ఏంటి ఈ డిజిటల్ కరెన్సీ.. దీనితో లాభమేంటి..? బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో సర్వత్రా చర్చ..!

ABN , First Publish Date - 2022-02-01T18:11:46+05:30 IST

ఈ ఏడాది డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామ్‌న్ ప్రకటించారు.

ఏంటి ఈ డిజిటల్ కరెన్సీ.. దీనితో లాభమేంటి..? బడ్జెట్లో ఆర్థిక మంత్రి ప్రకటనతో సర్వత్రా చర్చ..!

ఈ ఏడాది డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురానున్నట్టు కేంద్రమంత్రి నిర్మలా సీతారామ్‌న్ ప్రకటించారు. డిజిటల్ కరెన్సీతో డిజిటల్ బ్యాంకింగ్ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీకి రూపకల్పన చేస్తున్నట్టు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా డిజిటల్ కరెన్సీ బూస్టర్‌లా పనిచేస్తుందని చెప్పారు. 


ఏంటీ డిజిటల్ కరెన్సీ

మనం తరచుగా వింటున్న క్రిఫ్టో కరెన్సీ లాంటిదే ఈ డిజిటల్ కరెన్సీ కూడా. ఇది కూడా కంప్యూటర్‌లో ఓ నిక్షిప్త సందేశమే. అయితే క్రిఫ్టో కరెన్సీ లాగ ఇది అనామక కరెన్సీ కాదు. డిజిటల్ కరెన్సీని దేశాల ఆర్థిక వ్యవస్థలకు మూలమైన సెంట్రల్ బ్యాంక్‌లు జారీ చేస్తాయి. మన దేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిని జారీ చేస్తుంది. మార్కెట్‌లో బహిరంగ వేలం పాట ద్వారా డిజిటల్ కరెన్సీ విలువను నిర్ణయిస్తారు. డిమాండ్ అండ్ సప్లయ్ సూత్రం ఆధారంగానే దీని విలువలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ కరెన్సీ యజమానులను ఆర్బీఐ గుర్తిస్తుంది. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్‌బ్యాంక్‌ చేతిలోనే ఉంటుంది. రిజర్వ్‌బ్యాంక్ గానీ, లేదా ఇతర దేశాలకు సెంట్రల్‌ బ్యాంక్‌లు గానీ అనుసరించే అసంబద్ధ, అవివేక విధానాలను నియంత్రించగల సామర్థ్యం డిజిటల్ కరెన్సీకి లేదు. 


లాభాలేంటి

క్రిఫ్టో కరెన్సీ తరహాలో ఆర్థికవ్యవస్థను అస్థిరత్వం పాలు చేయగల సత్తా ఈ డిజిటల్ కరెన్సీకి లేదు. పేపర్ కరెన్సీ తరహాలోనే ఇది కూడా పూర్తిగా ఆర్బీఐ ఆజమాయిషీలోనే ఉంటుంది. క్రిప్టో కరెన్సీలాగా నేర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడదు. పేపర్ కరెన్సీలతో పోలిస్తే వీటితో జరిపే లావాదేవీల వ్యయం తక్కువ. నామమాత్రపు ఖర్చుతో భద్రంగా నిల్వ చేసుకోగలగడం డిజిటల్ కరెన్సీ వల్ల కలిగే మరో ప్రయోజనం. ఎంత పరిమాణంలో డిజిటల్ కరెన్సీని జారీ చేయాలో నిర్ణయించే అధికారం పూర్తిగా రిజర్వ్‌బ్యాంక్‌ చేతిలోనే ఉంటుంది కాబట్టి.. ఈ కరెన్సీ వల్ల ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురి కాదు. 


Updated Date - 2022-02-01T18:11:46+05:30 IST