నకిలీ కంపెనీ పేరుతో రూ.50 కోట్ల మోసం

ABN , First Publish Date - 2022-06-17T15:14:16+05:30 IST

నకిలీ కంటైనర్ల కంపెనీ పేరుతో రూ.50 కోట్ల మేరకు మోసం చేసిన ఏడుగురితో కూడిన ముఠాను చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం

నకిలీ కంపెనీ పేరుతో రూ.50 కోట్ల మోసం

                            - ఏడుగురు ముఠా సభ్యుల అరెస్టు 


అడయార్‌(చెన్నై), జూన్‌ 16: నకిలీ కంటైనర్ల కంపెనీ పేరుతో రూ.50 కోట్ల మేరకు మోసం చేసిన ఏడుగురితో కూడిన ముఠాను చెన్నై సెంట్రల్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వివిధ రకాల ఉత్పత్తులు, వస్తు సామగ్రిని విదేశాలకు ఎగుమతి చేసే కంపెనీ యజమానులను సంప్రదించి, తమ కంపెనీలకు చెందిన కంటైనర్ల ద్వారా సామగ్రిని అతి తక్కువ ధరకు ఎగుమతి చేసుకోవచ్చని నమ్మించి, పలు కంపెనీల నుంచి కోట్లాది రూపాయల మేరకు మోసం చేసినట్టు నగర పోలీస్‌ కమిషనర్‌ శంకర్‌ జీవాల్‌కు ఒక ఫిర్యాదు వచ్చింది. దీనిపై లోతుగా విచారణ జరిపేలా సీసీబీ పోలీసులను ఆదేశించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన సీసీబీ... ముందుగా ఈ తరహా మోసాలకు పాల్పడిన వారి ఫోన్‌ నంబర్లను సేకరించి, ఆ ఫోన్‌ నంబర్ల ఆధారంగా వారి చేతిలో మోసపోయిన కంపెనీ యాజమానులను గుర్తించింది. మోసపోసిన బాధితులు ఇచ్చిన సమాచారంతో నకిలీ కంటైనర్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టరుగా పొన్‌రాజ్‌ కీలకంగా వ్యవహరించినట్టు గ్రహించారు. దీంతో అతడిని అరెస్టు చేశారు. అతడిచ్చిన సమాచారం మేరకు డేవిడ్‌, గోకుల్‌రాజ్‌ అనే మరో ఇద్దరిని అరెస్టు చేశారు. వీరివద్ద జరిపిన విచారణలో అనేక కంపెనీల యజమానులను మోసం చేసి రూ.50 కోట్ల మేరకు వసూలు చేసినట్టు అంగీరించడమే కాకుండా సామువేల్‌ (45), డేనియల్‌, వినోద్‌ కుమార్‌తో సహా మరో వ్యక్తికి సంబంధం ఉన్నట్టు చెప్పారు. దీంతో వీరిని కూడా అరెస్టు చేశారు. వీరంతా తూత్తుకుడికి చెందిన వారిగా గుర్తించారు. వీరందిరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. 

Updated Date - 2022-06-17T15:14:16+05:30 IST