కాపురాల్లో కలహాలు

ABN , First Publish Date - 2022-08-07T06:39:56+05:30 IST

వేధింపులు తట్టుకోలేక వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుని ఆమె డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌ (డీవీసీ)ను ఆశ్రయించింది.

కాపురాల్లో కలహాలు

కారణం...అనుమానాలు, అపోహలు

డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌కు పెరుగుతున్న ఫిర్యాదులు

వివాహమైన ఏడాది, రెండేళ్లకే విడిపోతున్న జంటలు

పెళ్లికి ముందు అభిరుచులు, అలవాట్లు, స్నేహితుల గురించి ఆరాలు...వేధింపులు

భార్య, భర్త...ఒకరి మాటను మరొకరు

గౌరవించకపోవడం వల్ల పెరుగుతున్న దూరం

చిన్న చిన్న సమస్యలను పెద్దవి చేసుకుంటూ విడాకుల వరకూ వెళుతున్న వైనం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

నగరంలోని ఎంవీపీ కాలనీకి చెందిన యువతికి ఏడాది కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందు పూణేలో ఉద్యోగం చేసేది. తరువాత భర్తతో కలిసి ఇక్కడే ఉంటోంది. అయితే, పెళ్లికి ముందు స్నేహితులతో వున్న ఫొటోలు, మోడరన్‌ డ్రెస్‌లు వేసుకున్న ఫొటోలు సేకరించి భర్త వేధించడం మొదలుపెట్టాడు. అతడి వేధింపులు తట్టుకోలేక వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుని ఆమె డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌ (డీవీసీ)ను ఆశ్రయించింది.

అనకాపల్లి ప్రాంతానికి చెందిన ఓ యువతికి ఏడాదిన్నర కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందు టిక్‌టాక్‌లు చేసినట్టు భర్తకు చెప్పింది. అప్పుడు మెచ్చుకున్న అతను సడన్‌గా కొద్దిరోజుల నుంచి పాత వీడియోల గురించి  ప్రస్తావిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడు. టిక్‌టాక్‌లు చేసే సమయంలో ఎంతమందితో పరిచయాలు ఉన్నాయి, ఎవరెవరితో చాటింగ్‌లు చేశావ్‌...అంటూ అనుమానం వ్యక్తంచేస్తూ శారీరకంగా హింసించడంతో బాధితురాలు డీవీ సెల్‌లో మొరపెట్టుకుంది.

‘ఆయన శైలి బొత్తిగా నచ్చడం లేదు. ఎక్కువగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ అంటూ ఆన్‌లైన్‌లో గడుపుతున్నారు. ఎవరితోనూ సంబంఽధాలు నెరుపుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మారడం లేదు. అటువంటి వ్యక్తికి దూరంగా ఉండాలనుకుంటున్నా’

- మధురవాడ ప్రాంతానికి చెందిన ఓ మహిళ 


...ఇవీ ఇటీవల కాలంలో ఎంవీపీ కాలనీలోని డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌ (డీవీ సెల్‌)కు వచ్చిన కేసుల్లో కొన్ని. డీవీ సెల్‌కు ప్రతి నెలా 25-30 వరకు కేసులు వస్తే, ఏడెనిమిది వరకూ ఇటువంటివే ఉంటున్నాయి. వివాహమైన రెండు, మూడేళ్లు కాకముందే అనుమానాలు, మనస్పర్థలతో పచ్చని కాపురాల్లో చిచ్చు పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగు తుండడం ఆందోళన కలిగిస్తోంది. 


భిన్నమైన కేసులు

గతంలో డొమెస్టిక్‌ వయలెన్స్‌ సెల్‌కు ఎక్కువగా కట్నం వేధింపులు, అత్తమామలు, ఆడపడుచులు వేధింపులపై ఫిర్యాదులు వస్తుండేవి. ప్రస్తుతం అనుమానాలు, మన స్పర్థలతో గొడవలు పడుతున్న కేసులు ఎక్కువగా వస్తున్నట్టు డీవీ సెల్‌ అధికారులు చెబుతున్నారు. చిన్న చిన్న సమస్య లను కొంతమంది పెద్దవిగా చేసుకుంటున్నారంటు న్నారు. పెళ్లికి ముందు ఫలానా వారితో కలిసి తిరిగావంటా... అంటూ భార్య/భర్త గొడవలకు దిగుతున్నారు. ఇవి క్రమంగా పెరిగి, పెద్దవై దూరం పెరిగేందుకు కారణమవుతున్నాయి. 


