సకుటుంబ రాజకీయం

ABN , First Publish Date - 2021-09-05T05:37:35+05:30 IST

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? దివంగత రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిల గురువారంనాడు హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతి సందర్భంగా...

సకుటుంబ రాజకీయం

తెలంగాణలో వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీని ప్రారంభించిన షర్మిల రాజకీయంగా తప్పటడుగులు వేస్తున్నారా? దివంగత రాజశేఖర రెడ్డిపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని క్యాష్‌ చేసుకోవాలన్న ఉద్దేశంతో షర్మిల గురువారంనాడు హైదరాబాద్‌లో వైఎస్‌ఆర్‌ 12వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. దివంగత రాజశేఖర రెడ్డితో సన్నిహితంగా మెలిగిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలను, ఇతర ముఖ్యులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. రాజశేఖర రెడ్డి సతీమణి స్వయంగా ఫోన్లు చేసి మరీ వారందరినీ ఆహ్వానించారు. రాజశేఖర రెడ్డిని స్మరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఈ సమావేశం అసలు లక్ష్యం తెలంగాణలో షర్మిల పార్టీకి మద్దతు కూడగట్టడమే! అయితే సమావేశానికి హాజరైన ప్రముఖులలో అత్యధికులు ఆంధ్ర ప్రాంతానికి చెందినవారే కావడంతో సమావేశం లక్ష్యం గతి తప్పింది. ఈ కార్యక్రమానికి తన కుమారుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిని కూడా విజయమ్మ ఆహ్వానించారు. తన మాట కాదని తెలంగాణలో రాజకీయ పార్టీని ప్రారంభించిన చెల్లెలు షర్మిలతో ఏర్పడిన విభేదాల కారణంగా ఆయన ఈ సమావేశానికి హాజరుకాకపోగా ‘నన్ను గబ్బు పట్టించడానికే హైదరాబాద్‌లో ఈ సమావేశం ఏర్పాటు చేశారా?’ అని తన తల్లి విజయమ్మపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డికి ఇష్టం లేని ఈ సమావేశానికి విజయమ్మ నుంచి ఆహ్వానం అందుకున్న పలువురు ప్రముఖులు ముఖం చాటేశారు. విజయమ్మ పిలిచింది కదా అని వెళితే ఇరువురు ముఖ్యమంత్రుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందన్న భయంతో సినీ రంగానికి చెందిన ముఖ్యులు దూరంగా ఉండిపోయారు. అదే సమయంలో తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించినప్పటికీ ఇద్దరు ముగ్గురు మినహా మరెవరూ ఈ సమావేశంలో పాల్గొనలేదు. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి మినహా మిగతా వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అక్కడ కనిపించారు. మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ప్రసంగించిన వారు సైతం దివంగత రాజశేఖర రెడ్డిని కీర్తించడానికే పరిమితమై షర్మిల ప్రారంభించిన రాజకీయ పార్టీ గురించి ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు. తెలంగాణలో పార్టీ ప్రారంభించిన తన బిడ్డ షర్మిలను ఆశీర్వదించాలని విజయమ్మ సభా ముఖంగా కోరినప్పటికీ ప్రసంగించిన వారు మాత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’ అన్నట్టు వ్యవహరించారు. తమకు రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న అభిమానంతో, విజయమ్మ పిలుపును కాదనలేక వచ్చాం గానీ, షర్మిల పార్టీని దీవించడం ద్వారా కేసీఆర్‌ ఆగ్రహానికి గురికాలేమని సమావేశానికి వెళ్లిన ఒక ముఖ్యుడు వ్యాఖ్యానించారు. ‘షర్మిల గానీ, విజయమ్మ గానీ ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటుచేశారో తెలియడం