ఆఫర్ల వేళ..సైబర్‌ వల

ABN , First Publish Date - 2022-09-29T16:18:34+05:30 IST

దసరా, దీపావళి పండగల సీజన్‌లో అన్ని కంపెనీలూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కామర్స్‌ సైట్లయితే భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి

ఆఫర్ల వేళ..సైబర్‌ వల

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలో జాగ్రత్త

నకిలీ వెబ్‌సైట్స్‌ సృష్టిస్తున్న కేటుగాళ్లు   

అప్రమత్తంగా ఉండాలంటున్న  పోలీసులు


హైదరాబాద్‌ సిటీ: దసరా, దీపావళి పండగల సీజన్‌లో అన్ని కంపెనీలూ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ కామర్స్‌ సైట్లయితే భారీ డిస్కౌంట్లతో ఆకర్షిస్తున్నాయి. దీంతో ఆన్‌లైన్‌ షాపింగ్‌ వైపు చాలా మంది మొగ్గుచూపుతున్నారు. ఇదే అదనుగా దోచుకునేందుకు సైబర్‌ కేటుగాళ్లు సిద్ధమయ్యారు. పండుగలను అనుకూలంగా మార్చుకొని కొత్తరకం మోసాలకు తెరతీస్తున్నారు. దీంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


నకిలీ సైట్లు

ఇప్పుడు ఆన్‌లైన్‌ షాపింగ్‌కు విపరీతమైన క్రేజ్‌ ఉంది. లక్షలాది మంది కస్టమర్లు దుస్తులనే కాదు.. ప్రతి వస్తువునూ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. బయటకు వెళ్లే పని లేకుండా స్మార్ట్‌ఫోన్‌ నుంచే ఆర్డర్‌ చేస్తున్నారు. దీంతో ఈ కామర్స్‌ సైట్లు భారీ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, బహుమతులు ప్రకటించి కస్టమర్‌లను ఆకర్షిస్తున్నాయి. ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు నకిలీ ఈ కామర్స్‌ సైట్లను సృష్టిస్తున్నారు. ఖరీదైన దుస్తులు, చీరలను 70-80 శాతం డిస్కౌంట్స్‌ ఉన్నాయని ప్రకటిస్తున్నారు. అదంతా నిజమని నమ్మిన కస్టమర్లు ఆన్‌లైన్‌లోనే డబ్బులు చెల్లించి ఆర్డర్‌ చేస్తున్నారు. డబ్బులు తీసుకున్న అనంతరం ఆ సైట్‌ నిర్వాహకులు స్పందించడం మానేస్తున్నారని, కొందరు వస్తువులను పంపకుండా మోసం చేస్తున్నారని పోలీసులు పేర్కొంటున్నారు. 


బహుమతుల పేరుతో బురిడీ..

మంచి ఆదరణ ఉన్న ఈ కామర్స్‌ సైట్లలో షాపింగ్‌ చేసిన వారిని కూడా సైబర్‌ నేరగాళ్లు వదలడం లేదు. వివిధ మార్గాల్లో కస్టమర్ల డేటాను కొనుగోలు చేసి, వారికి ఫోన్లు చేస్తున్నారు. ‘మీరు పలానారోజు షాపింగ్‌ చేశారు. కంపెనీ నిర్వహించిన లక్కీడి్‌పలో ఖరీదైన బహుమతి గెలుచుకున్నారు’ అని నమ్మిస్తున్నారు. బహుమతిని పంపడానికి జీఎస్టీ, ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతరాత్ర ఖర్చుల పేరు చెప్పి డబ్బులు లాగేస్తున్నారు.  


అప్రమత్తంగా ఉండాలి : పోలీసులు

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విషయంలో కస్టమర్లు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆఫర్లు అనగానే ప్రతీ సైట్‌నూ ఓపెన్‌ చేయొద్దు. నమ్మకమైన ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్లనే ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకు క్యాష్‌ ఆన్‌ డెలివరీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆన్‌లైన్‌ షాపింగ్‌ సమయంలో అడగగానే బ్యాంకు ఖాతాలు,  ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ వ్యాలెట్ల వివరాలు నమోదు చేయొద్దు. ఆ వివరాలన్ని సైబర్‌ నేరగాళ్ల చేతికి వెళ్తున్నాయని గుర్తుంచుకోవాలి. బహుమతులు గెలుచుకున్నారంటూ వచ్చే అపరిచిత ఫోన్‌ కాల్స్‌ను, మెసేజ్‌లను నమ్మొద్దు.

Updated Date - 2022-09-29T16:18:34+05:30 IST