కరోనా భయంతో మృతదేహం లేకుండానే అంత్యక్రియలు

ABN , First Publish Date - 2020-05-23T12:11:32+05:30 IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో మృతదేహం లేకుండానే మృతుడి కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపిన వింత ఉదంతం....

కరోనా భయంతో మృతదేహం లేకుండానే అంత్యక్రియలు

భువనేశ్వర్ (ఒడిశా): కరోనా సంక్షోభం నేపథ్యంలో మృతదేహం లేకుండానే మృతుడి కుటుంబసభ్యులు అంత్యక్రియలు జరిపిన వింత ఉదంతం ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లా హరీపూర్ గ్రామంలో జరిగింది.గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వలసకార్మికుడిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి లాక్‌డౌన్‌లో చిక్కుకొని తన స్వస్థలమైన హరీపూర్ గ్రామానికి తిరిగివచ్చాడు. ఆస్తమాతో బాధపడుతున్న వలసకార్మికుడిని అతని కుటుంబసభ్యులు ఈ నెల 12వతేదీన భంజానగర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి బెర్హంపూర్ నగరంలోని ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు పంపించారు. మెడికల్ కళాశాల వైద్యులు రోగిని సీతాలపల్లిలోని కొవిడ్ ఆసుపత్రికి పంపించారు.కరోనా లక్షణాలతో రోగి మరణించడంతో అతని మ‌ృతదేహానికి పరీక్షలు జరిపారు. పరీక్షల్లో వలసకార్మికుడికి కరోనా లేదని నెగిటివ్ రిపోర్టు వచ్చినా అధికారులు పొరపాటున అతనిపేరు  కరోనా వైరస్‌తో మరణించాడని తప్పుగా ప్రకటించారు. కరోనాతో మరణించాడని అధికారులు తప్పుగా ప్రకటించినా అతని మృతదేహానికి గ్రామంలో దహనం చేసేందుకు హరీపూర్ గ్రామస్థులు అభ్యంతరం చెప్పారు. దీంతో చేసేదిలేక అతని మృతదేహానికి సీతాలపల్లిలో అంత్యక్రియలు జరిపించేశారు. అనంతరం మృతుడి కుటుంబసభ్యులు ఇసుకతో ఓ మృతదేహం బొమ్మను తయారు చేసి దాన్ని హరీపూర్ గ్రామంలో దహనం చేసి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు జరిపారు. మృతదేహం లేకుండా జరిపిన అంత్యక్రియల్లో మృతుడి కుటుంబసభ్యులతో పాటు సమీప బంధువులు పాల్గొని నివాళులు అర్పించారు.

Updated Date - 2020-05-23T12:11:32+05:30 IST