విదేశాల నుంచి భారత్‌కు వస్తున్నారా? ఈ విషయాలను మాత్రం మర్చిపోకండి

ABN , First Publish Date - 2021-03-03T18:35:26+05:30 IST

భారతదేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్రం విదేశీ ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలను

విదేశాల నుంచి భారత్‌కు వస్తున్నారా? ఈ విషయాలను మాత్రం మర్చిపోకండి

దుబాయి: భారతదేశంలో కరోనా కొత్త స్ట్రెయిన్ కేసులు బయటపడటంతో కేంద్రం విదేశీ ప్రయాణీకులకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అయితే విదేశాల నుంచి భారత్‌కు వస్తున్న అనేక మంది ప్రయాణీకులకు ఈ మార్గదర్శకాల గురించి తెలియకపోవడంతో వారు విమానం ఎక్కకుండానే వెనుదిరగాల్సి వస్తోంది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రయాణీకులు ఎయిర్ సువిదా పోర్టల్‌లో కొవిడ్-19 ఆర్టీపీసీఆర్ టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్‌ను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రయాణ తేదీకి మూడు రోజుల ముందుగా చేయించుకున్న రిపోర్ట్‌ను మాత్రమే ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.


అంతేకాకుండా ఇదే పోర్టల్‌లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. ఒకే విమానంలో గమ్యస్థానానికి చేరుకుంటారా లేదా భారత్‌కు వచ్చేందుకు మధ్యలో మరో విమానం మారతారా వంటి ప్రశ్నలకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో సమాధానాలివ్వాల్సి ఉంటుంది. గడిచిన 14 రోజుల్లో యూకే, మెక్సికో, దక్షిణ ఆఫ్రికాకు ప్రయాణం చేసి ఉంటే తప్పకుండా ఆ వివరాలను సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లో తెలియజేయాలి. ఈ వివరాలను ఇచ్చిన తర్వాత ప్యాసెంజర్లకు అప్రూవల్ కోడ్ వస్తుంది. ఈ కోడ్‌ను విమానం ఎక్కే ముందు అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ కోడ్‌‌తో పాటు రెండు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ కాపీలను దగ్గర ఉంచుకోవాలి. హైదరాబాద్ వచ్చే వారైతే నాలుగు కాపీలను తమ వద్ద పెట్టుకోవాలి.


కేంద్ర మార్గదర్శకాల గురించి తెలియకపోవడంతో మంగళవారం దాదాపు పది మంది భారతీయులు దుబాయి నుంచి భారత్‌కు రాలేకపోయారు. ఎయిర్ సువిదా పోర్టల్‌లో రిజిస్టర్ కాకపోవడం, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌లను చూపించకపోవడం కారణంగానే వారిని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది విమానం ఎక్కకుండా నిలిపివేశారు. ప్రయాణానికి రెండు గంటల ముందు దుబాయి ఎయిర్‌పోర్ట్‌లో సదరు భారతీయులు ఎయిర్ సువిదా పోర్టల్‌లో రిజిస్టర్ అయ్యేందుకు ప్రయత్నించినా సర్వర్ క్రాష్ అవడంతో విమానం ఎక్కలేకపోయారు.


ఎయిర్‌లైన్స్ తమకు ముందుగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటూ ఫ్లైట్ ఎక్కలేకపోయిన బాధితుడు వాదించాడు. ప్రమోషన్ ఆఫర్ల గురించి మెసేజ్‌లను పంపారు తప్ప తమకు మార్గదర్శకాల గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదంటూ ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. మరోపక్క ఎయిర్‌లైన్స్ సిబ్బంది మాత్రం తాము కచ్చితంగా కేంద్ర మార్గదర్శకాలను ప్రతి ఒక్క ప్యాసెంజర్‌కు పంపుతున్నట్టు తెలిపింది. 

Updated Date - 2021-03-03T18:35:26+05:30 IST