నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా!

ABN , First Publish Date - 2022-02-12T15:22:42+05:30 IST

పరిశ్రమల నగరం కోయంబత్తూరులో నకిలీ పత్రాలతో పది కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణం పొంది ఎగవేతకు పాల్పడిన కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌తో పాటు మొత్తం ఎనిమిదిమందిని క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్టు

నకిలీ పత్రాలతో బ్యాంకుకు టోకరా!

- రూ.10.73 కోట్ల రుణాల ఎగవేత

- కోవైలో మేనేజర్‌ సహా 8మంది అరెస్టు


చెన్నై: పరిశ్రమల నగరం కోయంబత్తూరులో నకిలీ పత్రాలతో పది కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణం పొంది ఎగవేతకు పాల్పడిన కేసులో ఆ బ్యాంకు మేనేజర్‌తో పాటు మొత్తం ఎనిమిదిమందిని క్రైంబ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసం వివరాల్లోకి వెళితే... కోయంబత్తూరు జిల్లాకు చెందిన కనకరాజ్‌ (39) ఆర్‌ఎస్ పురంలోని ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.10.79 కోట్ల మేర రుణం తీసుకున్నాడు. గతంలో టెక్స్‌టైల్స్‌ మిల్లుల ఏర్పాటుకు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి ఆ రుణాన్ని తీసుకున్నాడు. అయితే ఆ రుణానికి సంబంధించి అసలు గానీ, వడ్డీగానీ చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. దీని గురించి బ్యాంకు అధికారులు ఎన్నిమార్లు ఆయన్ని సంప్రదించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో బ్యాంకు ఉన్న తాధికారుల నుంచి గత నెలలో అందిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కోవై క్రైం బ్రాంచ్‌ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. కనకరాజ్‌ నకిలీ పత్రాలు సృష్టించాడని, అసలు టెక్స్‌టైల్స్‌ మిల్లుల ఏర్పాటే లేదని దర్యాప్తులో తేలింది. అయితే ఆ డ్రామాకు బ్యాంకు మేనేజర్‌ రాజేష్‌ కూడా సహకరించినట్లు తేలడంతో కనకరాజ్‌, రాజేష్‌ సహా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న కోయంబత్తూరుకు చెందిన కార్తికేయ, రాధిక, సంపత్‌ కుమార్‌, దురైరాజ్‌, మహేశ్వరి, రాజులను కూడా గురువారం రాత్రి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఇంకెవరెవరి హస్తముంది? బడా నేతల ప్రమేయముందా అన్నదానిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-02-12T15:22:42+05:30 IST