నకిలీనిషా

ABN , First Publish Date - 2022-05-18T06:53:20+05:30 IST

జిల్లాలో నకిలీనిషా దందా పెద్ద ఎత్తున సాగుతోంది. గ్రామాల్లోని అనఽధికార బెల్ట్‌షాపులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీమద్యాన్ని పెద్దఎత్తున తయారు చేస్తూ సర్కారు ఆదాయానికి భారీగా గండికొడుతుండడమే కాకుండా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు.

నకిలీనిషా
క్లోరల్‌ హైడ్రెడ్‌తో పట్టుబడ్డ నిందితుడు (ఫైల్‌)

జిల్లాలో భారీగా కల్తీ మద్యం, కల్లు అమ్మకాలు 

ఇళ్లల్లోనే అక్రమ తయారీ అడ్డాలు 

జిల్లాకు పెద్ద ఎత్తున చేరుకుంటున్న క్లోరల్‌ హైడ్రేడ్‌ 

గుజరాత్‌ కేంద్రంగా సాగుతున్న దందా

నిర్మల్‌, మే 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో నకిలీనిషా దందా పెద్ద ఎత్తున సాగుతోంది. గ్రామాల్లోని అనఽధికార బెల్ట్‌షాపులను లక్ష్యంగా చేసుకొని కొంతమంది నకిలీమద్యాన్ని పెద్దఎత్తున తయారు చేస్తూ సర్కారు ఆదాయానికి భారీగా గండికొడుతుండడమే కాకుండా కోట్లాది రూపాయలను సంపాదిస్తున్నారు. సోమవారం రాత్రి పెంబి మండల కేంద్రంలోని ఓ ఇంటిపై ఎక్సైజ్‌ అధికారులు దాడిచేసి అక్రమ మద్యం తయారీడెన్‌ను గుర్తించారు. కొంతమంది పలుకుబడి గల వ్యక్తులు ఎక్సైజ్‌ వ్యాపారంతో తమకున్న సంబంధాలను అస్త్రంగా మలుచుకుం టూ ఈ అక్రమదందా సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఒరిజినల్‌ మద్యంలాగే ఈ నకిలీమద్యాన్ని కూడా తయారు చేసి విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులను లక్ష్యంగా చేసుకుంటున్న కల్తీమద్యం తయారీదారులు వాహ నాల్లో వీటిని అక్కడికి చేరవేస్తున్నారు. గత కొంతకాలం నుంచి జిల్లాలో నకిలీమద్యం తయారీ కొనసాగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని కొన్ని మద్యం దుకాణాల్లో ధరలతేడాతో పాటు మద్యం రుచి కూడా వేరేగా ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే నకిలీమద్యం అమ్మకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులున్నప్పటికీ ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఈ నకిలీమద్యం తయారీ రాకెట్‌ను గుర్తించలేకపోయారు. ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పెంబిలోని ఓ ఇంటిపై దాడిచేసి అక్రమమద్యం తయారీ దందా గుట్టురట్టు చేశారు. పట్టుబడిన ఇంట్లో బ్రాండెడ్‌ విస్కీసీసాలకు సంబంధించిన మూతలు అలాగే సీల్‌స్టిక్కర్‌లే కాకుండా మద్యంలో కలిపే ముడి రసాయనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ దందా సాగుతున్నప్పటికీ ఎక్సైజ్‌ అధికారులు మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు కల్లు దుకాణాల్లో కూడా పెద్దఎత్తున నకిలీరాజ్యం సాగుతోందంటున్నారు. ఇక్కడి కల్లులో క్లోరోహైడ్రేడ్‌ అలాగే డైజోఫామ్‌ను కూడా కలుపుతున్నారంటున్నారు. దీంతో అటు మద్యం సేవించే వ్యక్తులతో పాటు ఇటు కల్లు సేవించే వ్యక్తులు మత్తులోనే జోగుతుంటారని పేర్కొంటున్నారు. మొన్నటివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కల్లు వ్యాపారం ప్రస్తుతం ఊరూరా కొనసాగుతోందంటున్నారు. కల్లులో క్లోరోఫామ్‌ గాని డైజోఫామ్‌ గాని కలిపిన తరువాత రంగు కోసం ఓ రసాయనికపెస్ట్‌ను కూడా కలుపుతున్నారంటున్నారు. దీంతో కల్లు తాగే వారంతా ఈ కల్లు చెట్లపై నుంచే వచ్చిందంటూ సంబురపడుతున్నారు. 

