ఎక్సైజ్‌ శాఖకే పంగనామాలు పెట్టాలనుకున్న ప్రబుద్ధులు.. చివరికి సీన్ రివర్స్

ABN , First Publish Date - 2022-05-31T11:52:55+05:30 IST

అతి తెలివి ఉపయోగించి ఎక్సైజ్‌ శాఖకు (Excise Department) పంగనామాలు పెట్టాలని చూశారు ఇద్దరు ప్రబుద్ధులు.

ఎక్సైజ్‌ శాఖకే పంగనామాలు పెట్టాలనుకున్న ప్రబుద్ధులు.. చివరికి సీన్ రివర్స్

  • ఏకంగా రూ. 36 లక్షలకు ఎసరు
  • రెండు వైన్‌ షాపులు సీజ్‌

హైదరాబాద్ సిటీ/బాలానగర్‌ : అతి తెలివి ఉపయోగించి ఎక్సైజ్‌ శాఖకు (Excise Department) పంగనామాలు పెట్టాలని చూశారు ఇద్దరు ప్రబుద్ధులు. నకిలీ చలాన్లు (Fake Challan) రూపొందించి  అధికారులకు అందజేశారు. ఖజానాలో డబ్బులు జమకాక పోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు చలాన్లను తనిఖీ చేయగా నకిలీ బాగోతం వెలుగులోకి వచ్చింది. బాలానగర్‌ ఎక్సైజ్‌ సీఐ వేణుగోపాల్‌ కథనం ప్రకారం.. మార్చి నెల లైసెన్స్‌ ఫీజు నిమిత్తం రూ. 18 లక్షల చలానాను బాలానగర్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి బేగంపేట శ్రీ సాయిగుణవైన్స్‌, ఎస్‌జీ వైన్‌షాప్‌ లైసెన్స్‌ హోల్డర్లు అందజేశారు. 


చలానాలను అధికారులు ట్రెజరీకి పంపగా, ఖజానాలో జమ కాలేదని తేలింది. మే నెలకు చెందిన లైసెన్స్‌ ఫీజు రూ. 18 లక్షలకు చెందిన చలానాలను కూడా లైసెన్స్‌ హోల్డర్లు అధికారులకు అందజేశారు. ఈ రెండు నెలలకు సంబంధించి చలాన్లు పరిశీలించగా నకిలీగా తేలాయి. దీంతో బాలానగర్‌  ఎక్సైజ్‌ అధికారులు విషయాన్ని ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌భాస్కర్‌కు తెలిపి, ఆయన ఆదేశాల మేరకు రెండు షాపులను సీజ్‌ చేశారు. 


ఈ విషయమై.. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘నకిలీ చలాన్లను గుర్తించి రెండు షాపులను తాత్కాలికంగా సీజ్‌ చేశాం. షాపు లైసెన్స్‌ హోల్డర్లు సంతోష్‌రెడ్డి, నాగమునిరెడ్డి నుంచి చలాన్ల నగదు, జరిమానా కూ డా కట్టించాం. గతంలో కూడా ఇలాంటి చెల్లింపులు జరిగాయా అనేది అధికారులు పరిశీలించాల్సి ఉంది. షాపుల లైసెన్స్‌లపై కమీషనర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.’’ అన్నారు.

Updated Date - 2022-05-31T11:52:55+05:30 IST