లేదు. మేము హాజరు కావడం వల్ల వారికి నష్టమే తప్ప లాభం ఉండదు. ఇది రాజకీయంగా షర్మిల వేసిన తప్పటడుగు’ అని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో ప్రముఖుడు అభిప్రాయపడ్డారు. రెండు మూడుసార్లు ఫోన్లు చేసి మొహమాటపెట్టడంతో తాము వెళ్లవలసి వచ్చిందని, ఒకరకంగా ఇలా చేయడం తమను ఇబ్బంది పెట్టడమేనని మరో ప్రముఖుడు పేర్కొన్నారు. షర్మిలకు మద్దతు కూడగట్టాలంటే దానికి వేరే పద్ధతి ఉంటుందని, ఆహ్వానితులలో బహిరంగంగా మద్దతు ప్రకటించేవారు ఒక్కరూ లేరని, రాజశేఖర రెడ్డి సన్నిహితులైన కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, రఘువీరారెడ్డి వంటి వారు మద్దతు ప్రకటించినా కూడా నష్టమే తప్ప లాభం ఉండదని ఆహ్వానం అందుకున్న వారిలో పలువురు వ్యాఖ్యానించారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన రాజశేఖర రెడ్డి పట్ల ప్రజల్లో ఏర్పడిన సానుభూతిని జగన్‌ రెడ్డి గరిష్ఠంగా సొమ్ము చేసుకున్నాడని, తెలంగాణలో కూడా రాజశేఖర రెడ్డిని ప్రొజెక్ట్‌ చేసి రాజకీయంగా లాభం పొందాలన్న ఆలోచనే సరైంది కాదని, రాజకీయాల్లో ఒక అస్త్రం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుందని మెజారిటీ సభికులు అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రాజకీయ పార్టీ ప్రారంభించాలన్న షర్మిల నిర్ణయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్న సోదరుడు జగన్మోహన్‌ రెడ్డితో విభేదాలు ఏర్పడితే ఆంధ్రప్రదేశ్‌లోనే ఆయనను ఎదుర్కోవాలి గానీ తెలంగాణ రాజకీయాల్లోకి రావాలనుకోవడం వివేకం అనిపించుకోదని రాజశేఖర రెడ్డి ఆత్మీయులలో ఒకరు వ్యాఖ్యానించారు. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ ప్రారంభించే ముందే షర్మిల తనను సంప్రదించి ఉంటే ఇదే మాట చెప్పేవారమని ఆయన అన్నారు. నిజానికి అన్నాచెల్లెళ్ల మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటో తమకు ఇప్పటికీ స్పష్టంగా తెలియదని మరొకరు అన్నారు. వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి షర్మిల అడుగు పెట్టి ఉంటే జగన్‌కు తీవ్ర నష్టం జరిగి ఉండేదని మరో సన్నిహితుడు వ్యాఖ్యానించారు. మొత్తానికి సమావేశానికి హాజరైన వారిలో అత్యధికులు తమ వల్ల షర్మిలకు నష్టమే తప్ప లాభం ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలను ధిక్కరించి తాము మద్దతు ప్రకటిస్తామని విజయమ్మ గానీ, షర్మిల గానీ ఆశించడం తప్పు అని ఒక సినీ ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ప్రసంగించిన వారు కూడా కార్యక్రమం చివరి వరకూ ఉండకుండా తమ ఉపన్యాసం పూర్తికాగానే వెళ్లిపోయారు. రాజశేఖర రెడ్డిని తలచుకుని తల్లీ కూతుళ్లు భావోద్వేగానికి గురైనప్పటికీ తెలంగాణ ప్రజల్లో స్పందన కనిపించలేదు. రాజశేఖర రెడ్డిపై ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉన్నంత సానుభూతి తెలంగాణ ప్రజల్లో లేదనే చెప్పవచ్చు. అంతేకాకుండా రాజశేఖర రెడ్డి మరణించి పన్నెండేళ్లయింది. రాష్ట్రం విడిపోయి తెలంగాణ ఏర్పడి ఏడేళ్లయింది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి ప్రభావం ఉండే అవకాశం లేదు. తెలంగాణ సాధించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఒక వైపున, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరోవైపున తలపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర రెడ్డిపై సానుభూతి ఇంకా మిగిలే ఉంటుందనుకోలేం. 


