నకిలీ భయం

ABN , First Publish Date - 2022-05-23T06:19:04+05:30 IST

అన్నదాతలకు నకిలీ పత్తి విత్తనాల భయం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఏటా నకిలీ విత్తనాల దందాపై నిఘా పెడుతున్నా అక్రమార్కులు పొరుగు జిల్లాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలకు ఏజెంట్ల ద్వారా చేరుస్తూనే ఉన్నారు.

నకిలీ భయం

- గ్రామాల్లో పత్తి విత్తనాల అమ్మకాలు

- పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాకు 

- ఏటా తనిఖీలు.. ఆగని దందా 

- పోలీస్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారుల దృష్టి

 

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

అన్నదాతలకు నకిలీ పత్తి విత్తనాల భయం మొదలైంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా నకిలీ పత్తి విత్తనాలు అంటగట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఏటా  నకిలీ విత్తనాల దందాపై నిఘా పెడుతున్నా  అక్రమార్కులు పొరుగు జిల్లాల నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలకు ఏజెంట్ల ద్వారా   చేరుస్తూనే ఉన్నారు. పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న విత్తనాల్లో ఎక్కువ రకం హెచ్‌టీ కాటన్‌ వంటివి ఉంటున్నాయి. జన్యు మార్పిడి చేసిన విత్తనాలుగా వీటిని గుర్తిస్తున్నారు. ఈ విత్తనాలు కూడా బీటీ 3 విత్తనాల మాదిరిగానే గైకొసెట్‌, కలుపుమందును తట్టుకుంటాయి. దీంతో రైతులు కూడా నిషేధిత బీటీ 3 విత్తనాలతోపాటు హెచ్‌టీ కాటన్‌ రకం విత్తనాలపై ఆసక్తి చూపుతున్నారు. నకిలీ విత్తనాల దందాపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నజర్‌ పెట్టి గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు. వానాకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ అధికారులు సిద్ధం చేయగా రైతులు దుక్కులు దున్ని సాగుకు సిద్ధమవుతున్నారు. ఇదే క్రమంలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై కఠినంగా వ్యవహరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.  ఇప్పటికే జిల్లాలో తనిఖీలు ముమ్మరం చేశారు. 


జిల్లాలో 80,900 ఎకరాల్లో పత్తి సాగు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలం సాగులో 2.44 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది. ఇందులో వరి 1.50 లక్షల ఎకరాలు సాగు  చేయనుండగా పత్తి 80,900 ఎకరాలు సాగు చేస్తారని అంచనా వేశారు. జిల్లాలో వరి తరువాత పత్తి సాగుపై రైతులు మొగ్గు చూపుతున్నారు. పత్తి సాగులో ఇల్లంతకుంట మండలంలో 18 వేల ఎకరాలు, తంగళ్లపల్లి 3,800, సిరిసిల్ల 3,200, బోయినపల్లి 8,500, చందుర్తి 9000, రుద్రంగి 4,500, కోనరావుపేట 8,500, వేములవాడ 6,500, వేములవాడ రూరల్‌ 4,500, గంభీరావుపేట 1500, ముస్తాబాద్‌ 4,500, వీర్నపల్లి 1400, ఎల్లారెడ్డిపేట 7000 ఎకరాల వరకు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందుకు కావాల్సిన విత్తనాలను జిల్లాలో డీలర్లు సమకూరుస్తున్నా గ్రామాల్లోకి నేరుగా ఆంధ్రా, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలను పెద్ద సంఖ్యలో జిల్లాకు తీసుకొస్తున్నారు. ఇందులో ఎక్కువగా  గుంటూరు, కర్నూలు ప్రాంతాలకు చెందిన వ్యాపారులే ఉన్నటు తెలుస్తోంది. ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని విత్తనాలు విక్రయిస్తున్నారు. లైసెన్స్‌ డీలర్లకంటే చవుకగా విత్తనాలు లభించడంతోపాటు బీటీ, హెచ్‌టీ వంటి విత్తనాలు సరఫరా అవుతున్నాయి. బట్ట సంచుల్లో వస్తున్న ఈ విత్తనాలపై తయారీ తేదీలు ధర, బ్యాచ్‌ నంబర్లు ఉండకపోవడంతో పంటల్లో తేడా వచ్చినా ఏదైనా నష్టం వాటిల్లినా అడిగే వారు ఉండడం లేదు. 


గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు 

జిల్లాలో గైకోసెట్‌ వంటి కలుపు మందుపై నిషేధం ఉన్నా జిల్లాలో గుట్టు చప్పుడు కాకుండా గైకోసెట్‌ వంటి మందులు అమ్మకాలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో నిషేధం లేకపోవడంతో కొందరు అక్రమంగా ప్రతీ సీజన్‌లో జిల్లాకు తీసుకొచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక లీటరు మందు రూ.450 వరకు దొరుకుతుంది. ఎకరం వరకు మందు చల్లుకోవచ్చు. కూలీల ద్వారా కలుపు తీయాలంటే రూ.5 వేల వరకు ఖర్చు అవుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రమాదకరం అని తెలిసినా మందు చల్లడానికి ఆసక్తి చూపుతున్నారు.


 పోలీస్‌, వ్యవసాయ అధికారుల ప్రత్యేక దృష్టి 

జిల్లాలో వానాకాలం సీజన్‌ ప్రారంభం అవుతుండడంతో పోలీస్‌, వ్యవసాయ అఽధికారులు నకిలీ, నిషేధిత విత్తనాలపై దృష్టి సారించారు. జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేశారు.  ఎస్పీ రాహుల్‌హెగ్డే ఇప్పటికే నకిలీ విత్తనాల నివారణపై పోలీస్‌ కార్యాలయంలో పోలీస్‌, వ్యవసాయ శాఖ, మండల, సర్కిల్‌, జిల్లా స్థాయి కమిటీలకు మార్గనిర్దేశనం చేశారు. నకిలీ విత్తనాలను ముందుగానే గుర్తించి వారికి అండగా ఉండాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేసి రైతులకు నకిలీ విత్తనాలు సరఫరా జరగకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చారు.  గతేడాది కూడా నకిలీ విత్తనాలపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్ఛరించారు. 


డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి 

- రణధీర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి 

ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొనుగోలు సమయంలో తప్పనిసరిగా రసీదు పొందాలి. బీటీ 3 విత్తనాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. నకిలీ విత్తనాలపై విస్తృతంగా దాడులు, తనిఖీలు పోలీస్‌ శాఖతో కలిసి నిర్వహిస్తున్నాం. ఎవరైనా నకిలీ విత్తనాలను రైతులకు అమ్మితే క్రిమినల్‌ కేసులకు గురికాక తప్పదు. జిల్లాలో నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాం. 


Updated Date - 2022-05-23T06:19:04+05:30 IST