కొనలేం.. తినలేం!

ABN , First Publish Date - 2021-04-12T04:46:36+05:30 IST

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి.

కొనలేం.. తినలేం!

భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు

సామాన్యులకు తప్పని ఆర్థిక ఇబ్బందులు

జాడలేని ధరల నియంత్రణ అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/గుజరాతీపేట)

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నూనె ధరలూ సలసల కాగుతున్నాయి. దీంతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా వైరస్‌ ప్రభావంతో అన్ని వర్గాలూ ఆర్థికంగా చితికిపోయాయి. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మందికి ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు కరువయ్యాయి. కొన్ని నెలల తర్వాత లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా.. చాలా రంగాలు ఇంకా కుదుటపడలేదు. ప్రస్తుతం కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకీ పెరుగుతుండడంతో.. ఇక ఏమీ కొనలేం.. తినలేం’ అని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు. ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 

రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఒకవైపు కరోనా కష్టాలు వెంటాడుతుండగా, మరోవైపు నిత్యావసరాల ధరలు భారమవుతున్నాయి. ధరలను నియంత్రించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. అధికారులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. దీంతో గత రెండేళ్ల నుంచి నిత్యావసరాల ధరలు నిలకడగా ఉండడం లేదు. ఈ రోజు ఉన్న ధర మరుసటి రోజుకు మారిపోతోంది. వినియోగదారులు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తంలో ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. చాలామంది అప్పులపాలవుతూ జీవనం సాగిస్తున్నారు. పెట్రోల్‌, డీజిల్‌తో పాటు వంట గ్యాస్‌ నుంచి పప్పులు, ఉప్పులు, నూనెల వరకూ అన్నింటా ధరలు దాదాపు రెట్టింపయ్యాయి. గడిచిన ఆరు నెలల్లో లీటరు పెట్రోలు ధర వందకు చేరువైంది. వంటగ్యాస్‌ సిలిండర్‌ ధర దడ పుట్టిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై సబ్సిడీ ఎత్తేయడంతో ఒక్కో సిలిండర్‌ ధర రూ.900 పడుతోంది. ఇక మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు రోజుకో రకంగా పెరిగిపోతున్నాయి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. పప్పులు, పండ్లు, కూరగాయలు, పాలు, మాంసం ధరలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి. ఐదునెలల కిందట వంట నూనె కిలో రూ.90 నుంచి రూ.100 వరకు ఉండేది. ప్రస్తుతం రూ.160 నుంచి రూ.180కి చేరింది. కూరగాయలు, పప్పుల ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే.. కిలోపై రూ.10 నుంచి రూ.30 వరకు పెరిగింది. దాదాపు అన్నిరకాల పప్పులు కిలో రూ.100కు పైగా విక్రయిస్తున్నారు. గతంలో మార్కెట్‌లో పెసరపప్పు కిలో ధర రూ.69 ఉండగా.. ప్రస్తుతం రూ.110 పలుకుతోంది. శనగపప్పు రూ.58 నుంచి రూ.80కి చేరింది. వేరుశనగ పలుకులు గతంలో రూ.72 ఉండగా... ప్రస్తుతం రూ.110 నుంచి రూ.125 వరకు విక్రయిస్తున్నారు. మినపపప్పు రూ.72 నుంచి రూ.110కి చేరింది. కందిపప్పు రూ.85 నుంచి రూ.110కి ఎగబాకింది. ఎండుమిర్చి గత ఏడాది కిలో రూ.120 ఉండగా... ప్రస్తుతం రూ.170కి చేరింది. ఇలా ధరలన్నీ పెరుగుతూనే ఉన్నాయి.  పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో సరుకుల రవాణాపై అదనపు భారం పడుతోందని... దీంతో నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

ధరల నియంత్రణ ఎక్కడ...

కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం గత ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ విధించింది. అప్పట్లో నిత్యావసర సరుకుల విక్రయాలకు మాత్రమే అనుమతించింది. అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై అధికారులు కఠినంగా వ్యవహరించారు. ప్రతి దుకాణం వద్ద ధరల పట్టిక ప్రదర్శించేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా అధిక ధరలకు విక్రయిస్తే.. వినియోగదారులకు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ప్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. తర్వాత లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించారు. రవాణా వ్యవస్థ మెరుగపడినా.. నిత్యావసరాల ధరలు మాత్రం పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రస్తుతం రెండో దశ వ్యాప్తిలో భాగంగా కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఉద్యోగ, ఉపాధి మార్గాలు కరువవుతున్నాయి. దీనికితోడు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలతో సామాన్యులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపారులు ఎమ్మార్పీ కన్నా అధిక ధరలకు విక్రయిస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఎప్పటికప్పుడు ధరలను పరిశీలించి.. వాటిని నియంత్రించాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు. దీంతో ధరలకు కళ్లెం పడడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జిల్లావాసులు కోరుతున్నారు.  

 

Updated Date - 2021-04-12T04:46:36+05:30 IST