అంత్యక్రియలు చేయం.. తేల్చిచెబుతున్న జియోనా చానా కుటుంబ సభ్యులు..

ABN , First Publish Date - 2021-06-15T21:13:58+05:30 IST

ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం యజమాని జియోనా చానా అనే 76 ఏళ్ల వ్యక్తి ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి ఏకంగా మీజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా సంతాపం తెలిపారంటే ఆయన ఎంత ప్రముఖులో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

అంత్యక్రియలు చేయం.. తేల్చిచెబుతున్న జియోనా చానా కుటుంబ సభ్యులు..

ఐజ్వాల్‌ (మిజోరామ్‌): ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం యజమాని జియోనా చానా అనే 76 ఏళ్ల వ్యక్తి ఆదివారం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మరణానికి ఏకంగా మీజోరాం ముఖ్యమంత్రి జోరమ్‌తంగా సంతాపం తెలిపారంటే ఆయన ఎంత ప్రముఖులో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. జియోనా చానాకు 38 మంది భార్యలు, 89 మంది పిల్లలు ఉన్నారు. 33 మంది మనవలు, మనవరాళ్లు, కోడళ్లనూ కలుపుకుంటే కుటుంబ సభ్యుల సంఖ్య 160 పైమాటే. ఇంత పెద్ద కుటుంబానికి యజమాని జియోనా చానా. ఆ కుటుంబం నివసించడం వల్లే భక్తవంగ్ గ్రామం ఓ పర్యాటక కేంద్రంగా కూడా మారింది. జియోనా చానా కుటుంబం లల్ఫా కోహ్రన్ థార్ అనే మతాన్ని అనుసరిస్తూ వస్తోంది. ఈ మతంలో పురుషులకు బహుభార్యత్వానికి అనుమతి ఉంది. జియోనా చానా హైపర్‌టెన్షన్, డయాబెటిస్ కారణంగా మరణించారని ఆదివారం వైద్యులు తేల్చారు. అయితే ఆయన కుటుంబ సభ్యులు మాత్రం జియోనా చానా మరణించలేదని తేల్చి చెబుతున్నారు. ఆయన మరణవార్తలను కొట్టిపారేయడమే కాకుండా అంత్యక్రియలను కూడా నిర్వహించకుండా మృతదేహంతో సహా ఇంట్లోనే ఉంటున్నారు. 


‘మా తండ్రి గారి శరీరం వేడిగా ఉంది. ఆయన నాడి కూడా కొట్టుకుంటోంది. ఆయన చనిపోలేదు. బతికే ఉన్నారు’ అంటూ జియోనా చానా కుమారులు స్పష్టం చేస్తున్నారు. ఐజ్వాల్‌లోని ట్రినిటీ ఆసుపత్రి డాక్టర్లు జియోనా చానా మరణించాడని ధృవీకరించాక మృతదేహాన్ని ఇంటికి తరలించారు. ‘ఇంటికి తీసుకు వచ్చిన తర్వాత జియోనా చానా నాడి కొట్టుకోవడం మొదలయింది. ఆయన శరీరం వేడిగా ఉంది. చనిపోతే శరీరం చల్లబడాలి కదా. ఆయన మళ్లీ బతికారని కుటుంబ సభ్యులంతా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు, భక్తవంగ్‌ గ్రామ ప్రజలు అస్సలు ఒప్పుకోరు’ అంటూ లల్ఫా కోహ్రన్ థార్ మతం సెక్రటరీ జైటిన్‌ఖుమా తేల్చిచెప్పారు. 

Updated Date - 2021-06-15T21:13:58+05:30 IST