పత్తి దిగుబడులకు రికార్డు ధరలు

ABN , First Publish Date - 2022-06-04T05:30:00+05:30 IST

ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతాంగానికి నకిలీ పత్తి విత్తనాల భయం పట్టుకుంది. వారం క్రితం పెద్దవడుగూరు మండలకేంద్రంలో వైసీపీ మద్దతుదారుని ఇంట్లో 51 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను వ్యవసాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

పత్తి దిగుబడులకు రికార్డు ధరలు
నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్‌

నకిలీ భయం

సాగుకు సిద్ధపడుతున్న  రైతులు

మార్కెట్‌లో నకిలీ విత్తు కలకలం

గత ఏడాది భారీగా నష్టపోయిన రైతులు

ఆందోళన చేసినా.. అందని పరిహారం

ఉదాసీనంగా   వ్యవసాయశాఖ అధికారులు


ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్న రైతాంగానికి నకిలీ పత్తి విత్తనాల భయం పట్టుకుంది. వారం క్రితం పెద్దవడుగూరు మండలకేంద్రంలో వైసీపీ మద్దతుదారుని ఇంట్లో 51 నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను వ్యవసాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ఎంపీటీసీకి సమీప బంధువు కావడంతో వ్యవసాయశాఖ అధికారులు కేవలం పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకుని, రైతుభరోసా కేంద్రానికి తరలించి సరిపెట్టారు. దీనిపై కేసు నమోదు చేసి, లోతుగా విచారణ జరిపి ఉంటే అవి ఎక్కడి నుంచి వచ్చాయో తెలిసేది. జిల్లాలో అత్యధికంగా పెద్దవడుగూరు మండలంలో 40 వేల ఎకరాల్లో పత్తి సాగుచేస్తారు. మిగిలిన మండలాల్లో 5 వేల నుంచి 10 వేల ఎకరాల్లో సాగు అవుతుంది. ఈ ఏడాది పత్తి ధరలు రికార్డుస్థాయిలో క్వింటం రూ.14 వేలు పలకడంతో రైతులు ఖరీఫ్‌ సీజనలో భారీగా సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నకిలీ పత్తి విత్తనాలు తెరపైకి రావడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. 

తాడిపత్రి


కర్నూలు జిల్లా నుంచి..

కర్నూలు జిల్లాలో పత్తిసాగు విస్తీర్ణం ఎక్కువ. అక్కడ నకిలీ విత్తనాల బెడదకూడా ఎక్కువ. అక్కడి నుంచే అనంతకు నకిలీ విత్తు వస్తోంది. ఏటా భారీ ఎత్తున నకిలీ పత్తి విత్తనాలను అక్కడి అధికారులు పట్టుకుంటున్నా దందా ఆగడం లేదు. గుంటూరు జిల్లాతోపాటు తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల నుంచి కర్నూలు జిల్లాకు నకిలీ పత్తివిత్తనాలు రవాణా అవుతున్నాయని అధికారులు అంటున్నారు. అనంతపురం జిల్లాకు కర్నూలు సరిహద్దు కావడంతో అక్కడి నుంచి నకిలీ విత్తనాలను వ్యాపారులు  తెచ్చి, ఇక్కడి రైతులకు విక్రయిస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాక్‌లలో నింపి.. గ్రామ గ్రామాలకు వెళ్లి రైతులను బుట్టలోకి వేసుకుంటున్నారు. తక్కువ ధర, ఎక్కువ దిగుబడి పేరుతో అమ్ముతున్నారు. వ్యాపారుల కల్లబొల్లి మాటలునమ్మి రైతులు నష్టపోతున్నారు.


