రాలిన పద్యపారిజాతం

ABN , First Publish Date - 2022-06-16T06:19:58+05:30 IST

హృద్యమైన తేటతెలుగు పద్యానికి వెలుతురు వాకిళ్లు తెరచిన సువర్ణలేఖిని ఆగిపోయింది. తెలుగు సాహితీవనంలో మరో పద్యపారిజాతం రాలిపోయింది. 75 వసంతాల సాహితీ ప్రస్థానంలో...

రాలిన పద్యపారిజాతం

హృద్యమైన తేటతెలుగు పద్యానికి వెలుతురు వాకిళ్లు తెరచిన సువర్ణలేఖిని ఆగిపోయింది. తెలుగు సాహితీవనంలో మరో పద్యపారిజాతం రాలిపోయింది. 75 వసంతాల సాహితీ ప్రస్థానంలో తెలుగు సాహిత్యానికి బహుముఖ సేవలందించిన కవనదీపం కొండెక్కింది. కవిగా, సాహితీవేత్తగా, పత్రికాసంపాదకుడిగా, సాహిత్యసంస్థల నిర్వాహకుడిగా తెలుగువారికి చిరపరిచితులైన కొల్లా శ్రీకృష్ణారావు జూన్ 6, 2022న (సోమవారం) గుంటూరులోని స్వగృహంలో కన్ను మూశారు.


94 సంవత్సరాల జ్ఞానవృద్ధులైన శ్రీకృష్ణారావు గుంటూరు జిల్లా పెదకూరపాడు గ్రామంలో మహాలక్ష్మి సూరయ్య దంపతులకు రైతుబిడ్డగా జన్మించారు. భాషా ప్రవీణ పట్టభద్రులయ్యారు. కొంతకాలం తెలుగు పండితునిగా పని చేశారు. బాల్యం నుంచి కవిత్వం పట్ల మక్కువ ఉన్న ఆయన మహాకవులు గుర్రం జాషువా, ఏటుకూరి వేంకటనరసయ్యలను కవిత్వ గురువులుగా ఎంచుకున్నారు. వారితో అత్యంత సన్నిహితంగా మెలి గారు. తెలుగు పద్యంలోని మెళకువలను గ్రహించారు. ‘విశ్వశాంతి’ కోసం ‘పద్య శంఖారావం’ పూరించారు. ‘రారాజు’ను పద్య సింహాసనంపై కూర్చుండబెట్టి అక్షరాభిషేకం చేశారు. పద్యాల ‘పూదోట’లో విహరించారు. గురువర్యులు ఏటుకూరి వారి స్ఫూర్తితో పల్నాటి ‘పౌరుషజ్యోతి’ వెలిగించారు. ఆకుపచ్చని పాళీతో ‘కర్షక సాహిత్యం’ పండించారు. గుండెల్లో కొలువైన జాషువాకు ‘మన జాషువా’ సాహితీ సమీక్షను అక్షర నీరాజనంగా నివేదించారు. ‘కవిబ్రహ్మ ఏటుకూరి’ని సృజించి గురుదక్షిణగా సమర్పించుకున్నారు. తన చరిత్రను ‘నా సాహితీయాత్ర’గా పాఠక లోకానికి బహూకరించారు.


ఛందోబద్ధపద్యం లాగానే తన నడకలోనూ నడతలోనూ వడీవంకా లేని నిరాడంబర జీవనం గడిపారు. నిబద్ధంగా, నిజాయితీగా, నిర్భయంగా ఐదు దశాబ్దాలపాటు పత్రికారంగంతో మమేకమయ్యారు. స్వీయ సంపాదకత్వంలో ‘స్వతంత్రవాణి’, ‘భావవీణ’ పత్రికలను నడిపారు. తుదిశ్వాస వరకు సరళ గ్రాంథికంలోనే రచనలు చేసి వాడుక భాషను ఆమోదించని భాషానిష్ఠ ఆయనది. ప్రముఖవైద్యులు కె. సదాశివరావుగారి నేతృత్వంలో నడిచిన ‘సాహితీ సదస్సు’కు సుదీర్ఘకాలం కార్యదర్శిగా వ్యవహరించారు. ఎందరో ప్రముఖ కవులనూ సాహితీవేత్తలనూ ఆహ్వానించి వారినీ, వారి ఉపన్యాసాలనూ గుంటూరు వాసులకు పరిచయం చేశారు. కవిసమ్మేళనాలను నిర్వహించారు. తుమ్మల సీతారామమూర్తి, బొద్దులూరి నారాయణరావు, నాగభైరవ కోటేశ్వరరావు, చిటిప్రోలు కృష్ణమూర్తి మొదలైన సమకాలీన కవుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.


ఫలాపేక్ష లేకుండానే నిరంతరం సాహితీసేవ చేసిన కొల్లా వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జాషువా కళాపీఠం పక్షాన రూ.50వేల నగదు పురస్కారంతో ఘనంగా సన్మానించింది. తుమ్మల కళాపీఠం అవార్డు, నన్నయభట్టారక పీఠం అవార్డు, గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ విశిష్ట పురస్కారం, గాడేపల్లి సీతారామమూర్తి సాహితీ పురస్కారం, ప్రసన్న భారతి విశాఖ వారి పురస్కారం వంటి అనేక అవార్డులు వారిని కోరివచ్చాయి.


కవిత్వం, వ్యక్తిత్వం రెండు కళ్లుగా సాహితీ జీవితం సాగించిన కొల్లా శ్రీకృష్ణారావు మృతితో తెలుగు పద్య కవిత్వం మరో పెద్దదిక్కును కోల్పోయింది. శారదాదేవి చరణ మంజీర నాదాన్ని ఆలకిస్తూ, అక్షరతపస్విగా, పూర్ణమనస్విగా, కవితా యశస్విగా నిత్యచైతన్య చైత్ర వసంతాన్ని మనకు పంచిపెట్టిన కవితా కోకిలకు నిండు మనస్సులతో నివాళులర్పిద్దాం.

డా. బీరం సుందరరావు

Updated Date - 2022-06-16T06:19:58+05:30 IST