‘ఫేక్ బాబా’ కథ త్వరలోనే ముగుస్తుంది: అఖిలేశ్ యాదవ్

ABN , First Publish Date - 2021-10-15T01:04:05+05:30 IST

లఖింపూర్ ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.

‘ఫేక్ బాబా’ కథ త్వరలోనే ముగుస్తుంది: అఖిలేశ్ యాదవ్

న్యూఢిల్లీ: లఖింపూర్ ఖేరి ఘటనపై నిప్పులు చెరిగిన మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. బీజేపీ ప్రభుత్వాన్ని రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు. త్వరలోనే ప్రభుత్వం మారుతుందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు తమ వాహనాల కింద రైతులను నలిపివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, పేడదొంగ ప్రభుత్వం, ఎరువుల ధరల పెంపు వెనక ప్రభుత్వం ఉంది’’ అని ఆరోపించారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న అఖిలేశ్ తాజాగా నిర్వహించిన రథయాత్రలో ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ‘నకిలీ బాబా’ కథ ముగుస్తుందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి అన్నారు. 


ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన అఖిలేశ్.. ఈ ప్రభుత్వం ప్రజలను దారుణంగా మోసం చేస్తోందని, ఈ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, అవినీతి, నేరాలు దారుణంగా పెరిగిపోయాయనని అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు.


వచ్చే ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, జాతీయ పార్టీలతో పొత్తుపెట్టుకోబోమని అఖిలేశ్ స్పష్టం చేశారు. 2022లో జరిగే ఎన్నికల్లో 400 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి బీజేపీని తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు.  

Updated Date - 2021-10-15T01:04:05+05:30 IST