తొలిరోజే తుస్సు!

ABN , First Publish Date - 2022-08-17T05:50:53+05:30 IST

‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు’ అన్న చందంగా తయారైంది ప్రభుత్వ విద్యావిధానం తీరు. విచిత్ర నిర్ణయాలతో అంతా గందరగోళం నెలకొంది.

తొలిరోజే తుస్సు!
మాచవరం స్కూల్‌లో మొబైల్‌తో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు

ముఖ హాజరుపై  టీచర్ల భగ్గు

కొత్త యాప్‌తో గందరగోళం

ఆరంభంలోనే మొరాయించిన సర్వర్‌

కేవలం 84మంది మాత్రమే నమోదు

కక్షసాధింపు చర్యలేనంటున్న  ఉపాధ్యాయులు 

‘కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడినట్లు’ అన్న చందంగా తయారైంది ప్రభుత్వ విద్యావిధానం తీరు. విచిత్ర నిర్ణయాలతో అంతా గందరగోళం నెలకొంది. ఎప్పుడు ఏ ఉత్తర్వు వస్తుందో.. తెలియక విద్యాశాఖ అధికారులు అయోమయంలో ఉన్నారు. పాఠశాలలు, టీచర్ల విష యంలో ప్రభుత్వ వైఖరి వింతగా ఉందని ఉపాధ్యాయులు, సంఘాల నేతలు మండిపడుతున్నారు. కొత్త విధానంతో పాఠశాలల పనితీరు మరింత దిగజారుతుందే తప్ప ఏమాత్రం మెరుగుపడదని విశ్లేషిస్తున్నారు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన కొత్త హాజరు విధానం తొలిరోజే తుస్సుమంది. సాంకేతిక సమస్యలతో జిల్లాలో ఒక్కశాతం మంది కూడా యాప్‌లో హాజరు నమోదు చేయలేక పోయారంటేనే ఈవిధానం ఎంత లోపభూయిష్టంగా ఉందో తేటతెల్లమవుతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. 

ఒంగోలు(విద్య), ఏప్రిల్‌ 16: పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదుకు మంగళవారం నుంచి ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన నూతన విధానంపై ఉపాధ్యాయ లోకం భగ్గుమంటోంది. తమపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఫేషియల్‌ రికగ్నేషన్‌(ముఖ నమోదు) విధానాన్ని అమల్లోకి తెచ్చిందని టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో సైతం అనేకచోట్ల నెట్‌వర్క్‌ సమస్య ఉండగా యాప్‌లో హాజరు నమోదు ఎలా అని  ప్రశ్నిస్తున్నారు. తొమ్మిది గంటలకు ఒక్క నిమిషం లేటైనా యాప్‌లో హాజరు నమోదు కాదు. ఆ లోపే పాఠశాలకు చేరుకునేందుకు ఉపాధ్యాయులు బయల్దేరినా అనివార్య కారణాలతో ఆలస్యమైతే ఆ రోజు పాఠశాలను చూసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. 


టీచర్ల హాజరులో కొత్త విధానం

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉపాధ్యాయుల హాజరు నమోదు విధానం మొదటిరోజే అపహాస్యమైంది. ఇప్పటి వరకు బయోమెట్రిక్‌, ఐరిష్‌ విధానం ద్వారా ఉపాధ్యాయులు పాఠశాలలో హాజరు నమోదు చేయగా ప్రస్తుతం ప్రభుత్వం కొత్తగా ముఖహాజరు విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ  పద్ధతిలో ఉపాధ్యాయులు తమ మొబైల్‌ ఫోన్‌లో హాజరు నమోదు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని ఉదయం 9గంటలలోపు పాఠశాలలకు వెళ్లి విధిగా హాజరు నమోదుచేయాలి. నిముషం లేటైనా హాజరు యాప్‌ నమోదుకు అంగీకరించదు. దీంతో అనివార్యంగా ఉపాధ్యాయులు ఆరోజు సెలవు పెట్టుకోవాల్సిందే. ఇదిలాఉండగా ఒకరిద్దరు పనిచేసే చోట ఒక టీచర్‌ ముందుగానే సెలవులో ఉండి రెండో టీచర్‌ 9గంటలలోపు హాజరు నమోదు చేయకపోతే అనివార్యంగా ఇద్దరూ ఆ రోజు సెలవు పెట్టుకున్నట్టే. అలా జరిగితే పాఠశాలలో విద్యార్థుల ఆలనాపాలనా, వారి మధాహ్నం భోజనం చూసేది ఎవరని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 


