నమ్మకం సడలుతోంది!

ABN , First Publish Date - 2020-10-27T05:39:22+05:30 IST

ఏక వ్యక్తి వికాసంతో రాజ్యాధికారం కైవసం చేసుకోవటం ఎల్లపుడు సాధ్యం కాదని చరిత్ర చెప్పిన కఠోర సత్యం...

నమ్మకం సడలుతోంది!

ఏక వ్యక్తి వికాసంతో రాజ్యాధికారం కైవసం చేసుకోవటం ఎల్లపుడు సాధ్యం కాదని చరిత్ర చెప్పిన కఠోర సత్యం. మాటల మాయాజాలం, విన్నవాళ్ళని, విననివాళ్ళని నయాన్నో, భయా న్నో నిరంతరం గుప్పిట్లో ఉంచుకోవాలనుకోవటం ప్రజాస్వామ్య వ్యవస్థల్లో ప్రతిసారి సాధ్యపడకపోవచ్చు. దీనికి తార్కాణం ఇటీవలి పరిణామాలే. ఒక నేతపై ఉంచుకున్న అపార (అతి) నమ్మకం సన్నగిల్లడం తిరోగమనానికి నాంది. గతంలో చూపించిన ఆదరణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో కనిపించకపోవడం విశేషం. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ప్రతి సందేశాన్ని–అవి చప్పట్లు కొట్టటం కానీ, జ్యోతులు వెలిగించటం కాని, క్రింది స్థాయి జనాల దగ్గర్నుంచి ముఖ్యమంత్రుల దాకా మూకుమ్మడిగా, ఎందుకు చేస్తున్నామో చాలామందికి తెలీకపోయినా  వేడుక టైం ప్రకారం జరపడం బహుశా ప్రపంచంలోనే ఒక అరుదు. ఇది కేవలం ఒకే వ్యక్తి పై పెంచుకున్న ప్రగాఢ విశ్వాసం. కానీ, వలస కార్మికుల పట్ల అలసత్వం, కరోనా నియంత్రణలో స్పష్టత లేని ప్రకటనలు, లాక్‌డౌన్‌ కాలంలో నిర్దిష్ట ప్రణాళిక లోపించడం, రాష్ట్రాలతో సమన్వయం సవ్యంగా లేకపోవడం వల్ల లక్షల కుటుంబాలు నిరాశ్రయులైనాయి, అర్థికంగా కోలుకోలేని దుస్థితికి చేరాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి ఉన్నా, పేద దేశమైన ఈ గడ్డను ధనిక దేశాలతో పోల్చటం పెద్ద తప్పిదమే. ఇక్కడి జీవనశైలి, నిరక్షరాస్యత, బ్రతికే విధానం, ఉన్న వనరులు అంచనా వేయడం, వాటిని అందించటంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈ దేశ ఆర్థిక పరిస్థితి అథపాతాళాన్ని తాకు తున్నా మసిపూసి మారేడుకేయ చేసిన చందాన, ఒకటి,  రెండు  స్కీములు ప్రకటించారు. ఏ రంగానికీ కూడా ఊరట దొరికిన దాఖలాలు లేవు. పైపెచ్చు  బీజేపీ నేతల ఊకదంపుడు మాటలు ప్రజల్లో ఏవగింపుకు దారి తీస్తున్నాయి.


కేంద్రంలో అత్యధిక సంఖ్యా బలం సాధించినా, రాష్ట్రాల విషయంలో తెరచాటు రాజకీయాలనే ఎంచుకోవడం ప్రజలు గమనిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో జరిగిన ప్రక్రియలు ప్రజలు చూ శారు. ఇవిగాక కొన్ని లొసుగుల ఆధారంగా మరి కొన్ని రాష్ట్రలపై పట్టు సాధించాలన్న తృష్ణ బాగా కనిపిస్తోంది. కారణం బీజేపీ పార్టీ పాలన మునుపటి మల్లె గాక, ఆదరణ అన్ని వర్గాల్లో రోజురోజుకి సన్నగిల్లుతుండడం. ప్రధాన మంత్రి ఏదయినా పిలుపు ఇస్తే దానిపట్ల ప్రజల్లో నిర్లిప్తత కనిపిస్తున్నది. బీహార్ రాష్ట్ర ఎన్నికల సభలు బీజేపీ వర్తమాన స్థితికి అద్దంపడుతున్నాయి. మన్‌కీ బాత్‌ రేటింగ్ సైతం తగ్గుతున్నదట. ఇవి ఒకెత్తయితే హిందు మనోభావాల ముసుగులో రాజకీయాలు ఎలా చేయాలా అన్న అవకాశ వాద దృక్పథం మరోపక్క.  జనరంజకమయిన పాలన అందిస్తామన్న 2014 ముందు మాటని నిలబెట్టుకొంటే తప్ప ఆ పార్టీ ఇకపై మనుగడ సాధించటం కష్టమేమో.

ఓ. వి. రమణ

Updated Date - 2020-10-27T05:39:22+05:30 IST