' చిత్రాన్ని మోదీ ప్రశంసించినట్టు సమావేశానంతరం బీజేపీ ఎంపీ మనోజ్ కుమార్ తివారీ వెల్లడించారు. ఇది చాలా మంచి చిత్రమని, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ప్రశంసించినట్టు చెప్పారు.

Updated Date - 2022-03-15T19:32:01+05:30 IST