Fake Cricket: ఓర్నీ! ఏకంగా ఫేక్ ఐపీఎల్ నిర్వహించేశారు!

ABN , First Publish Date - 2022-07-12T00:24:34+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ క్రేజ్‌ను తమకు అనకూలంగా

Fake Cricket: ఓర్నీ! ఏకంగా ఫేక్ ఐపీఎల్ నిర్వహించేశారు!

అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ క్రేజ్‌ను తమకు అనకూలంగా మలుచకున్న కొందరు ఏకంగా ఫేక్ ఐపీఎల్ నిర్వహించి రష్యాన్ల నుంచి అందినకాడికి దోచుకున్నారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 1973 నాటి ‘ది స్టింగ్’ సినిమాను తలపించిన ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. మెహన్సా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన కొందరు యువకులు తోటపని చేసే కూలీలకు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జెర్సీలు తొడిగి మ్యాచ్‌లు నిర్వహించారు. అంతేకాదు, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే స్వరాన్ని మిమిక్రీ చేసి మరీ కామెంటరీ కూడా చెప్పారు. నిజమైన ఐపీఎల్ మ్యాచ్‌లను చూస్తున్న అనుభూతి కలిగించారు. ఆటగాళ్లుగా నటించినందుకు ఒక్కో కూలీకి రోజుకు రూ. 400 ఇచ్చేవారు. 


ఈ మ్యాచుల్లో అందరూ నకిలీలే. అంపైర్లుగా ఉన్నవారు నకిలీ వాకీటాకీల్లో మాట్లాడుతున్నట్టు నటించేవారు. యూట్యూబ్‌లో 5హెచ్‌బీ కెమెరాలను ఉపయోగించి మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసేవారు. స్టేడియంలో వేలమంది కూర్చుని మ్యాచ్‌లను చూస్తున్నట్టుగా గ్రాఫిక్స్, సౌండ్స్ జోడించారు. బెట్టింగ్‌కు వీలుగా టెలిగ్రామ్ లింకులను కూడా పెట్టేవారు. ఈ మ్యాచ్‌లను చూసిన రష్యన్లు నిజమైన ఐపీఎల్‌గా భ్రమించి టెలిగ్రామ్ ద్వారా బెట్టింగులు కట్టారు. ఫలితంగా త్వెర్, వొరోనెజ్, మాస్కో నగరాలకు చెందిన ఎంతోమంది లక్షలాది రూపాయలను పోగొట్టుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చాక పోలీసులు ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశారు.


మూడు వారాలపాటు జరిగిన ఈ ఐపీఎల్ క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోవడం మరో విశేషం. పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన ఈ మ్యాచుల కోసం 21 మంది కూలీలను, నిరుద్యోగ యువకులను ఎంచుకున్నారు. ఈ నకిలీ ఐపీఎల్‌కు కీలక సూత్రధారి అయిన షోయబ్ దవ్దా 8 నెలలపాటు రష్యా పబ్‌లో పనిచేయడం అతడికి కలిసొచ్చింది. ఐపీఎల్ గురించి అక్కడి వారి ఆసక్తిని గుర్తించి ఈ ప్లాన్ వేశాడు. రష్యా నుంచి ఈ తతంగం మొత్తాన్ని నడిపించిన అసిఫ్ మహ్మద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


ఈ నకిలీ ఐపీఎల్‌కు ఆనంద్ మహీంద్రా కూడా ఫిదా అయిపోయారు. దీనిని వారు ‘మెటావర్స్ ఐపీఎల్’ అని పిలిచి ఉంటే ఇంకా బాగుండేదని, బిలియన్ డాలర్లు సంపాదించి ఉండేవారని పేర్కొన్నారు. కామెంటేటర్ హర్షా భోగ్లే కూడా స్పందించాడు. విషయం తెలిసి నవ్వలేకుండా ఉండలేకపోయానని, ఆ కామెంటరీని ఒకసారి వినాలని ట్వీట్ చేశాడు.  

Updated Date - 2022-07-12T00:24:34+05:30 IST