నకిలీ విపత్తు

ABN , First Publish Date - 2020-06-05T09:57:18+05:30 IST

వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 విత్తనాలు మండలాల్లో, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు.

నకిలీ విపత్తు

ఊరూరా నకిలీ విత్తనాల విక్రయాలు 

పత్తి రైతులకు దళారుల వల 

గ్రామాల్లో యథేచ్ఛగా బీటీ-3 విత్తనాల అమ్మకాలు

నిషేధమున్నా ఆగని దందా 

పీడీ యాక్టు అమలు చేస్తామంటున్న అధికారులు


ఉమ్మడి జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో అసలు విత్తనాలు ఏవో.. నకిలీవి ఏవో పోల్చుకోలేని పరిస్థితి నెలకొంది. తక్కువ ధరకు వస్తున్నాయి.. ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతులకు ఆశచూపుతున్నారు. దీంతో ఏటా నకిలీ బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బ్రోకర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : వానాకాలం పంటలకు సిద్ధమవుతున్న రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. ప్రభుత్వం నిషేధించిన బీటీ-3 విత్తనాలు మండలాల్లో, గ్రామాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. వ్యవసాయశాఖ అధికారులు విత్తన విక్రయాలపై దృష్టిసారించకపోవడంతో దళారుల వద్ద విత్తనాలు కొని  రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోంది. సంబంధిత వ్యవసాయాధికారులు నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వారిపై దాడులు నిర్వహిస్తున్నా.. కొంత మంది బ్రోకర్లు నేరుగా రైతుల వద్దకే వెళ్లి నకిలీ బీటీ-3 విత్తనాలను అందిస్తున్నారు. ఈఏడాది ఇప్పటివరకు రూ.88.48 లక్షల విలువగల నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి. 


ఈసారి వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే రైతులు వేసవి దుక్కులు దున్ని విత్తులు విత్తేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈసారి నియంత్రిత సాగుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాగు గణనీయంగా పెరగనుంది. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో 8,56,439 ఎకరాల సాధారణ విస్తీర్ణం కాగా.. గత ఏడాది 9,83,780 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశారు. ఈసారి 8,94,421 ఎకరాలు సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. అందులో పత్తి సాగే అధికంగా ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2,81,133 ఎకరాలు కాగా.. గతేడాది 4,12,788 ఎకరాల్లో సాగు చేశారు. సాగు విస్తీర్ణాన్ని మించిపోయింది.


ఈసారి వానాకాలంలో 4,62,549 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాది పత్తి సాగును పోల్చుకుని చూస్తే ఈసారి 49,761 ఎకరాల సాగు విస్తీర్ణం పెరగనుంది. పెరిగిన సాగుకు అనుగుణంగా రైతులకు విత్తనాలు సరఫరా చేయడం కష్టమేనంటున్నారు. ఇదే తరుణంలో నకిలీ విత్తనాలు మార్కెట్లోకి ప్రవేశించాయి. నకిలీ విత్తనాలు అసలు విత్తనాలను పోలి ఉన్నాయి. దీంతో రైతులకు ఏది నకిలీయో.. ఏది ఒరిజినలో తేల్చుకోలేకపోతున్నారు. ఏటా నకిలీల బారినపడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గతేడాది బోల్‌గార్డు-3 పత్తి విత్తనాలతో నష్టపోయారు. ఈ విత్తనాలను ప్రభుత్వం నిషేధించినప్పటికీ లాభాలు అధికంగా వస్తాయని రైతులను మభ్యపెట్టి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. 


పట్టుబడిన నకిలీ విత్తనాలివే.. 

రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో పెద్ద మొత్తంలో నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. వానాకాలం సాగుకు సిద్ధమవుతోన్న తరుణంలోనే నకిలీ విత్తనాలు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మే నెల చివరివారంలో రంగారెడ్డి జిల్లాలో నాలుగు చోట్ల మొత్తం రూ.57.48 లక్షల నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. వీటిలో మే 27న షాద్‌నగర్‌లో రూ. 3 లక్షలు విలువ కలిగిన నకిలీ విత్తనాలు పట్టుబడగా, మరుసటి రోజు 28వ తేదీన కందుకూరు మండల కేంద్రం రహదారిపై రూ.32 లక్షలు విలువ కలిగిన నకిలీ విత్తనాల లారీని పోలీసులు పట్టుకున్నారు. అలాగే అబ్దుల్లాపూర్‌మెట్‌లో రూ.22 లక్షలు, అదేరోజు అదే ప్రాంతంలోని ఆటోనగర్‌లో రూ.48 వేల నకిలీ కంది విత్తనాలు పట్టుబడ్డాయి. జూన్‌ 3వ తేదీన మేడ్చల్‌ జిల్లాలో కండ్లకోయ వద్ద సీడ్స్‌ గోదాంపై విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి రూ.31 లక్షల విలువైన నకిలీ విత్తనాలను పట్టుకున్నారు. పొద్దుతిరుగుడు, మొక్కజొన్న, జొన్నవిత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


నకిలీ విత్తనాలపై ప్రత్యేక దృష్టి

వానాకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో అధికారులు నకిలీ విత్తనాలు, నిషేధిత విత్తనాలపై దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో మూడు జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ టీంలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్‌, రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఈ టీంలు పనిచేస్తున్నాయి. ఒక్కో టీంలో వ్యవసాయశాఖ ఏడీ, పోలీస్‌ అధికారి, సీడ్‌ సర్టిఫికేషన్‌ అధికారి ఉన్నారు. అలాగే డివిజన్‌స్థాయిలో ఐదుటీంలు పనిచేస్తున్నాయి. 27మండలాల్లో మండల టీంలు నకిలీ విత్తనాలపై నిఘా పెట్టాయి. అలాగే మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాల్లో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 


క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

ఎవరైనా నకిలీ విత్తనాలను రైతులకు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. తక్కువ ధరకు వస్తున్నాయని బయటి వ్యక్తుల వద్ద కొని మోసపోవద్దు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. కొన్నాక తప్పనిసరిగా రశీదు పొందాలి. బీటీ-3 విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. ఆ విత్తనాలను అంటగట్టేందుకు ప్రయత్నిస్తే వెంటనే పోలీసులకు, వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే డీలర్లకు, రైతులకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశాం. ప్రభుత్వ గుర్తింపు లేని డీలర్లు నాసిరకం విత్తనాలు అమ్ముతున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన వారంతా అనధికార, లైసెన్సు లేని డీలర్లే. షాద్‌నగర్‌లో రూ.3లక్షలు, కందుకూరులో రూ.32లక్షలు, అబ్దుల్లాపూర్‌లో రూ.22లక్షలు, ఆటోనగర్‌లో రూ.48వేల నకిలీ విత్తనాలు పట్టుకున్నాం.

- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

Updated Date - 2020-06-05T09:57:18+05:30 IST