నకిలీ వి‘పత్తి’

ABN , First Publish Date - 2020-06-05T10:05:55+05:30 IST

పత్తి రైతులు నకిలీ విత్తనాల ముఠా చేతిలో చిక్కుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సరఫరా గుట్టుగా ..

నకిలీ వి‘పత్తి’

గ్రామాల్లోకి నకిలీ పత్తి విత్తనాలు

రహస్యంగా రాత్రి పూట విక్రయిస్తున్న వ్యాపారులు

ఇళ్లకే ప్యాకెట్లు పంపుతున్న వైనం


(విజయనగరం-ఆంధ్రజ్యోతి): పత్తి రైతులు నకిలీ విత్తనాల ముఠా చేతిలో చిక్కుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల సరఫరా గుట్టుగా జరిగిపోతోంది. ఏదోలా వాటిని రైతులకు అంటగట్టే  ప్రయత్నం ఊపందుకుంది. వ్యాపారులు వాటిని గుట్టుగా గ్రామాల్లోకి తరలించి రాత్రి పూట ఇళ్లకు పంపుతున్నారు. నిషేధిత విత్తనాల సరఫరాకూ తెగిస్తున్నారు. ఈ విత్తన ప్యాకెట్లపై ధర, బ్యాచ్‌ నెంబర్‌, ఎక్కడ తయారైందీ వంటి పూర్తిస్థాయి సమాచారం ఉండటం లేదు. భవిష్యత్‌లో పంటలో తేడా వస్తే ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి వస్తుంది. విత్తన వ్యవహారంలో జిల్లాలో ఓ రాకెట్‌గా సాగుతోంది. ఒక్కో ప్రాంతానికి ఒక్కో ఏజెంట్‌ను పెట్టుకుని పత్తి వ్యాపారులు ఈ పనికి ఒడిగడుతున్నారు.


వాస్తవంగా ప్రభుత్వం గ్రామ సచివాలయాల ద్వారా విత్తనాలను అందిస్తోంది. ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ అన్ని రకాలనూ అందుబాటులో ఉంచింది. కానీ రైతులు వ్యాపారుల మాయలో పడి నిషేధిత విత్తనాలను వేస్తున్నారు. గ్రామాల్లో గడ్డి విత్తనాలుగా పిలిచే వీటిని విత్తితే గ్లైకోసెట్‌ గడ్డి మందును కూడా పిచికారీ చేయాలి. తద్వారా గడ్డి మొలవక పోవటం, చచ్చిపోవటం జరుగుతుంది. కానీ గడ్డి పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. గడ్డి చచ్చిపోయినా భూమిని పాడు చేస్తుందన్న కారణంతో ఆ విత్తనాలను వేయొద్దని చెప్పింది. గడ్డి మందులు వాడటం ద్వారా మనుషులు కేన్సర్‌  వంటి రోగాలకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది. అయినప్పటికీ రైతులకు వాటినే అంటగట్టే ప్రయత్నం ఎక్కువగా సాగుతోంది.


కొమరాడ, కురుపాం, జియ్యమ్మవలస, మక్కువ, సాలూరు, పాచిపెంట, రామభద్రపురం, మెంటాడ, పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో విస్తారంగా ఈ పత్తి విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయి. అలాగే సర్టిఫై కాని విత్తనాలు కూడా తక్కువ ధరలకు వస్తున్న కారణంగా గ్రామాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇబ్బంది కరమైనప్పటికీ రైతులు తక్కువ ధర పేరుతో వ్యాపారులు విసురుతున్న ఉచ్చులో పడుతున్నారు. గ్రామాల్లో 75 గ్రాముల విత్తనాల ప్యాకెట్‌ రూ.950కి లభ్యమవుతోంది. విజయనగరం డివిజన్‌లోని మండలాల్లో అక్కడక్కడా ఈ విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. పార్వతీపురం డివిజన్‌ పరిధిలో మాత్రం విస్తారంగా గడ్డి విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయి. ఇదే విషయాన్ని వ్యవసాయ శాఖ జేడీ ఆశాదేవి వద్ద ప్రస్తావించగా పరిశీలిస్తున్నామన్నారు. గుర్తింపులేని విత్తనాల విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 

Updated Date - 2020-06-05T10:05:55+05:30 IST