నకిలీ బాబా అరెస్టు

ABN , First Publish Date - 2020-10-17T10:29:13+05:30 IST

క్షుద్ర పూజల పేరుతో అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడుతున్న..

నకిలీ బాబా అరెస్టు

దోపిడీ కేసులో ప్రధాన నిందితుడు 


కడప (క్రైం), అక్టోబరు 16 : క్షుద్ర పూజల పేరుతో అమాయకులను నమ్మించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడంతో పాటు దోపిడీలకు పాల్పడుతున్న నకిలీ బాబాను రాజంపేట పోలీసులు కర్నూలు-హైదరాబాదు హైవేలోని బళ్లారి చౌరస్తా అరెస్టు చేశారు జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలోని పెరేడ్‌ మైదానంలో ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌, రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, రాజంపేట రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డిలతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలు వెల్లడించారు.


అనంతపురం టౌన్‌కు చెందిన షేక్‌ మహబూబ్‌బాషా అలియాస్‌ బాబా పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఇతడి సొంత ఊరు గుత్తిలోని కోటవీధి. పుట్టపర్తి మండలం ఎనంపల్లెకు చెందిన మురళితో కలిసి మహిమలు, క్షుద్రపూజలు చేస్తానంటూ ప్రచారం చేసుకుంటూ అమాయక ప్రజలను టార్గెట్‌ చేసుకుని ఒక్కొక్కరి వద్ద 10 వేల నుంచి 20 వేల వరకూ డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతూ వచ్చారు. వీరిరువురూ ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు.


రెండు నెలల క్రితం మురళి చనిపోవడంతో బాబా పర్యవేక్షణలో గ్యాంగ్‌ దోపిడీలకు పాల్పడేవారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని ఓ లిక్కర్‌ వ్యాపారి ఇంట్లో రూ.150 కోట్లు బ్లాక్‌మనీ ఉందని బాబా ఇచ్చిన సమాచారం మేరకు కొంతమంది యువకులు పిస్తోలుతో దోపిడీ చేసేందుకు వెళ్లారు. అక్కడ వాచ్‌మెన్‌ను బెదిరించి అతడి కాళ్లు, చేతులు కట్టివేసి ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ ఏమీ లేకపోవడంతో అక్కడి నుంచి పారిపోయినట్లు తెలిపారు. బళ్లారితో పాటు అనంతపురం, తిరుపతి పట్టణాల్లో వీరు దోపిడీలకు పాల్పడ్డారు. రాజంపేటలోని పెద్దకారంపల్లె గ్రామంలో ఓ దోపిడీకి ప్రయత్నిస్తుండగా గత నెల 27న రాజంపేట పోలీసులు 21 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన బాబాపై నిఘా ఉంచామని పదిరోజుల క్రితం కర్నూలులోని బాలవెంకటరెడ్డి, అరుణమ్మల వద్ద రూ.2.90 లక్షలు తీసుకుని క్షుద్రపూజల పేరుతో వసూలు చేసినట్లు తెలిపారు. 


వెంకటేశ్‌, సానే సతీ్‌ష అనే వ్యక్తులు బాబా గురించి గొప్పగా చెబుతూ వారి సమస్యలు ఏవైనా ఉంటే ఆయన దృష్టికి వెళితే పరిష్కరిస్తారంటూ ప్రచారాలు చేసి అమాయకులను నమ్మించి సొమ్ము చేసుకునేవారన్నారు. ఈ మేరకు కర్నూలు నుంచి అనంతపురం వెళుతున్నట్లు సమాచారం రావడంతో ప్రధాన నిందితుడితో పాటు అనంతపురం టౌన్‌కు చెందిన సున్నపురాళ్ల వెంకటేశ్‌ అలియాస్‌ వెంకటేశ్‌, సానే సతీ్‌షలను అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో మరో ఏడుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామన్నారు.


ప్రజలు అప్రమత్తంగా ఉండాలి - ఎస్పీ

కొంతమంది నకిలీ బాబాలు, స్వామీజీలు పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేసి అందినకాడికి దోచుకుంటున్నారని, అలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తెలిపారు. సోషల్‌ మీడియాలో కూడా ఇటీవల ఇలాంటి ప్రచారాలు ఎక్కువవుతున్నాయని, ఎవరు కూడా వాటిపై స్పందించి మీ బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత వివరాలు తెలిపి మోసపోవద్దని సూచించారు. 

Updated Date - 2020-10-17T10:29:13+05:30 IST