ఒక్కశాతం లోపు నమోదు

జిల్లాలో మంగళవారం యాప్‌ ద్వారా హాజరు నమోదు కార్యక్రమం అభాసుపాలైంది జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మొత్తం 9,184 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా హాజరు నమోదుకు సంబంధించి కొత్తగా ప్రవేశపెట్టిన యాప్‌లో మంగళవారం నాటికి కేవలం 1,052మంది మాత్రమే రిజిస్టర్‌ అయ్యారు. వారిలో మంగళవారం పాఠశాలలకు హాజరైన ఉపాధ్యాయుల్లో కేవలం 84మంది మాత్రమే హాజరు యాప్‌లో నమోదు కాగలిగారు. జిల్లావ్యాప్తంగా 22 పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో హాజరు నమోదుకు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ రావడం లేదని డీఈవో కార్యాలయానికి సమాచారం ఇచ్చారు.


సాంకేతిక సమస్యలు ఎన్నో...

ఆన్‌లైన్‌ హాజరు నమోదులో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రఽధానంగా పశ్చిమ ప్రాంతంలోని దోర్నాల, పుల్లలచెరువు, వైపాలెం, అర్ధవీడు, పీసీపల్లి తదితర మండలాల్లోని మారుమూల గ్రామాల్లో నెట్‌వర్క్‌ సమస్య తీవ్రంగా ఉంది. అందువల్ల మామూలు ఫోన్‌కే సిగ్నల్‌ ఉండదు. ఇక నెట్‌వర్క్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటే గగనమే. పాఠశాలల విలీనం కారణంగా కొంతమంది ఉపాధ్యాయులు అనధికారికంగా ఎటువంటి ఉత్తర్వులు లేకుండా హైస్కూళ్లలో పనిచేస్తున్నారు. వారు ఇప్పటికీ ప్రాథమిక పాఠశాలల్లోనే జీతాలు తీసుకుంటున్నారు. వీరికి ట్రెజరీ ఐడీ ప్రాథమిక పాఠశాలలకే అనుసంధానం అయినందున హైస్కూలులో హాజరువేసేందుకు అవకాశం లేదు. దీంతో అనివార్యంగా వారు ముందుగా తాము జీతాలు తీసుకుంటున్న ప్రాథమిక పాఠశాలలకు వెళ్లి  హాజరు నమోదు చేసి అక్కడి నుంచి హైస్కూల్‌కు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. ఈవిధంగా ఆచరణలో సాధ్యం కాని అనేక సమస్యలతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. 


హాజరు నమోదు ఇదీ.. 

దోర్నాల మండలం మొత్తం మీద ఒకరిద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేశారు. ఈ మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్‌ ఉండటం లేదు. కొన్ని పాఠశాలల్లో సర్వర్లు కూడా పనిచేయలేదు. దీంతో ఒకరిద్దరు మాత్రమే హాజరు నమోదు చేయగలిగారు.

ఒంగోలు మండలం కరవది జడ్పీ హైస్కూలులో 15మంది ఉపాధ్యాయులు ఉండగా కేవలం ఒకరికి మాత్రమే ఆన్‌లైన్‌లో హాజరు నమోదైంది.

అర్ధవీడు మండలంలోని 11 పాఠశాలల్లో ఒక్కరు కూడా ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేయలేకపోయారు. 

వైపాలెం ప్రభుత్వ హైస్కూల్‌లో 21మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా ఆరుగురు మాత్రమే ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేశారు. 

పొదిలి తదితర మండలాల్లో కూడా నెట్‌వర్క్‌ సమస్యతో ఉపాధ్యాయులు యాప్‌లో హాజరు నమోదు చేయలేకపోయారు. 


Updated Date - 2022-08-17T05:50:53+05:30 IST