రైతు మెడపై నకిలీ కత్తి

ABN , First Publish Date - 2022-05-14T06:07:42+05:30 IST

ఆదోని మండలానికి చెందిన రైతు గర్జప్ప బోరుబావి కింద మూడెకరాల్లో గత ఏడాది బీజీ-2 పత్తి సాగు చేశారు.

రైతు మెడపై నకిలీ కత్తి
వెల్దుర్తి వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్న బీజీ-2 నకిలీ పత్తి విత్తనాలు

  1. కర్ణాటక రాష్ట్రం సిరుగుప్పలో ప్యాకింగ్‌
  2. నంద్యాల, ఆదోని కేంద్రంగా సరఫరా
  3. రహస్యంగా గుంటూరుకు రవాణ
  4. రూ.కోట్లలో వ్యాపారం
  5. చోద్యం చూస్తున్న యంత్రాంగం
  6. తీవ్రంగా నష్టపోతున్న రైతాంగం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ఆదోని మండలానికి చెందిన రైతు గర్జప్ప బోరుబావి కింద మూడెకరాల్లో గత ఏడాది బీజీ-2 పత్తి సాగు చేశారు. మధ్యవర్తిని నమ్మి తక్కువ ధరకు వస్తాయని పది ప్యాకెట్లు నాసిరకం పత్తి విత్తనాలు కొని పొలంలో నాటితే.. 50 శాతం కూడా మొలకెత్తలేదు. మళ్లీ విత్తనాలు కొని నాటారు. నాణ్యమైన విత్తు కాకపోవడంతో సగటున పది క్వింటాళ్ల దిగుబడి కోల్పోయారు. తాజా రేట్ల ప్రకారం రూ.లక్ష నష్టపోవాల్సి వచ్చింది. గర్జప్ప ఒక్కరే కాదు.. నకిలీ, నాసిరకం పత్తి విత్తనాల బారిన పడి లక్షలాది రైతులదరిదీ ఇదే పరిస్థితి. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేయాల్సిన నిఘా యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకుంది. అక్రమార్కులు మాత్రం దొరికితే దొంగలు.. లేదంటే దొరల్లా పెట్రేగిపోతున్నారు. ఆదోని, నంద్యాల కేంద్రంగా వివిధ ప్రాంతాలకు నకిలీ విత్తనాలు సరఫరా అవుతున్నాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఆదోని మండలం చిన్నపెండేకల్లు గ్రామం నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.29 లక్షల విలువైన నకిలీ పత్తి విత్తనాలను బుధవారం సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. వీటిని కర్ణాకట రాష్ట్రం సిరుగుప్పలో ప్యాకింగ్‌ చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో నకిలీ విత్తుపై ప్రత్యేక కథనం..

జిల్లాలో గత ఏడాది 2.75 లక్షల హెకార్టు బీటీ-2 పత్తి సాగు చేశారు. తాజాగా పత్తి క్వింటం రూ.12 వేలకు పైగా పలుకుతోంది. ఈ సీజన్‌లో అత్యధికంగా రూ.8 వేలకు పైగా విక్రయించారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో 3.15 లక్షల హెక్టార్లకు పైగా సాగు చేసే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవంగా ఎకరాకు మూడు చొప్పున హెక్టారుకు ఎనిమిది ప్యాకెట్లు (ఒక్కో ప్యాకెట్‌ 450 గ్రామలు) పత్తి విత్తనాలు నాటుతున్నారు. ఈ లెక్కన 25 లక్షల ప్యాకెట్లు బీటీ-2 పత్తి విత్తనాలు అవసరం ఉందని అంచనా. అలాగే వివిధ కారణాల వల్ల 20-30 శాతం వరకు సక్రమంగా మొలకెత్తకపోతే మళ్లీ నాటాల్సి వస్తుంది. సరాసరి 35-40 లక్షల ప్యాకెట్లు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అను మతి పొందిన విత్తన కంపెనీలు సరఫరా చేయడం లేదని విత్తన వ్యాపారి ఒకరు పేర్కొన్నారు. డిమాండ్‌ను సొమ్ము చేసుకోవడానికి అక్రమార్కులు రంగంలో దిగి నాసిరకం, నకిలీ విత్తనాలు అంటగట్టి రైతు లను నట్టేట ముంచుతున్నారు.

    

