భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు

ABN , First Publish Date - 2022-01-19T05:25:05+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, హెచఆర్‌ఏను తగ్గిస్తూ జారీ చేసిన జీవోపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి.

భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు
కలెక్టరేట్‌ ఎదుట పీఆర్‌సీ ఉత్తర్వులను దహనం చేస్తున్న ఉపాధ్యాయులు ఏపీజేఏసీ నాయకుల నిరసన

  1.  ఫిట్‌మెంట్‌, హెచఆర్‌ఏ తగ్గింపుపై నిరసనలు
  2. చీకటి జీవో అంటూ మండిపాటు.. ప్రతులకు నిప్పు
  3. ఎన్నికల ముందు హామీలను సీఎం మర్చిపోయారని తీవ్ర విమర్శలు
  4. ఫిట్‌మెంట్‌ 30 శాతం, హెచఆర్‌ఏ యధాతథంగా ఉండాలని డిమాండ్‌
  5.  త్వరలో ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని జేఏసీ నాయకుల ప్రకటన


కర్నూలు, జనవరి 18(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌, హెచఆర్‌ఏను తగ్గిస్తూ జారీ చేసిన జీవోపై ఉద్యోగ సంఘాలు భగ్గుమన్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు నల్లబ్యాడ్జిలతో మంగళవారం విధులకు హాజరయ్యారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల ముందు పీఆర్సీ నివేదిక ప్రతులకు నిప్పంటించారు. తమ డిమాండ్లకు అనుగుణంగా పీఆర్సీని మళ్లీ ప్రకటించకపోతే ఉద్యమానికి దిగుతామని హెచ్చరించారు. ‘వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో చీకటి ’జీవో అంటూ ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి నాయకులు కలెక్టరేట్‌ ఆవరణలో నినాదాలు చేశారు. ఉన్న జీతాన్ని తగ్గిస్తూ పీఆర్సీని తీసుకువచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఏపీజీఈఏ సంఘం నేతలు మండిపడ్డారు. తమ సంఘం కార్యాలయంలో పీఆర్సీ నివేదిక ప్రతులను దహనం చేశారు. నంద్యాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీతో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎలాంటి న్యాయం జరగలేదని ప్యాప్టో సంఘం నేతలు బనగానపల్లి, కోసిగి, ఆలూరు తదితర మండలాల్లో నిరసన తెలియజేశారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు.


ఏపీ జేఏసీ-అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో..

ఏపీజేఏసీ, ఏపీజేఏసీ-అమరావతి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట పీఆర్సీ నివేదిక ప్రతులను దహనం చేశారు. ఏపీఎన్జీవో అసోసియేషన జిల్లా ప్రధాన కార్యదర్శి వి.జవహర్‌లాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించడం జగన మోహనరెడ్డి ప్రభుత్వంలోనే చూస్తున్నామన్నారు. జనవరి 17 ఉద్యోగులకు చీకటి రోజుగా మిగిలిపోయిందన్నారు. ఏపీఎన్జీవో నగర అధ్యక్షుడు కాశన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను పెంచాలని కోరితే తగ్గించారన్నారు. కానీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధుల జీతాలు ఎందుకు పెంచారని ప్రశ్నించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సర్వీస సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రకాశ, టైపిస్ట్‌, స్టెనోగ్రాఫర్స్‌ అసోసియేషన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు శంకర్‌ నాయక్‌, బ్రహ్మనందరెడ్డి, ప్రభుత్వ నాల్గొతరగతి ఉద్యోగుల సంఘం అసోసియేషన రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటి, ఏపీఎన్జీవో అసోసియేషన జిల్లా నాయకులు పాల్గొన్నారు.

 

ఏపీజీఈఏ ఆధ్వర్యంలో..

ఏపీజీఈఏ కార్యాలయం ఎదుట పీఆర్సీ నివేదిక ప్రతులను ఆ సంఘం నాయకులు దహనం చేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ నరసింహులు మాట్లాడుతూ ఈ జీవోతో ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరగుతుందన్నారు. ఆశుతోష్‌ మిశ్రా కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి, సీఎస్‌ కమిటీ ఇచ్చిన పీఆర్సీని అమలు చేయడం దారుణమన్నారు. ఐఆర్‌ 27 శాతం ఇచ్చి ఫిట్‌మెంట్‌ 23 శాతం ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసమే ఐఆర్‌ 27 శాతం ఇచ్చారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఫిట్‌మెంట్‌ 30 శాతం, హెచఆర్‌ఏ యథాతథంగా ఉండేలా మళ్లీ పీఆర్సీని ప్రకటించాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే బుధవారం నుంచి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శనరెడ్డి, ట్రెజరర్‌ శ్రీనివాసమూర్తి, సిటీ అధ్యక్ష, సెక్రటరీలు బంగి శ్రీధర్‌, యం.శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.


ఫ్యాప్టో ఆధ్వర్యంలో.. 

కర్నూలు(ఎడ్యుకేషన), జనవరి 18: ఫ్యాప్టో ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట గాంధీ విగ్రహం వద్ద జీవో ప్రతులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ హృదయరాజు మాట్లాడుతూ అశుతోష్‌ మిశ్రా రిపోర్టును బయట పెట్టకుండా సీఎస్‌ నివేదిక ఆధారంగా ఐఆర్‌ కంటే తక్కువ ఫిట్మెంట్‌ ఇవ్వడం దారుణమన్నారు. ఫ్యాప్టో రాష్ట్ర కార్యదర్శి కె.ప్రకాష్‌ రావు మాట్లాడుతూ ఈ నెల 20న జరిగే కలెక్టరేట్‌ ముట్టడిలో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా చైర్మన ఓంకార్‌ యాదవ్‌, జనరల్‌ సెక్రటరీ గట్టు తిమ్మప్ప, యుటీఎఫ్‌ రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ సురేష్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప, ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు గోకారి, జనరల్‌ సెక్రటరీ గోవిందు, ఏపీటీఎఫ్‌ ఇస్మాయిల్‌, కమలాకర్‌, డీటీఎఫ్‌ రత్నం ఏసేపు, బజారప్ప, బీటీఏ ఆనంద్‌, ఆప్టా రాజా సాగర్‌, పీఈటీ అసోసియేషన జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య, ఏపీ టీచర్స్‌ గిల్డ్‌ విక్టర్‌ ఇమ్మానుయేల్‌, ఆర్‌యుపీపీ జిల్లా అధ్యక్షులు కె.రఘు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రుడు, వివిద సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.





Updated Date - 2022-01-19T05:25:05+05:30 IST