నకిలీ ఎస్సై @రూ.1.18 కోట్లు

ABN , First Publish Date - 2021-06-15T08:57:43+05:30 IST

నకిలీ ఎస్సైగా అవతారమెత్తిన అతను.. బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించాడు.

నకిలీ ఎస్సై @రూ.1.18 కోట్లు

  • బ్యాంకులను నమ్మించిన మాయలోడు
  • ఫ్రీజ్‌ అయిన ఖాతాను తెరిపించి.. నగదు బదిలీ  
  • కోల్‌కతాలో అరెస్టు.. నగరానికి తరలింపు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): నకిలీ ఎస్సైగా అవతారమెత్తిన అతను.. బ్యాంకు అధికారులను బురిడీ కొట్టించాడు. రుణాల యాప్‌ కేసులో ఫ్రీజ్‌ అయిన బ్యాంకు ఖాతా నుంచి 1.18కోట్లను ఎంతో తెలివిగా బదిలీ చేయించాడు. అంతా జరిగాక తాము మోసపోయామని తెలుసుకున్న బ్యాంకు అధికారులు సైబర్‌ క్రైం పోలీసులను ఆశ్రయించగా.. ఆ మయాగాడిని అరెస్టు చేశారు. గత ఏడాది వెలుగు చూసిన రుణాల యాప్‌ కేసుల్లో దేశవ్యాప్తంగా 1125 బ్యాంకు ఖాతాలను సీజ్‌ చేసిన హైదరాబాద్‌ సైబర్‌క్రైం అధికారులు.. అందులో ఉన్న రూ.190 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. సైబర్‌ నేరాల్లో ఆరితేరిన నల్లమోతు అనిల్‌కుమార్‌ ఆయా ఖాతాల నుంచి డబ్బులు కాజేసేందుకు పక్కా స్కెచ్‌ వేశాడు. గతనెల 8వ తేదీన కోల్‌కతా-అలీపూర్‌లో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుకు వెళ్లాడు. తాను హైదరాబాద్‌ నుంచి వచ్చానని, సైబర్‌ క్రైం ఎస్సైని అంటూ పరిచయం చేసుకున్నాడు. 


ఫ్రీజ్‌ అయిన హైంజ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట ఉన్న ఖాతాను డీఫ్రీజ్‌ చేయాలంటూ అధికారులకు హుకూం జారీ చేశాడు. అతడి హావభావాలు చూసి నమ్మిన ఐసీఐసీఐ అధికారులు.. నిజమేననుకొని ఆ ఖాతాను డీఫ్రీజ్‌ చేయడమే కాకుండా.. రూ. 1.18 కోట్లను హైదరాబాద్‌లోని ఎస్‌బీఐలో ఉన్న ఆనంద్‌ జన్ను అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేశారు. ఆ తర్వాత అతను నకిలీ ఎస్సై అని తేలింది. దీంతో  గచ్చిబౌలిలోని ఐసీఐసీఐ ప్రధాన కార్యాలయం రీజినల్‌ మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బదిలీ అయిన డబ్బు చేరిన ఖాతా ఆధారంగా బేగంపేట నివాసి ఆనంద్‌ జన్నును 2న అరెస్టు చేశారు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ప్రధాన నిందితుడైన నల్లమోతు అనిల్‌కుమార్‌ను సోమవారం కోల్‌కతాలో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చారు. 

Updated Date - 2021-06-15T08:57:43+05:30 IST