ఎన్నెన్నో సవాళ్లు!

ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలంటే షర్మిల ఎన్నో సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. సోదరుడు జగన్మోహన్‌రెడ్డితో ఆమెకు విభేదాలు ఏర్పడిన విషయం వాస్తవమే అయినా చాలామంది నమ్మడం లేదు. ఇదంతా అన్నాచెల్లెళ్లు ఆడుతున్న నాటకమని ఇప్పటికీ అనేక మంది భావిస్తున్నారు. రాజశేఖర రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయకు వెళ్లిన జగన్‌ రెడ్డి, షర్మిల తండ్రి సమాధి వద్ద పక్కపక్కనే కూర్చున్నప్పటికీ ఎడమొఖం పెడమొఖంగానే ఉన్నారు. అయినా వారు కలిసి అల్పాహారం తీసుకున్నారని వార్తలు రావడంతో, ‘నేను ఒంటరినయ్యాను’ అని ట్వీట్‌ చేయడం ద్వారా సోదరుడితో తనకు ఉన్న విభేదాలు సమసిపోలేదని షర్మిల పరోక్షంగా స్పష్టం చేశారు. జగన్‌ రెడ్డి సతీమణి భారతీరెడ్డి మాత్రం రాజశేఖర రెడ్డి సమాధి వద్ద విడిగా కూర్చోవడం గమనార్హం. కుటుంబంలో ఒంటిరిదాన్ని అయ్యానని బాధపడుతున్న షర్మిలకు తోడుగా విజయమ్మ నిలబడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో తన కుమార్తెను నిలబెట్టడం కోసం ఆమె చేయగలిగిందంతా చేస్తున్నారు. కుమారుడు జగన్‌ రెడ్డిని ధిక్కరించి మరీ ఆమె షర్మిల వైపు నుంచున్నారు. అయితే తల్లీకూతుళ్లకు రాజకీయాల పట్ల అంతగా అనుభవం లేనందున మొన్నటి సమావేశం వంటి తప్పటడుగులు వేస్తున్నారు. ఈ పరిస్థితులలో షర్మిల ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. రాజకీయాల్లో మొండితనం ఒక్కటే సరిపోదు. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలి. జగన్మోహన్‌ రెడ్డి కూడా మొండివాడే. కేవలం మొండితనాన్నే నమ్ముకొని ఆయన 2014 ఎన్నికలకు వెళ్లి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో మొండిగా పాదయాత్ర చేయడంతో పాటు వ్యూహకర్తల సహాయం తీసుకుని ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రజల్లో అంతో ఇంతో బలమైన నాయకులు కొందరైనా పక్కనుండాలి. షర్మిలకు అటువంటి నాయకులు ఇంకా సమకూరలేదు. పార్టీలో చేరికలపై షర్మిల ఇంతకాలం దృష్టిపెట్టకపోవడం ఆమె చేసిన తప్పిదమే. ప్రజలతో వీలైనంత ఎక్కువగా మమేకం కావాలి. రాజశేఖర రెడ్డి తనయగా కాకుండా తెలంగాణ బిడ్డగా తనను ప్రజలు గుర్తించడానికి కృషి చేయకుండా తండ్రి లెగసీపై ఆధారపడాలనుకోవడం అవివేకం. తానొక సాదాసీదా మనిషినని ఆమె ప్రజలను నమ్మించగలగాలి. ఆర్భాటంగా ఏర్పాట్లు చేసుకుని దీక్షలు చేయడాన్ని ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలు హర్షించరు. ఏదో ఒక ప్రతిపక్ష పార్టీతో జత కట్టకుండా సొంతంగా తెలంగాణ రాజకీయాల్లో జెండా ఎగరేయాలనుకోవడం అత్యాశే అవుతుంది. ముందుగా తనకంటూ ఎంతో కొంత ఓటు బ్యాంకును సృష్టించుకొనే ప్రయత్నం చేయాలి. ఈ దిశగా ఆమె విఫలమైతే రాజకీయ ప్రస్థానం కూడా ముగిసిపోతుంది. ఇలాంటి సవాళ్లను అధిగమించే దిశగా అడుగులు వేయకుండా రాజకీయంగా అక్కరకు రాని వారిని ఆహ్వానించి సమావేశాలు ఏర్పాటుచేయడం వల్ల ఖర్చు తప్ప ఫలితం ఉండదు. రాజశేఖర రెడ్డి వర్ధంతి సభలో ప్రసంగించిన విజయమ్మ ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ రెడ్డి రాజన్న రాజ్యం దిశగా అడుగులు వేస్తున్నారని, తెలంగాణలో కూడా రాజన్న రాజ్యం ఏర్పాటుకు షర్మిలను దీవించాలని కోరారు. తల్లిగా ఆమె అలా భావించడంలో తప్పులేదు. జగన్‌ రెడ్డి పాలన గురించి ఆంధ్ర ప్రజలకు అర్థమైందో లేదో తెలియదు గానీ తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది. జగన్‌ రెడ్డి తరహా పాలనను తెలంగాణ సమాజం ఆమోదించదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఆంధ్రా సమాజం వేరు, తెలంగాణ సమాజం వేరు. కులమతాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేసి ఫలితం పొందవచ్చునేమో గానీ తెలంగాణలో అలా కుదరదు. ప్రజల సైకాలజీని స్టడీ చేసి తదనుగుణంగా రాజకీయ వ్యూహాలు రచించుకునే నాయకులే విజయం సాధిస్తారు. ఈ సూక్ష్మాన్ని షర్మిల తెలుసుకోవాలి.


