నకిలీ స్టాంప్‌ పేపర్ల గుట్టు రట్టు

ABN , First Publish Date - 2021-11-20T17:51:27+05:30 IST

నకిలీ స్టాంప్‌ పేపర్లను తయారు చేసి విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఓ ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ శుక్రవారం మీ

నకిలీ స్టాంప్‌ పేపర్ల గుట్టు రట్టు

- ప్రభుత్వ ఖజానాకు ఏళ్ల తరబడి గండి 

- ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు 


బెంగళూరు: నకిలీ స్టాంప్‌ పేపర్లను తయారు చేసి విక్రయిస్తూ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొడుతున్న ఓ ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. బెంగళూరు నగర పోలీస్‌ కమిషనర్‌ కమల్‌పంత్‌ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సాధారణ స్ర్కీన్‌ ప్రింటింగ్‌ సాంకేతికతను వినియోగించి ఎంబోజింగ్‌ చేస్తూ అసలైన స్టాంప్‌ పేపర్లను తలపించేలా ఈ ముఠా తయారు చేసేదన్నారు. కొద్దికాలంగా ముఠా కార్యకలాపాలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని భావిస్తున్నామన్నారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.63.57 లక్షల నకిలీ స్టాంప్‌ పేపర్లను ఈస్ట్‌ విభాగానికి చెందిన సిట్‌ బృందం స్వాధీనం చేసుకుందన్నారు. అరెస్ట్‌ అయిన వారిని హుస్సేన్‌ అలియాస్‌ బాబు, షపీర్‌, నయాజ్‌, హరీష్‌, టైపిస్ట్‌ సీమలుగా గుర్తించామన్నారు. హుస్సేన్‌ ఈ కుంభకోణంలో కింగ్‌పిన్‌గా ఉన్నాడన్నారు. తీగలాగితే డొంక కదిలినట్లు బెంగళూరు గాంధీనగర్‌లోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది ఈ నకిలీ స్టాంప్‌ పేపర్లను గుర్తించారన్నారు. హెచ్‌ఏఎల్‌ పోలీస్ స్టేషన్‌లోనూ, అలసూరు గేట్‌ పోలీస్ స్టేషన్‌ పరిధిలోనూ నకిలీ స్టాంప్‌ పేపర్ల వ్యవహారం వెలుగు చూడడంతో గుట్టు రట్టు చేసేందుకు డీసీపీ స్థాయి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించామన్నారు. ఈస్ట్‌ విభాగం డీసీపీ ఎస్డీ శరణప్ప పర్యవేక్షణలో మొత్తం నాలుగు బృందాలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద నిఘా విధించగా నిందితులు అడ్డంగా దొరికిపోయారన్నారు. 2005 నుంచి నకిలీ స్టాంప్‌ పేపర్లను తయారు చేస్తున్నట్లు ముఠా వెల్లడించిందని ఈ లెక్కన ఖజానాకు భారీగా నష్టం వాటిల్లి ఉంటుందని భావిస్తున్నామన్నారు. ముఠా గుట్టును రట్టు చేసిన బృందానికి ఆయన రూ.50 వేల నగదు బహుమతిని ప్రకటించారు. 

Updated Date - 2021-11-20T17:51:27+05:30 IST