Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 01:51:30 IST

కిందపడ్డా.. హూంకరింపు!

twitter-iconwatsapp-iconfb-icon
కిందపడ్డా.. హూంకరింపు!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అణు రాగాలాపనకు వైఫల్యం నుంచి వచ్చిన అసహనమే కారణం


‘‘ష్యాను బెదిరించేవారికి నేను ఒక్కటే చెప్తున్నా. మా దగ్గర కూడా అణ్వాయుధాలు ఉన్నాయి. నాటో దేశాల కంటే శక్తిమంతమైన ఆయుధ వ్యవస్థ ఉంది. రష్యాకు ముప్పుందని భావించినప్పుడు వాటన్నింటినీ మేం తప్పక ఉపయోగిస్తాం. ఇది బూకరింపు కాదు’’ ..అంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన వ్యాఖ్యలపైన, ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోకి 3 లక్షల మంది రిజర్వు సైనికులను పంపించే ఉత్తర్వులపై సంతకం చేయడంపైనా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగితే.. వారం, పదిరోజుల్లోనే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చన్న ధీమా రష్యాకు ఉందని.. కానీ, వాస్తవంలో ఆ ధీమా వమ్ము కావడం వల్లనే అసహనంతో పుతిన్‌ ఇలా మాట్లాడుతున్నారని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని ‘వైఫల్యం నుంచి వచ్చిన అసహనం’గా వారు అభివర్ణిస్తున్నారు. అణ్వాయుధాలపై పుతిన్‌ ప్రకటనను.. ఈ యుద్ధంలో రష్యా ఓటమి చెందినట్టు ఒప్పుకోవడంగా భావించాలని వారు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై పుతిన్‌ యుద్ధం ప్రకటించి దాదాపు ఏడు నెలలు అవుతోంది. ఇట్టే స్వాధీనం చేసుకోవచ్చనుకున్న ఉక్రెయిన్‌ కొరుకుడు పడకపోగా.. పశ్చిమదేశాల అండతో వ్యూహాత్మక దాడులతో పుతిన్‌ సేనలకు తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. కిలోమీటర్ల మేర దండు విడిసిన రష్యా యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసి రాజధాని కీవ్‌ దిశగా అడుగు ముందుకువేయలేని పరిస్థితిని కల్పించింది. అంతేకాదు.. కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌ సేనలు రష్యా స్వాధీనం చేసుకున్న లుహాన్స్క్‌ను తిరిగి చేజిక్కించుకునే దిశగా కదులుతున్నాయి. ఖెర్సన్‌లో రష్యా సేనలకు ఆహార, ఆయుధ సరఫరాను అడ్డుకుంటున్నాయి. చివరికి పరిస్థితి ఏ దశకు చేరిందంటే.. ఎప్పుడో 2014లో రష్యా చేజిక్కించుకున్న ఉక్రెయిన్‌ భూభాగాలను సైతం తిరిగి కోల్పోయే స్థితికి చేరింది. గెలుస్తామనుకుని కయ్యానికి కాలు దువ్వితే.. చివరకు చేతిలో ఉన్నది కూడా పోయే పరిస్థితి, పరువు పోయే దుస్థితి నెలకొంది. దీంతో.. కిందపడ్డా తనదే పైచేయి అని నిరూపించుకోవడానికి.. ఉక్రెయిన్‌లోని తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో తాము ఆక్రమించుకున్న నాలుగు ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని, ఆక్రమించుకున్న భూమి ‘ప్రాదేశిక సమగ్రత’ను ఎట్టిపరిస్థితుల్లోనూ కాపాడి తీరుతామని పుతిన్‌ ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక దేశం ఇలా మూడు లక్షల మంది రిజర్వు బలగాలను యుద్ధ రంగంలోకి పంపడానికి సిద్ధం కావడం ఇదే మొదటిసారి. 


అణు హెచ్చరిక.. సీరియస్సే..

పుతిన్‌ హూంకరింపులు అసహనం నుంచి పుట్టుకొచ్చినవేనని కొంతమంది రక్షణరంగ నిపుణులు అంటున్నప్పటికీ.. దానికి భిన్నమైన వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ‘‘దేశ ఉనికికి ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రమే సంప్రదాయ యుద్ధంలో తొలిసారి అణ్వాయుధాలను ప్రయోగించాలన్నది రష్యా అణు విధానం. ప్రస్తుతం పుతిన్‌ వ్యాఖ్యలు దానికి భిన్నంగా ఉన్నాయి. పైగా వచ్చేవారం నుంచి ఉక్రెయిన్‌లో తాము స్వాధీనం చేసుకున్న ప్రాంతాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తానని పుతిన్‌ అంటున్నారు. ఉక్రెయిన్‌ ఏమో తమ భూభాగాన్ని రష్యాకు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోబోమని అంటోంది. అంటే ఘర్షణ తప్పదు. ఈ పరిస్థితుల్లో.. అణ్వాయుధాలపై పుతిన్‌ చెప్పే మాటలను తీవ్రంగా పరిగణించాల్సిందే’’ అని ఐక్యరాజ్యసమితిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ డిజార్మమెంట్‌కు చెందిన అంద్రేయ్‌ బక్లిత్‌స్కీ అభిప్రాయపడుతున్నారు. 3 లక్షల మందికి పైగా రిజర్వు బలగాలను యుద్ధరంగంలోకి దింపుతుండడంతో సైనికుల కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి.

(సెంట్రల్‌ డెస్క్‌)

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.