ఇళ్లల్లోనే నకిలీ డెన్‌లు

కాగా జిల్లాలోని చాలా గ్రామాల్లో నకిలీమద్యం తయారీ కేంద్రాలు కొనసాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. అయితే నిర్మల్‌తో పాటు ఖానాపూర్‌, బైంసా ప్రాంతాల్లోల కొంతమంది అసలు మధ్యం సీసాల మూతలను ఎవరికి అను మానం రాకుండా అందులోని మద్యాన్ని తీస్తున్నారంటున్నా రు. అలాగే ఈ మద్యానికి నీరు, ఇతర రసాయనిక పదార్థాలను కలుపుతున్నారంటున్నారు. ఆ తరువాత కొనుగోలు చేసిన సీసాల్లో ఈ మద్యాన్ని నింపి ప్యాక్‌ చేయడమే కాకుండా ఈ ప్యాక్‌కు బ్రాండ్‌పేరును కూడా తగిలిస్తున్నారు. కాగా ఈ నకిలీమద్యం తయారీదారులు వ్యూహాత్మకంగా గ్రామాలకు దూరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇళ్లలో ఎవరికీ అనుమానం రాకుండా మద్యం తయారీని చేపడుతున్నారంటున్నారు. గ్రామీణప్రాంతాల్లో కొంతమంది తమ సొంత ఇళ్లనే నకిలీమద్యం తయారీకి డెన్‌లుగా వినియోగిస్తున్నారంటున్నారు. పెంబి మండలంలో పట్టుబడిన నకిలీమద్యం డెన్‌ వ్యవహారం ప్రస్తుతం ఎక్సైజ్‌శాఖకు సవాలుగా మారుతోందంటున్నారు. 

పెద్దఎత్తున కల్తీ కల్లు దందా

జిల్లాలో కల్తీకల్లు దందా కూడా పెద్దఎత్తున సాగుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. కల్లులో క్లోరల్‌హైడ్రేట్‌, డైజోఫామ్‌ కలుపుతున్నట్లు ఆరోపణలున్నాయి. క్లోరోహైడ్రెడ్‌, డైజోఫామ్‌కు అలవాటు పడ్డవారు ఆ కల్లుకు బానిసలుగా మారిపోతారు. ఈ రసాయనాలతో కూడిన కల్లును తాగినట్లయితే ఒకటి రెండురోజుల్లోనే వారు వింత ప్రవర్తనలు చేస్తూ పిచ్చివారిలాగా మారిపోతున్నారు. కొంతకాలం క్రితం వరకు కల్లుదందా తగ్గినప్పటికి మళ్లీ దీని వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న కారణంగానే కల్లు వ్యాపారులు క్లోరోహైడ్రెడ్‌, డైజీఫామ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారంటున్నారు. గుజరాత్‌లోని వాపి అనే ప్రాంతం నుంచి క్లోరల్‌హైడ్రెడ్‌ను జిల్లాకు తరలిస్తున్నారంటున్నారు. గ్రామాల్లో క్లోరల్‌ హైడ్రెడ్‌, డైజీఫామ్‌కు పెద్దఎత్తున డిమాండ్‌ ఉందంటున్నారు. 

ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం

ఇటు నకిలీమద్యం, అటు కల్తీకల్లు కారణంగా వందలాది మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. నకిలీమద్యంతో జీర్ణకోశవ్యాధులే కాకుం డా అస్తమా, టీబీ లాంటి వ్యాధులకు గురవుతున్నారు. అలాగే నకిలీ మద్యం కారణంగా సర్కారు ఆదాయానికి కూడా భారీగానే గండిపడుతోంది. నకిలీమద్యానికి బానిసైన వారు ఇక ఆ అలవాటును మానుకోలేకపోతున్నట్లు వాపోతున్నారు. దీంతో పాటు కల్తీకల్లు వినియోగం కారణంగా చాలా మంది మానసిక ఒత్తిడికి లోనై మతిస్థిమితం తగ్గినట్లుగా కనబడుతుంటారంటున్నారు. కల్తీకల్లు తాగేవారికి ఆ రోజు రాత్రికల్లు అందకుంటే టెన్షన్‌కు గురై విచిత్రంగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. మొత్తానికి ఈ రెండు అలవాట్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు దోహదపడుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా ఈ మద్యానికి బానిసలై కొందరు మానసికస్థితి కోల్పోతున్నారు. ఏ పనిచేసుకోలేక ఆదాయాన్ని కోల్పోతున్నారు. చివరికి కుటుంబాలను పోషించుకోలేక   ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి వారి సంఖ్య జిల్లాలో పెరిగిపోతున్నాయి. 

Updated Date - 2022-05-18T06:53:20+05:30 IST