బిల్లులు లేకుండా..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఫర్టిలైజర్స్‌ దుకాణాలలో బిల్లులు లేకుండా పత్తివిత్తనాలను అమ్ముతున్నారు. బిల్లు ఇస్తే ఒక రేటు, లేకుంటే మరో రేటు అంటున్నారు. దీంతో తక్కువ ధరకు వస్తాయని భావించి, రైతులు బిల్లులు లేకుండానే విత్తనాలను కొంటున్నారు. బిల్లులు ఇవ్వకపోతే పంట దిగుబడి సరిగా రాకున్నా తమకు ఇబ్బంది ఉండదని నకిలీ విత్తన వ్యాపారులు ఎత్తుగడ వేస్తున్నారు. కొందరు వ్యవసాయ శాఖ అధికారులకు ఫర్టిలైజర్స్‌ దుకాణదారులతో ‘ఆర్థిక సంబంధాలు’ ఉండడంతో తూతూమంత్రం గా తనిఖీ చేస్తున్నారు. ఈ కారణంగా రైతులు నిండా మునిగిపోతున్నారు. నకిలీ విత్తనాల వల్ల తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు గతంలో అధికారులను ఆశ్రయించినా, నామమాత్రపు విచారణతో సరిపెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. 


తెగుళ్ల ఉధృతి

నకిలీ పత్తి విత్తనాలకు తెగుళ్ల నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీంతో తెగుళ్లు ఎక్కువై.. పంట దెబ్బతింటుంది. ఆశించిన దిగుబడి రాదు. గత ఏడాది గులాబి రంగు పురుగుతోపాటు ఇతర తెగుళ్లతో పత్తిపంట తీవ్రంగా దెబ్బతినింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ గత ఏడాది 2 నుంచి 4 క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. దీనికి నకిలీ విత్తనాలే కారణమని రైతులు గగ్గోలు పెట్టారు. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పత్తిపంటను పరిశీలించిన అధికారులు, వాతావరణ పరిస్థితుల వల్ల పంట దెబ్బతిని ఉంటుందని, నకిలీ విత్తనాల ప్రశ్నే లేదని సమర్థించుకున్నారు. ఆదుకోవాల్సిన అధికారులే ఇలా చేయడంతో రైతులు మనోవేదనకు గురయ్యారు. నకిలీ విత్తన వ్యాపారులకు, విత్తన కంపెనీలకు కొందరు అధికారులు వత్తాసుపలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. 


ధర్నాకు దిగిన రైతులు

గత ఏడాది ఖరీఫ్‌, రబీ సీజన్లలో పెద్దవడుగూరు మండలంలో నకిలీ విత్తనాల వల్ల 400 ఎకరాల్లో పత్తిపంట పూర్తిగా దెబ్బతినింది. దీంతో ఆగ్రహించిన పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, మల్లేపల్లి తదితర గ్రామాల రైతులు.. పెద్దవడుగూరు మండల కేంద్రంలోని ఫర్టిలైజర్స్‌ దుకాణాల వద్ద ధర్నాకు దిగారు. నకిలీ విత్తనాలను అంటగట్టడం వల్లే తీవ్రంగా నష్టపోయామని, పరిహారం ఇప్పించాలని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద కూడా రైతులు ఆందోళనకు దిగారు. ఫర్టిలైజర్స్‌ దుకాణాలు, కంపెనీలపై కేసు నమోదు చేయాలని పోలీసుస్టేషనలో ఫిర్యాదు చేశారు. నష్టపోయిన రైతులందరికీ న్యాయం చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు నయాపైసా కూడా రైతులకు అందలేదు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులను ప్రశ్నిస్తే, దాటవేత ధోరణి అవలంభిస్తున్నారని రైతులు వాపోతున్నారు. 


భారీగా పెట్టుబడి..