ఏం జరగనుందో?

రాజశేఖర రెడ్డి వర్ధంతి నేపథ్యంలో ఆయన కుటుంబంలో నెలకొన్న విభేదాలు మరోమారు బయటపడ్డాయి. తెలంగాణ రాజకీయాల్లో షర్మిల పరిస్థితి ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ ఈ విభేదాల ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై త్వరలోనే పడే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన చార్జిషీట్లపై ప్రత్యేక కోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. ఈ విచారణను వీలైనంత జాప్యం చేయాలని జగన్‌ అండ్‌ కో ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ ఉద్దేశంతోనే చార్జిషీట్లలో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరుగా డిశ్చార్జ్‌ పిటిషన్లు వేస్తున్నారు. చార్జిషీట్లపై విచారణ ప్రారంభం కావాలంటే ముందుగా ఈ పిటిషన్లను పరిష్కరించాల్సి ఉంటుంది. ఈ తతంగం పూర్తికావాలంటే రెండు మూడు నెలలకు పైగా సమయం పడుతుందని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత విచారణ మొదలై పూర్తికావడానికి, న్యాయస్థానం తీర్పు చెప్పడానికి మరో ఆరు మాసాలు పట్టవచ్చునని అంటున్నారు. ఈ లెక్కన ఈడీ కేసులలో విచారణ వచ్చే ఏడాది జూన్‌ వరకు సాగుతుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్‌ తర్వాత పార్టీ పరిస్థితి ఏమిటి? అని వైసీపీ వర్గాల్లో తర్జనభర్జన జరుగుతోంది. జగన్‌ రెడ్డికి శిక్ష పడితే పార్టీ భవిష్యత్తు ఏమిటి? తమ భవిష్యత్తు ఏమిటి? అని అధికార పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. జగన్‌ రెడ్డి మాత్రం జరిగేదేదో జరుగుతుందని, తానేమీ ఆందోళన చెందడం లేదని సన్నిహితుల వద్ద అంటున్నారు. తనకు శిక్ష పడితే తన భార్య భారతీరెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన ఎప్పటినుంచో చెబుతున్నారు. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గత విభేదాలకు దారితీసే అవకాశం ఉందని అంటున్నారు. తనపై కేసుల విచారణతో నిమిత్తం లేకుండా గతంలో ప్రకటించినట్టుగానే మంత్రులందరితో రాజీనామా చేయించాలని కూడా జగన్‌ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాలన్నింటినీ పార్టీలోని సీనియర్‌ నాయకులు నిశితంగా గమనిస్తున్నారు. ఒకవైపు పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుండగా, ముఖ్యమంత్రిగా జగన్‌ స్థానంలో భారతీ రెడ్డి నియమితులైతే సమర్థించాలా? లేదా? అని వారు తర్జనభర్జన పడుతున్నారు. దీంతో పలువురు మంత్రులు, శాసనసభ్యులు విజయమ్మను, షర్మిలను సంప్రదిస్తున్నారు. జగన్‌ రెడ్డికి శిక్షపడితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి అంగీకరించవలసిందిగా వారిలో కొందరు విజయమ్మను కోరుతున్నట్టు భోగట్టా. భారతీరెడ్డి ముఖ్యమంత్రి కావడం షర్మిలకు సుతరామూ ఇష్టం లేదు. దీంతో సోదరుడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసి వస్తే తల్లిని ముఖ్యమంత్రిని చేయాలని షర్మిల అభిప్రాయపడుతున్నట్టు చెబుతున్నారు. విజయమ్మ కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నారని అంటున్నారు. అదే నిజమైతే ముఖ్యమంత్రిగా ‘తల్లా? పెళ్లామా?’ తేల్చుకోవాల్సిన పరిస్థితి జగన్‌ రెడ్డికి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా వెళ్లకపోయినా, ముఖ్యమంత్రి పదవికి తల్లిని ప్రతిపాదించడం ద్వారా సోదరుడు జగన్‌పై తన అక్కసును తీర్చుకోవాలని షర్మిల ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి జగన్‌ రెడ్డికి శిక్ష పడుతుందో లేదో తెలియదు. విచారణ వేగంగా జరగడానికి జగన్‌ అండ్‌ కో సహజంగానే సహకరించరు. అయినా జరగబోయే పరిణామాలపై రాజకీయ పార్టీలలో చర్చ జరగడం సహజం. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ వేగంగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు పట్టుదలగా ఉన్నందున జగన్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడటం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో జగన్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను మినహాయిస్తే మిగతా వర్గాల ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని అధికార పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. మరోవైపు కేసుల విషయంలో కేంద్రప్రభుత్వం నుంచి ఉపశమనం లభించే పరిస్థితి కనిపించకపోవడంతో ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి కొంత ఒత్తిడికి గురవుతున్నారు. అయినా తాను ఆందోళన చెందుతున్నట్టు బయటపడకుండా ఆయన జాగ్రత్తపడుతున్నారు. ఈ మధ్య ఆయన కొన్ని మీడియా సంస్థలను అదే పనిగా తిట్టిపోస్తున్నారు. దీన్నిబట్టి ఆయనకు అంతో ఇంతో సెగ తగులుతోందని భావించవచ్చు. మరో మూడు నెలలు గడిస్తే జగన్‌ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తిచేసుకుంటుంది. ఆయన ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారా? వ్యతిరేకంగా ఉన్నారా? అన్న విషయమై అప్పటికి స్పష్టత వస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నట్టు నిర్ధరణ అయితే జగన్‌ రెడ్డికి కష్టాలు మొదలవుతాయి. ఒకవైపు నుంచి కేసుల విచారణ, మరోవైపు నుంచి పార్టీలో అసంతృప్తుల స్వరం ఆయనను ఉక్కిరి బిక్కిరి చేసే అవకాశం ఉంది. ఎంత బలమైన నాయకుడైనా ప్రజాభిమానం కోల్పోతే పార్టీపై పట్టును కూడా కోల్పోతారు. భవిష్యత్తు పరిణామాలు ఏ విధంగా ఉండనున్నాయి అనేదాన్ని బట్టి వైసీపీ ఫ్యూచర్‌ ఆధారపడి ఉంటుంది. అవినీతి కేసుల నుంచి బయటపడితే జగన్‌ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఏమీ ఉండదు. కేసుల నుంచి ఆయన పులు కడిగిన ముత్యంలా బయటపడితే మాత్రం ఆయన మళ్లీ బలం పుంజుకుంటారు. ఇప్పటి మాదిరిగానే పార్టీపై పట్టు ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ముప్పు కూడా ఏమీ ఉండదు. ఇందులో ఎక్కడ తేడా జరిగినా పరిస్థితులు మరోలా ఉంటాయి. అయితే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాఖలు చేసిన కేసుల నుంచి నిర్దోషిగా బయటపడటం అంత తేలిక కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలతో పాటు వైసీపీ నాయకులు కూడా భవిష్యత్‌ పరిణామాలు ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పదవికి విజయమ్మ, భారతీరెడ్డి పోటీ పడే పరిస్థితి వస్తే ఢిల్లీ లోని బీజేపీ పెద్దల ఆశీస్సులు ఉన్నవారే సీఎం అవుతారు. తమిళనాడులో గతంలో జరిగిన పరిణామాలను ఈ సందర్భంగా పలువురు ఉదహరిస్తున్నారు. ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాజనితంగా కనిపిస్తున్నాయి కానీ వైపీసీకి చెందిన ఏ నలుగురు కలిసినా ఇవే విషయాలను మాట్లాడుకుంటున్నారు.


