15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు

ABN , First Publish Date - 2022-08-11T05:28:29+05:30 IST

ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్‌ (ఫ్యామిలీ డాక్టర్‌)సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు.

15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్‌ సేవలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ సూర్యకుమారి


వెల్‌నెస్‌ సెంటర్‌ లేదా సచివాలయంలో విధులు
జ్వరాల నియంత్రణకు చర్యలు
కలెక్టర్‌ సూర్యకుమారి
కలెక్టరేట్‌, ఆగస్టు 10:
ఈ నెల 15 నుంచి ఫ్యామిలీ ఫిజీషియన్‌ (ఫ్యామిలీ డాక్టర్‌)సేవలను ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి ఆదేశించారు. జిల్లా వైద్యాధికారులతో బుధవారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్యామిలీ డాక్టర్‌ సేవలను వెల్‌నెస్‌ సెంటర్లు లేదా సచివాలయాల్లో అందజేయనున్నట్లు చెప్పారు. స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి ఈ సేవలు అందజేయాల్సి ఉందని, దీనికి కావాల్సిన ముందులు, ఫర్నీచర్‌ సిద్ధం చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న ఓ డాక్టర్‌ గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారని, మరో డాక్టర్‌ పీహెచ్‌సీలో ఉండి రోగులను చూస్తారని తెలిపారు. ప్రతి గ్రామానికీ డాక్టర్‌ కనీసం నెలకు ఒక్క సారైనా వెళ్లే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలన్నారు. ఆ తరువాత నెలలో రెండుసార్లు వెళ్లేలా చూడాలని చెప్పారు. ఉదయం రోగులకు పరీక్షిస్తారని, మధ్యాహ్నం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, హాస్టల్‌కు వెళ్లి పిల్లలను పరీక్షిస్తారని తెలిపారు. డాక్టరు పేరు, ఫోన్‌ నెంబరును వెల్‌నెస్‌ సెంటర్‌లో రాసి పెట్టాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టిన ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేయాలన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎం.అశోక్‌కుమార్‌, డీపీవో ఇందిరా రమణ, ఇన్‌చార్జి జిల్లా వైద్యాధికారి రాణి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టరు లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బాలల సంక్షేమ సమితి త్రైమాసిక సమీక్ష సమావేశాన్ని కలెక్టర్‌ ఏర్పాటు చేశారు.


Updated Date - 2022-08-11T05:28:29+05:30 IST