2021-22 ఖరీఫ్‌, రబీ సీజన్లలో ఒక్కొక్కరైతు పత్తిసాగుకోసం ఎకరానికి రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెట్టారు. కౌలు రైతులు అదనంగా ఖర్చు చేశారు. మెట్టకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు, తరి భూముల్లో రూ.15 వేలు కౌలు చెల్లించారు. కానీ నకిలీ విత్తనాల కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. పెట్టుబడి కూడా చేతికి అందలేదు. పత్తి ధర ఎక్కువగా ఉండడంతో గులాబి రంగు పురుగు నుంచి పంటను కాపాడుకునేందుకు సస్యరక్షణకు మరింత ఖర్చుచేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా క్వింటానికి రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు  ధర పలకడంతో రైతులు కొంత గట్టెక్కారు. లేదంటే నకిలీల దెబ్బకు పరిస్థితి దారుణంగా తయారయ్యేది. 


ఎనిమిది ఎకరాల్లో నష్టం..

గత ఏడాది ఖరీఫ్‌ సీజనలో మొత్తం 8 ఎకరాల్లో పత్తి పంటను సాగుచేశాను. నాలుగు ఎకరాల సొంత భూమికితోడు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. ఎకరాకు రూ.40 వేలు పెట్టుబడి పెట్టాను. నకిలీ విత్తనాల వల్ల దిగుబడి తగ్గిపోయింది. పెట్టుబడి కూడా తిరిగిరాలేదు. 

- బ్రహ్మానందరెడ్డి, మల్లేపల్లి, పెద్దవడుగూరు మండలం


పరిహారం ఇప్పించలేదు..

ఎకరాకు రూ.10 వేలు చొప్పున ఐదెకరాలను కౌలుకు తీసుకుని పత్తి సాగుచేశాను. నకిలీ విత్తనాల కారణంగానే పంట దెబ్బతినిందని వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశాను. ఫర్టిలైజర్స్‌ షాపుపై చర్యలు తీసుకుంటామని, విత్తన కంపెనీలకు నోటీసులు పంపి పరిహారం ఇప్పిస్తామని వ్యవసాయశాఖ అధికారులు మాకు నచ్చచెప్పి పంపించారు. ఇంతవరకు పరిహారం రాలేదు. సీజన ప్రారంభం కావడంతో అప్పులు చేసి పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతున్నా. ఈసారైన నాణ్యమైన విత్తనాలు దొరుకుతాయో లేదో అని భయంగా ఉంది.

- పెద్ద ఆంజనేయులు, లక్షుంపల్లి, పెద్దవడుగూరు మండలం


నాణ్యత లేక మొలకెత్తలేదు..

ఖరీఫ్‌ సీజనలో ఐదెకరాల్లో పత్తిని సాగుచేశాను. విత్తనాలు నాణ్యంగా లేకపోవడంతో మొలకెత్తలేదు. వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దాదాపు లక్షన్నర నష్టం వాటిల్లింది. 

- పుల్లారెడ్డి, పుట్లూరు


గుర్తించలేకున్నాం..

గత ఏడాది 7 ఎకరాల్లో పత్తిని సాగుచేశాను. ఎన్నడూ లేనివిధంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. నకిలీ విత్తనాలు కారణమై ఉంటాయని వ్యవసాయశాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాను. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారే తప్ప, చర్యలు తీసుకో లేదు. విత్తనాలు ఏవి నకిలీవో ఏవి నాణ్యమైనవో మేం గుర్తించలేకున్నాం. అధికారులు అవగాహన కల్పించడం లేదు.

- గురుమూర్తి, కమలపాడు, యాడికి మండలం


అమ్మితే కఠిన చర్యలు

నకిలీ పత్తి విత్తనాలను అమ్మే ఫర్టిలైజర్స్‌ దుకాణాలపై, వ్యాపారులపైన కఠిన చర్యలు తీసుకుంటాం. తనిఖీలు కూడా చేస్తున్నాం. నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నారన్న సమాచారం ఇస్తే దాడులు నిర్వహిస్తాం. 

- మల్లేశ్వరి, వ్యవసాయశాఖ అధికారి

పెద్దవడుగూరు మండలం

Updated Date - 2022-06-04T05:30:00+05:30 IST