తవ్వకాల్లో బంగారం అంటూ టోకరా...

ABN , First Publish Date - 2021-04-25T17:34:36+05:30 IST

తవ్వకాల్లో బంగారం లభించిందని శాంపిల్‌గా అసలు బంగారం చూపి...

తవ్వకాల్లో బంగారం అంటూ టోకరా...

  • నకిలీ అంటగట్టి మోసం
  • ముగ్గురు సభ్యుల ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ : తవ్వకాల్లో బంగారం లభించిందని శాంపిల్‌గా అసలు బంగారం చూపి మోసానికి పాల్పడిన ముఠా ఒకరి నుంచి రూ. 17 లక్షలు కాజేసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన చాంద్రాయణగుట్ట పోలీసు బృందాలు ముగ్గురు నిందితుల అంతరాష్ట్ర ముఠాను అరెస్టు చేశాయి. శనివారం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 


కర్ణాటక రాష్ట్రం, కోలార్‌ జిల్లాకు చెందిన శివయ్య (30) డ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన తిరుపతయ్య (25) రైతు. చిత్తూరు జిల్లా, పుంగనూరుకు చెందిన ఇంద్రాజు (27) డ్రైవర్‌. ముగ్గురూ ఓ ముఠాగా ఏర్పడ్డారు. చాంద్రాయణగుట్ట, బండ్లగూడ ప్రాంతానికి చెందిన కె.విజయ్‌కుమార్‌ కెఎల్‌ఏ లాజిస్టిక్స్‌ పేరిట ఆన్‌లైన్‌ బస్‌ టిక్కెట్ల బుకింగ్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతని ద్వారా గత నెలలో ముఠాకు చెందిన ఆ ముగ్గురు కూడా టికెట్‌లు బుక్‌ చేసుకున్నారు. అప్పట్లో గ్యాంగు సభ్యులు, ట్రావెల్‌ ఏజెంట్లు తమ ఫోన్‌ నెంబర్లను, విజిటింగ్‌ కార్డులను ఇచ్చి పుచ్చుకున్నారు.


తవ్వకాల్లో బంగారం అంటూ..

గత నెల 9న విజయ్‌కుమార్‌కు ముఠాలోని ఓ సభ్యుడు ఫోన్‌ చేసి తాము మైసూరు ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా భారీగా బంగారం దొరికిందని చెప్పాడు. బంగారం విక్రయుంచేంత పరిచయాలు లేవని, ఆ బంగారం కొనుగోలు చేస్తే తక్కువ ధరకు ఇస్తానని చెప్పాడు. కావాలంటే బంగారం తెచ్చి చూపిస్తానని నమ్మించాడు. దాంతో విజయ్‌కుమార్‌ అతని మాటలు నమ్మి బంగారం చూస్తానన్నాడు. గుర్తు తెలియని వ్యక్తి గత నెల 14న నాలుగు చిన్న బంగారం ముక్కలు చూపించాడు. వాటిని తీసుకుని ఓ స్వర్ణకారుడికి చూపగా అది అసలు  బంగారమేనని చెప్పాడు. పూర్తిగా నమ్మిన విజయ్‌కుమార్‌ బంగారం మొత్తాన్ని రూ.17 లక్షలు ఇచ్చి కొనుగోలు చేశాడు. పది రోజుల తర్వాత ఆ బంగారాన్ని స్వర్ణకారుడి వద్దకు తీసుకెళ్లగా అది బంగారం కాదని తెలిసింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు ఈనెల 21న చాంద్రాయణగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారం సేకరించిన పోలీసులు చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. వారి నుంచి నగదు, నకిలీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-04-25T17:34:36+05:30 IST