నకిలీ.. మకిలి!

ABN , First Publish Date - 2022-06-10T08:04:51+05:30 IST

సోషల్‌ మీడియా... ఇది అభిప్రాయాలు వెల్లడించే వేదిక! విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసే వేదిక! విమర్శలకు సమాధానాలు చెప్పే వేదిక! ఇప్పుడు ఈ వేదికను ‘నకిలీ మకిలి’కి కేంద్రంగా మార్చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తప్పుడు ట్వీట్లు, పోస్టులు సృష్టిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన లెటర్‌

నకిలీ.. మకిలి!

సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం

తెలుగుదేశం పార్టీపై ‘నకిలీ’ల దాడి

చంద్రబాబు లెటర్‌హెడ్‌తోనే ప్రకటనలు.. పార్టీ నేతల పేర్లతో తప్పుడు ట్వీట్లు

గందరగోళం సృష్టించడమే లక్ష్యం.. ఇది వైసీపీ పనే అంటున్న టీడీపీ 


వైసీపీది అధర్మ యుద్ధం

‘‘వైసీపీది ఎప్పుడూ అధర్మ యుద్ధమే. తప్పుడు ప్రచారాలతో ప్రజలను నమ్మించడమే వైసీపీ సిద్ధాంతం. అధికారం కోసం నాడు ఎలా తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేశారో ఇప్పుడు కూడా అదే పంథాలో పనిచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో నిత్యం నకిలీ పోస్టులతో గందరగోళం సృష్టిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను అన్ని వేదికలపై దీటుగా ఎదుర్కోవాలి’ 

- చంద్రబాబు (గురువారం పార్టీ అధికార ప్రతినిధులకు నిర్వహించిన వర్క్‌ షాప్‌లో..)


సోషల్‌ మీడియా... ఇది అభిప్రాయాలు వెల్లడించే వేదిక! విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసే వేదిక! విమర్శలకు సమాధానాలు చెప్పే వేదిక! ఇప్పుడు ఈ వేదికను ‘నకిలీ మకిలి’కి కేంద్రంగా మార్చేస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా, తప్పుడు ట్వీట్లు, పోస్టులు సృష్టిస్తున్నారు. ఏకంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన లెటర్‌ హెడ్లనే సృష్టించి... వాటిపై ‘ప్రకటనలు’ జారీ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్‌ మీడియా దాడికి గురైన తెలుగుదేశం పార్టీయే... ఇప్పుడు మరోసారి ‘నకిలీ మకిలి’ని కడుక్కోలేక సతమతమవుతోంది. అధికార పార్టీ నుంచి ఆర్థిక సహకారం అందుకునే ‘పేటీఎం’ బ్యాచులే ఈ పని చేస్తున్నాయని, ప్రజలను అయోమయానికి గురిచేసేందుకే తప్పుడు ప్రచారంతో తెగబడుతున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది.


‘లోకేశ్‌కు పాదయాత్ర చేసే శక్తి లేదు. ఆ వార్తలు నమ్మవద్దు’ అంటూ చంద్రబాబు విడుదల చేసినట్లుగా సృష్టించిన నకిలీ ప్రకటన.


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

టీడీపీ నేత లోకేశ్‌ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారని ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ఒక వార్తా కథనం ప్రచురించింది. లోకేశ్‌ పాదయాత్ర చేయలేరనో, చేసినా విఫలమవుతుందనో వైసీపీ వర్గాలు సోషల్‌ మీడియాలో విమర్శించినా, వ్యాఖ్యానించినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ... ఏకంగా చంద్రబాబు లెటర్‌ హెడ్‌తో, ఆయనే విడుదల చేసినట్లుగా ఒక నకిలీ ప్రకటనను సృష్టించారు. ‘‘లోకేశ్‌కు పాదయాత్ర చేసే శక్తి లేదు. దీనిపై వచ్చిన వార్తలు నమ్మవద్దు’’ అని చంద్రబాబు కోరుతున్నట్లుగా దీనిని రూపొందించారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు వాడే లెటర్‌ హెడ్‌ను అచ్చంగా దించేశారు. ఈ ‘నకిలీ’ ప్రచారం టీడీపీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది. 


