నకిలీ ఆనందయ్య మందు గుట్టురట్టు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ABN , First Publish Date - 2021-07-25T20:55:42+05:30 IST

పోలీసుల సహకారంతో నకిలీ ఆనందయ్య మందు రాకెట్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గుట్టు రట్టు చేసింది.

నకిలీ ఆనందయ్య మందు గుట్టురట్టు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ఒంగోలు: పోలీసుల సహకారంతో నకిలీ ఆనందయ్య మందు రాకెట్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గుట్టు రట్టు చేసింది. నెల్లూరు జిల్లా, కృష్ణ పట్టణానికి చెందిన ఆర్. సురేష్ కృష్ణ కొన్ని రోజులు ఆనందయ్య వద్ద పనిచేశాడు. ఈ క్రమంలో ఆనందయ్యతో స్వయంగా మందును తయారు చేయించానని చెబుతూ భారీగా మందును విక్రయిస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి ఆనంద్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి సమాచారం ఇచ్చారు. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఫోకస్ హ్యూమన్ రైట్స్ సంస్థ ఆనందయ్య మందును ఉచితంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.


తమవారికి ఆనందయ్య మందు అవసరముందని ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి ఆనంద్ చెప్పగా మందు తెచ్చి ఇస్తానంటూ సురేష్ కృష్ణ నమ్మబలికాడు. హైదరాబాద్‌కు తాను రాలేనని ఒంగోలుకు వస్తానని, మందు తీసుకుని డబ్బు ఇవ్వాలని చెప్పాడు. సురేష్ సొంతంగా తయారు చేసిన 12 కేజీల మందును కృష్ణపట్నం నుంచి ఒంగోలుకు తెచ్చాడు. రంగంలోకి దిగిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సురేష్ తెచ్చింది ఆనందయ్య మందుకాదని ధృవీకరించింది.


హైదరాబాద్ నుంచి ఒంగోలు చేరుకున్న ఆనంద్.. ఎక్కడికి రావాలంటూ సురేష్‌కు ఫోన్ చేశారు. పీవీఆర్ హైస్కూల్ సమీపంలో ఉన్నానని వచ్చి డబ్బులిచ్చి మందు తీసుకువెళ్లాలని చెప్పాడు. అక్కడికి చేరుకున్న ఆనంద్ మందును పరిశీలించి ఇది మందు కాదని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సురేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఆనందయ్య మందు పేరిట వస్తున్న నకిలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Updated Date - 2021-07-25T20:55:42+05:30 IST