చిన్నపెండేకల్లు  కేంద్రంగా రవాణ

ఆదోని మండలం చిన్న పెండేకల్లు కేంద్రంగా బీటీ-2 పత్తి నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అధికారులు గుర్తించారు. ఆ గ్రామానికి చెందిన మునేష్‌ పల్లవి, ప్రిన్స్‌, కావ్య పేర్లతో ప్యాకింగ్‌ చేసిన నాలుగు వేల ప్యాకెట్లు (ఒకటి 450 గ్రాములు) గుంటూరుకు రవాణ చేస్తుండగా వెల్దుర్తి వద్ద పోలీసులు అరెస్టు చేసి నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. తాను పండించడమే కాకుండా ఆదోని ప్రాంతంలో రైతులు పండించిన విత్తనాలను సేకరించిన లూజు విత్తనాలను కర్ణాటక రాష్ట్రంలో సిరుగుప్ప పట్టణానికి తరలించి అక్కడ ఆకర్శనీయమైన ప్యాకెట్లలో ప్యాకింగ్‌ చేసి జిల్లాలోనే కాకుండా గుంటూరు వంటి ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నకిలీ విత్తనాల రాకెట్‌ దొరికితే దొంగలు.. లేదంటే దొరల్లా సాగిపోతోంది. ఇప్పటికే రూ.కోట్ల విలువైన నకిలీ విత్తనాలు వివిధ ప్రాంతాలకు చేరవేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. చిన్నపెండేకల్లులో ఒక్కటే కాదు.. నంద్యాల, ఎమ్మిగనూరు, కోసిగి, కౌతాళం, గోనెగండ్ల ప్రాంతాల్లో నుంచి ఈ రాకెట్‌ నడుస్తున్నట్టు సమాచారం. గతేడాది చిన్నపెండేకల్లు గ్రామంలో ఓ రైతు వద్ద తొమ్మిది ప్యాకెట్లు నకిలీ విత్తనాలు వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. తూకం వేసి ప్యాకింగ్‌ చేస్తునట్లు గుర్తించారు. ఖాళీ ప్యాకెట్లు ఎలా వచ్చాయని తీగ లాగితే.. ఎమ్మిగనూరు నుంచి హైదరాబాద్‌లో డొంక కదిలింది. సుమారు రూ.2 కోట్లకు పైగా ఖాళీ ప్యాకెట్లు, ప్రిటింగ్‌ సామగ్రి స్వాధీనం చేసుకొని 11 మందిని అరెస్టు చేశారు. తాజాగా ప్యాకింగ్‌ను సిరుగుప్పకు మార్చినట్లు తెలిసింది. 


నకి‘లీలలు’ ఇలా..

ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఆదోని, గోనెగండ్ల, కౌతాళం, పెద్దకడుబూరు, కోసిగి, ఆస్పరి మండలాలు సహా నంద్యాల, చాగలమర్రి, గడివేముల, పాణ్యం, ఆళ్లగడ్డ వంటి ప్రాంతాల్లో దాదాపు 15 వేల హెక్టార్లలో రైతులు సీడ్‌ పత్తి సాగు చేస్తునట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తన కంపెనీలతో క్వింటం రూ.35-40 వేలకు ఒప్పందం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే.. కిలో (1,000 గ్రాములు) రూ.350-400 కూడా దక్కదు. అవే విత్తనాలను ఆయా కంపెనీలు గ్రేడింగ్‌, జర్మినేషన్‌ టెస్టింగ్‌ చేసి 450 గ్రామాలు ప్యాకెట్‌ ఎంఆర్‌పీ రేటు రూ.810 ప్రకారం విక్రయిస్తున్నారు. అంటే.. కిలో సరాసరి రూ.1,620 రైతులకు విక్రయిస్తున్నారు. దీంతో కొందరు విత్తనోత్పత్తి రైతులు, సీడ్‌ గ్రోయర్స్‌ (మధ్యవర్తులు) ఒప్పందం మేరకు ఎకరాకు 4-5 క్వింటాళ్లు మాత్రమే కంపెనీలకు ఇచ్చి మిగిలిన విత్తనాలను ఎలాంటి గ్రేడింగ్‌, జర్మినేషన్‌ (మొలక శాతం) చేయకుండా నిబంధనలకు విరుద్ధంగా రైతులను ఆకర్శించేలా అందమైన ప్యాకింగ్‌ చేసి రహస్యంగా రైతులకు విక్రయిస్తున్నారు. అంతేకాదు.. కంపెనీలు తిరస్కరించిన నాణ్యతలేని విత్తనాలను కూడా నకిలీల రూపంలో విక్రయాలు చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కొందరు విత్తనోత్పత్తి రైతులు తెల్ల కాటన్‌ సంచుల్లో నింపి కిలో రూ.650 నుంచి 750కే విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు వస్తాయని కొనుగోలు చేసి రైతులు నష్టపోతున్నారు. ఇలా నాసిరకం, నకిలీ విత్తనాలు వల్ల ఎకరాకు 3-5 క్వింటాళ్లు దిగుబడి నష్టపోయే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. 


కొరవడి నిఘా..

తెలంగాణలోని ఐజ, గద్వాల, శాంతినగర్‌ ప్రాంతాలు, కర్ణాటక రాష్ట్రంలోని సిరుగుప్ప, రాయచూరు, సింధనూరు ప్రాంతాల నుంచి బీజీ-2 పత్తి నకిలీ విత్తనాలు సరిహద్దు దాటి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. విస్తృత నిఘా పెట్టి ప్రారంభంలోనే నకిలీ విత్తనాలను అరికట్టకపోతే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఏపీ రైతు సంఘం నాయకులు అంటున్నారు. 

ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం - వరలక్ష్మి, జేడీ, వ్యవసాయ శాఖ, కర్నూలు: 

రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా పత్తి సాగు చేసేది కర్నూలు జిల్లాలోనే. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను నియమించాం. నకిలీ, నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్నట్లు ఎవరైనా సమాచారం ఇస్తే తక్షణమే దాడులు చేస్తాం. తక్కువ రేటుకు వస్తాయని నకిలీ విత్తనాలు కొని నష్టపోకుండా అవగాహన కల్పిస్తాం. మార్కెట్లో అనుమతి పొందిన ప్రముఖ కంపెనీ విత్తనాలు పుష్కలంగా లభిస్తున్నాయి. ఎక్కడ విత్తనాలు కొనుగోలు చేసినా బిల్లు తప్పక తీసుకోవాలి. 

Read more