Abn logo
Mar 26 2020 @ 02:24AM

ఫేక్‌.. వైరస్‌!

సోషల్‌ మీడియాలో కరోనాపై అసత్యప్రచారం..

పాతఫొటోలు, వీడియోలతో కరోనాకు లింక్‌

ఆంధ్రజ్యోతి : అసలే కరోనా భయంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటే అదిగో పాము అంటే పడగ అన్నట్లుగా కొందరు వ్యవహరిస్తున్నారు. కరోనాపై ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో, వాట్సా్‌పలలో జోరుగా అసత్య ప్రచారం చేస్తున్నారు. కరోనాకు లింకు పెడుతూ పాత వీడియోలు, ఫొటోలను పోస్ట్‌ చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్ముతున్న కొందరు వాటిని షేర్‌ చేస్తున్నారు. ఇంటర్నెట్‌ కారణంగా ప్రపంచమే గుప్పిట్లోకి వచ్చిన ఈ రోజుల్లో ఏది రియల్‌.. ఏది వైరల్‌ అని తేల్చుకోకుండా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపుల్లో పెడుతున్నారు. కరోనాపై, అది ప్రబలుతున్న దేశాలపై వారికి అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం.  ఇలాంటి ఫేక్‌ న్యూస్‌తో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వారం రోజులుగానైతే కరోనాపై ఫేక్‌ ఫొటోలు, వీడియోలతో ప్రచారం పెరిగిపోయింది.  


ఫేక్‌ న్యూస్‌..    

  • ‘ఇటలీలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇదిగో.. శాటిలైట్‌ తీసిన ఫొటోలు’ అంటూ రోడ్ల మీద ఎక్కడికక్కడ మృతదేహాలు పడివున్న ఓ ఫొటో  ఫేస్‌బుక్‌, వాట్సా్‌పలలో వైరల్‌ అవుతోంది. 
  • ‘ఇటలీలో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుట్టలుగా పేరుకుపోతున్న మృతదేహాలను ఖననం చేసేందుకు ఎవ్వరూ రావడం లేదు. ఎన్నో సౌకర్యాలు ఉన్నప్పటికీ మహమ్మారి కారణంగా ఇక ఎవరినీ కాపాడటం సాధ్యంకావడం లేదు అంటూ ఆ దేశ అధ్యక్షుడు చేతులెత్తేసి భోరున విలపిస్తున్నాడు’ అనేది ఓ వార్త. ఆధారం అన్నట్లుగా ఏడుస్తున్న అధ్యక్షుడి ఫొటో కూడా. 
  • ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని పదే పదే చెబుతున్నా వస్తున్నారు. జనాన్ని ఇళ్లకే పరిమితం చేసేందుకు అక్కడి ప్రభుత్వం రోడ్ల మీద సింహాలను వదిలింది. ఇదో ప్రచారం. 
  •  చైనాలో ఖురాన్‌పై నిషేధాన్ని విధించారు. కరోనా వైరస్‌ ప్రబలడంతో ఆ నిషేధాన్ని అక్కడి  ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో అక్కడి ముస్లింలు తొలిసారి ఖురాన్‌ను అందుకున్నారనేది మరో వార్త. 
  • ఈ వీడియో చూడండి.. ఇలానే కరోనా వైర్‌సను ఖతం చేసేందుకు జనతా కర్ఫ్యూ సమయంలో 25వేల ఆర్మీ హెలికాప్టర్లు గాల్లో చక్కర్లు కొడుతూ మందు చల్లుతాయి. మీ ప్రాంతంలో చల్లకపోతే కంగారొద్దు. కింది నుంచి మీరు చేయి ఊపితే పైలట్‌ చూసి మందు చల్లుతాడు. జనగామ రైల్వే స్టేషన్‌పై ఇలాగే మందు చల్లుతున్నారు అని చెబుతూ ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. 


రియల్‌ న్యూస్‌ 

  • శాటిలైట్‌ తీసిన ఫొటోలకు ఇటలీలో కరోనా మరణాలకు ఎలాంటి సంబంధం లేదు. నాజీల క్రూర చర్య కారణంగా మృతిచెందిన వారి స్మారకార్థం నిర్వహించిన ఓ ఆర్ట్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫొటోలు అవి.      
  • ఫొటోలో కన్నీళ్లు పెడుతున్న వ్యక్తి ఫొటో అసలు ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మాటెరెల్లాది కానేకాదు. ఆ ఫొటో బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సొనారోది. పైగా ఆయన రోదనకు కరోనా విపత్తుకు సంబంధమే లేదు. 
  • అడవులు, జూలో ఉండాల్సిన సింహాలను జూలో ఎలా వదులుతారు? అని కనీసం ఆలోచించకుండా ఫొటోను షేర్‌ చేస్తున్నా రు. జనారణ్యంలోకి సింహాలు వచ్చినట్లుగా మార్పింగ్‌ చేసిన ఫొటోలవి.
  • ఇది వాస్తవం కాదు. ఈ వీడియో ఏడేళ్ల క్రితమే యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ అయినట్లు ఫ్యాక్ట్‌చెకింగ్‌లో తేలింది. అదే వీడియోను 2013, 2014లో చైనాలోని క్రైస్తవులు తొలిసారిగా బైబిల్స్‌ను అందుకున్నారని యూట్యూబ్‌లో కొందరు పోస్టు చేశారు. 
  • హెలికాప్టర్లు ఏదో వాయువును వెదజల్లుతున్న వీడియోలకు ఎలాంటి సంబంధం లేదు. కరోనా వైరస్‌ గాల్లో కొద్దిసేపు ఉంటుందని నిపుణులు చెబుతున్నా వ్యక్తుల నుంచి వ్యక్తులకు ప్రబలే ప్రమాదమే ఎక్కువ. 

Advertisement
Advertisement
Advertisement