మమ్మల్ని క్షమించండి

ABN , First Publish Date - 2021-06-24T06:14:40+05:30 IST

ఎవరికి ఏ కష్టం..

మమ్మల్ని క్షమించండి
కుటుంబ సభ్యులు (ఫైల్‌ ఫొటో)

కర్నూలులో కుటుంబం ఆత్మహత్య

విషం తాగిన దంపతులు, ఇద్దరు పిల్లలు

తమ చావుకు ఎవరూ కారణం కాదని నోట్‌

మంచి మనుషులు అంటున్న స్థానికులు

మానసిక వ్యాధిగా భావిస్తున్న పోలీసులు

కర్నూలు: ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయం చేయడంలో ముందుండే మనిషి. చుట్టుపక్కల వారితో సఖ్యతగా ఉండే కుటుంబం. ఎవరితోనూ ఏ గొడవలూ లేవు. ఆర్థిక సమస్యలూ లేవు. అనూహ్యంగా అందరూ ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని పాతబస్తీలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కడక్‌పురాకు చెందిన ప్రతాప్‌ (42), ఆయన భార్య హేమలత (36), కొడుకు జయంత్‌ (17), కూతురు రిషిత (13) ఆత్మహత్య చేసుకున్నారు. వీరు నలుగురూ మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా.. బుధవారం ఉదయం 8 గంటలకు వెలుగులోకి వచ్చింది.

కర్నూలులోని కడక్‌పురలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, బంధు మిత్రులు తెలిపిన సమాచారం మేరకు.. కడక్‌పురాకు చెందిన ప్రతాప్‌, స్థానికంగా టీవీ మెకానిక్‌గా పని చేసేవాడు. ఇదే కాలనీలో సొంత ఇంటి రెండో అంతస్తులో వీరి కుటుంబం ఉంటోంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌, మొదటి అంతస్తులో ప్రతాప్‌ సోదరులు ఇద్దరు ఉంటున్నారు. ప్రతాప్‌ కుటుంబం మంగళవారం రాత్రి వరకు అందరితో కలివిడిగా ఉన్నిందని, అందనీ పలకరించి సరదాగా గడిపారని స్థానికులు చెబుతున్నారు. పై అంతస్తులో ఉన్న వాటర్‌ ట్యాంకు నిండి, నీరు కిందికి పోతుండటంతో గమనించిన కింది అంతస్తులోని సోదరుడు, మోటార్‌ ఆఫ్‌ చేయమని చెప్పేందుకు ప్రతాప్‌కు ఫోన్‌ చేశాడు. ఎంత సేపటికీ ఫోన్‌ లిఫ్టు చేయకపోవడంతో పైకి వెళ్లాడు. ఇంట్లోంచి టీవీ శబ్దం వినిపించింది. పిలిచినా ఎవరూ పలకపోవడంతో అనుమానం వచ్చి చుట్టుపక్కల వారిని పిలిపించి తలుపులు పగులగొట్టాడు.

లోపలికి వెళ్లి చూస్తే.. ప్రతాప్‌, అతని భార్య, పిల్లలు విగతజీవులుగా పడి ఉన్నారు. వెంటనే ప్రతాప్‌ సోదరుడు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వన్‌టౌన్‌ సీఐ వెంకటరమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల పక్కన చక్కెర డబ్బా, పాలగ్లాసులు కనిపించాయి. పాలల్లో విషం కలుపుకొని తాగి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


మానసిక వ్యాధితోనే..?
ప్రతాప్‌ కొంతకాలంగా మానసిక వ్యాధితోనే బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రతాప్‌ తల్లిదండ్రులు ఏడాది క్రితం అనారోగ్యంతో ఒకరి తర్వాత ఒకరు మృతి చెందారు. నెల క్రితం ఆయన మిత్రుడు కూడా అనారోగ్యంతో మృతి చెందారని సమాచారం. కొన్ని రోజల క్రితం ప్రతాప్‌ సోదరుడి భార్య కూడా అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె కర్మకాండలను ప్రతాప్‌ దగ్గరుండి పూర్తి చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ నలుగురి మరణం కారణంగా ప్రతాప్‌ మానసిక వేదనకు గురై ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఏ చెడు అలవాట్లు లేని ప్రతాప్‌ అందరితో కలిసి మెలిసి ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు.

ఎవరికి ఏ సాయం అవసరమైనా ముందుండేవాడని గుర్తు చేసుకుంటున్నారు. ప్రతాప్‌ కొడుకు జయంత్‌ బృందావన్‌ కాలేజీలో పాలిటెక్నిక్‌ డిప్లొమా, కూతురు రిషిత విద్యానగర్‌ మాంటిస్సోరి స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నారు. వీరి కుటుంబానికి ఆర్థిక సమస్యలు కూడా ఏమీ లేవని అందరూ చెబుతున్నారు. ఇటీవలే ప్రతాప్‌ రూ.30 లక్షలు వెచ్చించి ఒక స్థలాన్ని కూడా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండేవారని, వారు ఇప్పటివరకు ఎవరితోనూ గొడవపడిన దాఖలాలు లేవని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు కూడా ఏమీ లేవని తెలుస్తోంది. ఒక్కసారిగా అందరూ ఆత్మహత్య చేసుకునేంత కష్టం ఏమొచ్చిందో అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రతాప్‌ మానసికవ్యాధితో బాధపడుతున్నాడని అనుమానిస్తున్నారు. ఈ కారణంగానే ముందుగా భార్య, పిల్లలకు పాలలో విషం కలిపి ఇచ్చాడని, వారు చనిపోయారని తెలుసుకున్న తర్వాత తాను ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 


సూసైడ్‌ నోట్‌ లభ్యం
ప్రతాప్ వద్ద సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమ చావుకు ఎవరూ కారణం కాదని, మానసిక బాధతోనే ఆత్మహత్యకు చేసుకుంటున్నానని అందులో ఉంది. తనకు అప్పులు లేవని, ఎవరికీ ఎవరూ అప్పు లేరని అందులో రాసుంది. మిత్రులు, బంధువులు తమను క్షమించాలని రాసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు బంధువులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ వెంకటరమణ తెలిపారు.

Updated Date - 2021-06-24T06:14:40+05:30 IST