Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యోగుల పట్ల నిర్లక్ష్య వైఖరి విడనాడాలి

ఫ్యాప్టో దీక్షలో ఎన్‌జీవో నేతలు, ఎమ్మెల్సీలు 

విజయవాడ సిటీ, డిసెంబరు 3 : ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఈ వైఖరిని విడనాడాలని పలువురు వక్తలు హితవు పలికారు. పీఆర్సీ, డీఏ, సీపీఎస్‌ రద్దు వంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో స్థానిక ధర్నాచౌక్‌ వద్ద నిరసన దీక్ష శుక్రవారం జరిగింది. ఈ దీక్షను ఏపీ జేఏసీ చైర్మన్‌ బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాప్టోకు జేఏసీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి గర్హనీయమన్నారు. ఉద్యోగుల ఉద్యమాలకు ఏ ప్రభుత్వాలైన దిగిరాక తప్పదన్నారు. సీఎం జగన్‌ తన పాదయాత్రలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. దీక్షకు అధ్యక్షత వహించిన ఫ్యాప్టో చైర్మన్‌ సిహెచ్‌.జోసఫ్‌ సుధీర్‌బాబు మాట్లాడుతూ పీఆర్సీ అమలు ఇప్పటికే 41 నెలలు ఆలస్యమైందని ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. సీపీఎస్‌ రద్దు హామీ, ఏడు విడతల డీఏ బకాయిలు చెల్లింపులో ప్రభుత్వం నిర్లప్త వైఖరిని ఖండించారు. పీడీఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ శాసన మండలిలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు సరైన అవకాశం లభించలేదన్నారు. వచ్చిన తక్కువ అవకాశంలో ఆర్థిక మంత్రి ఇచ్చిన సమాధానాలు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కె.ఎ్‌స.లక్ష్మణరావు మాట్లాడుతూ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి సూచించారు. ఎమ్మెల్సీ వై.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఫెన్షనరీ బెనిఫిట్స్‌, ఉద్యోగులు దాచుకున్న డబ్బు సకాలంలో ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. విద్యాశాఖలో అర్థం పర్థం లేని సంస్కరణలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని మరో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి విమర్శించారు. ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ మాట్లాడుతూ సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ విధానాలను రద్దు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐ.వెంకటేశ్వరరావు, పి.రఘువర్మ, ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ సి.హెచ్‌.శరత్‌చంద్ర, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement