విజయవాడ నగరంలో ఫేక్‌ ఓట్ల కలకలం

ABN , First Publish Date - 2021-03-04T06:52:06+05:30 IST

బెజవాడ కార్పొరేషన్‌కు వారంలో ఎన్నికలు జరగనుండగా, ఓటర్ల తుది జాబితాల్లో ఓట్ల తారుమారు ప్రతిపక్షాలను కలవరానికి గురిచేస్తోంది.

విజయవాడ నగరంలో ఫేక్‌ ఓట్ల కలకలం

తూర్పులో ఒకే ఇంట్లో 30 అపరిచిత ఓట్లు

ముస్లిం పేరుకు హిందువుల ఇంటిపేరు

ఒక్కో వ్యక్తికి రెండేసి ఇంటిపేర్లు

ఆ ఇంట్లో ఉంటున్న వారిలో సగం ఓట్లు మిస్సింగ్‌

మిగిలిన సగం మందివి వేరే డివిజన్లో! 


బెజవాడ కార్పొరేషన్‌కు  వారంలో ఎన్నికలు జరగనుండగా, ఓటర్ల తుది జాబితాల్లో ఓట్ల తారుమారు ప్రతిపక్షాలను కలవరానికి గురిచేస్తోంది. ఓట్ల తారుమారు సంగతి పక్కన పెడితే, అసలు.. లేని ఓట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ ఫేక్‌ ఓట్లు ఎవరివి? అసలు వీరు ఉన్నారా? వేరే ప్రాంతాల నుంచి మారుపేర్లతో చేర్పించారా? తూర్పు నియోజకవర్గంలో బుధవారం రాత్రి వెలుగుచూసిన ఈ వ్యవహారం అభ్యర్థుల్లో చర్చకు దారితీసింది. 


విజయవాడ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : నగరంలోని ఒక ప్రాంతంలో ఒకే ఇంటి నెంబర్‌పై 30 ఓట్లు రావటం, వారంతా ఆ డోర్‌ నెంబర్‌లో లేకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇంకా విచిత్రమేమిటంటే.. ఆ డోర్‌ నెంబర్‌లో ఉంటున్న వారిలో కొందరి ఓట్లు మాత్రమే ఉన్నాయి. కొందరి ఓట్లు వేరే డివిజన్లలో ఉన్నాయి. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ, అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టులు కలిగిన వారి ఓట్లు లేకుండా పోయాయి. అయితే, ఆ 30 ఓట్లలో ఉన్న వారంతా నిజంగా ఓటర్లేనా? ఈ పేర్లతో వేరెవరినైనా డంప్‌ చేశారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. 

పటమట తొమ్మిదో డివిజన్‌ పరిధిలో డోర్‌ నెంబర్‌ 40-25-17/8లో కొత్తగా 30 ఓట్ల వరకు వచ్చాయి. తమ డోర్‌ నెంబర్‌తో వచ్చిన ఓటర్లను చూసి అక్కడ ఉంటున్నవారు ఆశ్చర్యపోయారు. ఆ ఇంటి నెంబర్‌లో ఉంటున్న ఒక వ్యక్తి ఓటు అసలు లేదు. ఆయన భార్య ఓటు మాత్రం 8వ డివిజన్‌లోకి మార్చారు. ఇలా మరికొందరివి తికమకగా ఉన్నాయి. 


పేర్లలోనూ  లొసుగులు

కొత్తగా వచ్చిన 30 ఓట్లలో ముస్లిం పేర్లు ఉంటే, ఇంటిపేర్లు మాత్రం హిందువులవి ఉన్నాయి. ఆ పేర్లకు రెండేసి ఇంటిపేర్లు ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. బూత్‌ నెంబర్‌-4లో అజీజుల్‌ హక్‌ఖాన్‌ మహ్మద్‌ పేరు కలిగిన ఇంటిపేరుతో ఓటు ఉంది. ఇదే బూత్‌లో ముత్య రత్నం కొమ్మారెడ్డి షేక్‌ పేరుతో మరో ఓటు ఉంది. మీరావలి షేక్‌ అనే పేరుకు నిమ్మగడ్డ అనే ఇంటిపేరు ఉంది. ఇదే బూత్‌లో అనేక ఓట్లను పరిశీలిస్తే.. రెండేసి ఇంటి పేర్లను కలిగినవారు కూడా ఉన్నారు. లత అనే ఓటరుకు మండవ, కడియాల అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. రమాదేవి పేరుతో ఉన్న ఓటరుకు కడియాల, కొమ్మారెడ్డి అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. వెంకటేశ్వరరావు పేరుతో కడియాల, పూతలపట్టు అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. సుధాకర్‌ అనే ఓటరుకు పూతలపట్టు, కొమ్మారెడ్డి అనే ఇంటి పేర్లు ఉన్నాయి. రవి అనే పేరుతో ఉన్న ఓటరుకు కొమ్మారెడ్డి, నిమ్మగడ్డ అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. దశమంతరావు అనే పేరుతో ఉన్న ఓటరుకు నిమ్మగడ్డ, భవినేని అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. ప్రమీలాదేవి అనే ఓటరుకు కొమ్మారెడ్డి, మేదరమెట్ల అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. శకుంతల అనే మరో ఓటరుకు కూడా మేదరమెట్ల, కొమ్మారెడ్డి అనే రెండు ఇంటిపేర్లు ఉన్నాయి. 

ఇలా పేర్లకు, ఇంటిపేర్లకు సంబంధం లేకుండా ఉన్న ఓట్లు కొన్ని కాగా, రెండేసి ఇంటి పేర్లతో ఉన్నవి మరికొన్ని. వీరెవరూ ఆ డోర్‌ నెంబర్‌లో ఉండట్లేదు. రూమ్‌ నెంబర్‌-4, వెస్ట్‌సైడ్‌ బ్లాక్‌, నార్త్‌ ఫోర్త్‌ రూమ్‌, కొమ్మా సీతారామయ్య జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌ దగ్గర ఉన్నట్టు చూపారు. వీరికి సంబంధించిన ఫోన్‌ నెంబర్లు కూడా లేవు.

Updated Date - 2021-03-04T06:52:06+05:30 IST