నకిలీ ట్వీట్ల పర్వం...

ట్విట్టర్‌ అకౌంట్‌లోని ప్రొఫైల్‌ ఫొటో, అకౌంట్‌ పేరు మొత్తం యథాతథంగా దించేసి... కింద మాత్రం తమ సొంత ట్వీట్‌ను జత చేయడం! ఇదో రకమైన నకిలీ మకిలి! దీనికి పలువురు టీడీపీ నేతలు బాధితులుగా మారారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పొత్తులకు సంబంధించి తమ ముందు మూడు ఆప్షన్లు ఉన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


 దీనిపై... మాజీ మంత్రి, టీడీపీ సీనియర్‌ నేత దేవినేని ఉమా ట్విట్టర్‌లో స్పందించినట్లుగా, పవన్‌ను దూషించినట్లుగా ఒక నకిలీ ట్వీట్‌ను సృష్టించారు. ఆ ఫొటోనే బాగా ప్రచారంలో పెట్టారు. జనసేన అభిమానులు నొచ్చుకుని, తీవ్రంగా స్పందించేలా దీనిని రూపొందించారు. ఇది నిజమని నమ్మి మంత్రి అంబటి రాంబాబు కూడా ట్విటర్‌లో ప్రతిస్పందించారు. ‘దీనికి సమాధానం చెప్పండి’ అంటూ దేవినేని ఉమకు ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. నకిలీ ట్వీట్‌కు మంత్రి ప్రచారం కల్పించడమేంటంటూ దీనిపై దేవినేని ఉమా సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల అమ్మఒడి పథకాన్ని రద్దు చేస్తున్నట్లు సృష్టించిన ఫేక్‌ పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకు సీఐడీ కేసు నమోదు చేసి, పలువురు టీడీపీ నేతలకు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అదే విధంగా... తమ పేరిట నకిలీ పోస్టులు పెడుతున్న వారిపైనా కేసులు పెట్టి, చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా డిమాండ్‌ చేశారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరిలకు కూడా ఇదే అనుభవం ఎదురైంది. పొత్తుల విషయంలోనే అవతలి వారిని రెచ్చగొట్టేలా వారి పేరుతో నకిలీ ట్వీట్లు తయారు చేసి ప్రచారంలో పెట్టారు.




టీడీపీ అప్రమత్తం

రెండు మూడు రోజుల వ్యవధిలోనే వరుసగా నకిలీ ట్వీట్లు తెరపైకి రావడంతో టీడీపీ నాయకత్వం అప్రమత్తమైంది. నకిలీ ట్వీట్లు, ప్రకటనలపై ‘ఫేక్‌’ అని ముద్ర వేసి ఆ పార్టీ ప్రచారంలోకి పెట్టడం మొదలు పెట్టింది. వైసీపీ ఏర్పాటు చేసుకొన్న సోషల్‌ మీడియా బృందాలు పనిగట్టుకొని ఈ వ్యవహారం నడిపిస్తున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ‘పోయిన ఎన్నికల్లో ఇదే మాదిరిగా వివిధ సామాజిక వర్గాల్లో టీడీపీపై ద్వేషం పెంచేలా పీకే టీమ్‌ ఒక వ్యూహం ప్రకారం సామాజిక మాధ్యమాలను వాడుకుంది. వివిధ కులాలు, సినీ నటుల అభిమానుల పేరుతో తామే నకిలీ ఖాతాలు తెరిచి వాటి ద్వారా ఈ కులాల వారు పరస్పరం తిట్టుకుంటున్నట్లు పోస్టింగులు పెట్టారు. సినీ నటుల అభిమానులను కూడా రెచ్చగొట్టారు. అప్పుడు ఈ వ్యూహాలను, దాని వల్ల జరిగే నష్టాన్ని మేం పసిగట్టలేకపోయాం. ఇప్పుడు  కూడా అదే వ్యూహాన్ని మొదలు పెట్టినట్లు అనిపిస్తోంది. ఈసారి దీనిని గట్టిగా తిప్పి కొడతాం’’ అని టీడీపీ రాష్ట్ర కార్యాలయ ముఖ్యుడొకరు చెప్పారు.

Updated Date - 2022-06-10T08:04:51+05:30 IST