ఏమైంది ఏపీ అధికారులకు?

ఈ విషయం అలా ఉంచితే కోర్టు ధిక్కరణ కేసులలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారులు తరచుగా శిక్షలకు గురవుతున్నారు. తాజాగా ఒకేసారి ఐదుగురు అధికారులను హైకోర్టు శిక్షించడం చర్చనీయాంశం అయింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ న్యాయస్థానం మెట్లెక్కి క్షమాపణ చెప్పుకోవడం పరిపాటి అయింది. గతంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఐఏఎస్‌ అధికారులు కోర్టు ధిక్కరణ కేసులు ఎదుర్కోలేదు. ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు మాత్రమే ఈ దుస్థితి ఎందుకు ఏర్పడుతోందంటే, తాము స్వతంత్రంగా పనిచేయవచ్చునని, చట్టాలను, నిబంధనలను పాటించాలనీ ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు మరచిపోవడమే! అఖిల భారత సర్వీసు అధికారులు ఇంతలా ఎందుకు దిగజారిపోయారో? అని న్యాయనిపుణులు కూడా ఆందోళన చెందుతున్నారు. న్యాయస్థానాలు ఇచ్చే ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వాలు భావించడం వల్లనే ఇటువంటి దుస్థితి నెలకొంది. గతంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలను తప్పుబట్టిన సందర్భాలలో మంత్రులు, ముఖ్యమంత్రి సైతం రాజీనామా చేసిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పటి పాలకుల చర్మం మొద్దుబారిపోయింది. న్యాయస్థానాలను ధిక్కరించడం హీరోయిజం అనుకుంటున్నారు. ప్రభుత్వంలో న్యాయం జరగనప్పుడు ఎవరైనా న్యాయస్థానం తలుపే తడతారు. న్యాయస్థానం ఆదేశాలు కూడా అమలుకాకపోతే ప్రజల గతి ఏమిటి? అఖిల భారత సర్వీసు అధికారులు కూడా తమకు ప్రభుత్వంలో అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయస్థానం గడపే తొక్కుతారు కదా! అలాంటి అధికారులు రాజకీయ బాస్‌ల ముందు గంగిరెద్దుల్లా తలలూపుతూ న్యాయస్థానాల ఆదేశాలను అమలుచేయకపోవడం క్షమించరాని నేరం. ఇలాంటి వారి విషయంలో హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మరింత కఠినంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది!

ఆర్కే


యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Updated Date - 2021-09-05T05:37:35+05:30 IST