ఎఫ్‌ఎంసీకీ ఓ రేటు!

ABN , First Publish Date - 2021-07-20T06:41:28+05:30 IST

అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కరోనా మృతుల కుటుంబాలను రెవెన్యూ సిబ్బంది కంటతడి పెట్టిస్తున్నారు.

ఎఫ్‌ఎంసీకీ ఓ రేటు!

విజయవాడ ‘తూర్పు’లో దందా! 

ఆర్‌ఐ, వీఆర్వోల మధ్య  దరఖాస్తులు 

కరోనా మృతుల కుటుంబ సభ్యులకు చుక్కలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : అయినవారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కరోనా మృతుల కుటుంబాలను రెవెన్యూ సిబ్బంది కంటతడి పెట్టిస్తున్నారు. తనవారిని కోల్పోయి ఆర్థిక లావాదేవీల నిమిత్తం ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసీ) కోసం వస్తున్న వారికి విజయవాడ తూర్పు మండల రెవెన్యూ సిబ్బంది చుక్కలు చూపిస్తున్నారు. ప్రతి దరఖాస్తుకూ ఓ ధర నిర్ణయించి, అంతమొత్తంలో ఇస్తేనే పని పూర్తి చేస్తున్నారన్న ఆరోపణలు తీవ్రంగా వస్తున్నాయి. తూర్పు నియోజకవర్గం పరిధిలో కరోనా ఎన్నో కుటుంబాలను విషాదంలో ముంచెత్తింది. కరోనాతో మృతి చెందిన వారికి సంబంధించి ఆర్థిక లావాదేవీలకు ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ (ఎఫ్‌ఎంసీ) అవసరం అవుతోంది. దీనికోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకుంటే వీటిని పరిష్కరించకుండా తూర్పు మండల ఆర్‌ఐ, వీఆర్వోలు కాలయాపన చేస్తున్నారు. ఇలా తూర్పు మండల పరిధిలో పెద్ద సంఖ్యలో ఎఫ్‌ఎంసీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. స్థానిక ఆర్‌ఐ, వీఆర్వోలు సిండికేట్‌ కావటంతో ఉద్దేశపూర్వకంగా దరఖాస్తుదారులను ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వార్డు సచివాలయాల పరిధిలో ఎఫ్‌ఎంసీలకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓ పక్కన ప్రభుత్వం చెబుతున్నా విచారణ తతంగం అంతా తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలోనే ఉంటోంది. ఎంతో మంది చిరుద్యోగులు, ఉద్యోగులు తూర్పు మండల పరిధిలో చనిపోయారు. వీరు పీఎఫ్‌ విత్‌ డ్రాయల్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే కచ్చితంగా ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతుంది. ఇటీవల ఇబ్రహీం అనే వ్యక్తి నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయారు.  రెవెన్యూ సిబ్బంది ఎంతకూ సమస్యను పరిష్కరించకపోవడంతో ఓ కార్పొరేటర్‌ను వెంటబెట్టుకుని తహసీల్దార్‌ను కలిసి విలపించారు. తహసీల్దార్‌, ఆర్‌ఐను పిలిచి చీవాట్లు పెట్టడంతో అప్పటికప్పుడు క్లియర్‌ చేశారు. ఓ పారిశుధ్య కార్మికుడు చనిపోతే ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇదే విధమైన నరకాన్ని చూపించారు. ఇటువంటి సంఘటనలు తూర్పు నియోజకవర్గంలో ఎన్నో..

Updated Date - 2021-07-20T06:41:28+05:30 IST