మాటకు మాటా.. 

భార్య/భర్త...ఒకరి మాటను మరొకరు గౌరవించకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతోంది. నువ్వు చెప్పిన మాటను నేను ఎందుకు వినాలి...అనే భావన ప్రస్తుతం ఎక్కువ మంది జంటల్లో కనిపిస్తోంది. టిక్‌టాక్‌కు దూరంగా వుండాలని చెప్పినందుకు భర్తతో గొడవకు దిగింది ఒక మహిళ. ఇష్టం వచ్చినట్టు ఆంక్షలు పెడితే కలిసి వుండ లేనంటూ తేల్చిచెప్పింది.


డెలివరీ బాయ్‌కు రేటింగ్‌ ఇస్తే...అనుమానం

ఆన్‌లైన్‌లో ఫుడ్‌ డెలివరీ ఇచ్చిన తరువాత...సదరు డెలివరీ బాయ్స్‌ రేటింగ్‌ కోరుతుంటారు. అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన ఒక మహిళ...సమయానికి డెలివరీ ఇవ్వడంతో గుడ్‌ అంటూ సదరు డెలివరీ బాయ్‌కు మంచి రేటింగ్‌ ఇచ్చింది.  అది చూసిన భర్త...సదరు బాయ్‌తో సంబంధాన్ని అంట గడుతూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ల నుంచీ సాగుతోందీ వ్యవహారం అంటూ రోజూ సూటిపోటి మాటలతో వేధిస్తుండడంతో ఆమె భరించలేక డీవీ సెల్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరికీ కౌన్సెలింగ్‌ ఇచ్చే క్రమంలో...పెళ్లి అయిన మొదటి రోజు నుంచీ భార్యపై అతను అనుమానాన్ని కలిగి వున్నట్టు అధికారులు గుర్తించారు. 


సెల్‌ఫోన్‌తో తంటా.. 

భార్య,భర్తల గొడవలకు సెల్‌ఫోన్‌ కూడా కారణమవు తోంది. సెల్‌ఫోన్‌తో ఎక్కువ సమయం గడుపుతుండడం, సోషల్‌ మీడియాలో స్నేహితుల చిట్టా చూసి వాకబు చేయడం, ఫోన్‌ హిస్టరీ వెతకడం వంటి చర్యలతో ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోయి...వైవాహిక బంధాన్ని తెంచుకునే వరకూ వెళుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు భౌతిక దాడులకు దిగుతున్న సందర్భాలు ఉంటున్నాయి. గొడవలతో విడిపోవాలని నిర్ణయించుకుంటున్న వాళ్లు...తమ పిల్లల గురించి కూడా ఆలోచించడం లేదు. 


చిన్న సమస్యను పెద్దది చేసుకుంటున్నారు

- బీడీ జ్యోతిలత, కౌన్సిలర్‌, డీవీ సెల్‌

ఒక్కమాటతో పరిష్కారమయ్యే సమస్యలను పెద్దవి చేసుకుంటున్నారు. ఫోన్‌ అతి వినియోగించడం వల్ల గొడవలు జరుగుతున్నాయని ఇద్దరికీ తెలిసినా దానికి దూరంగా ఉండలేకపోతున్న వాళ్లు ఎందరో ఉన్నారు. మరి కొందరు అనుమానాలతో జీవితాలను నాశనం చేసు కుంటున్నారు. ఆ అనుమానాల్లో నిజం లేదని అనేక సందర్భాల్లో తేలింది. పెళ్లికి ముందు జీవితాన్ని గురించి తెలుసుకునేందుకు యత్నించడం, అప్పటి విషయాల గురించి ఎక్కువగా మాట్లాడడం వల్ల దంపతుల మధ్య గొడవలు వస్తున్నాయి. ఈ తరహా కేసుల్లో ఇరువురికీ కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. అప్పటికీ పరిష్కారం కాకపోతే కోర్టులో వేస్తున్నాం. 

Updated Date - 2022-08-07T06:39:56+05:30 IST