అగ్ని ప్రమాదాల అడ్డ.. జీడిమెట్ల

ABN , First Publish Date - 2021-04-19T06:35:51+05:30 IST

జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కెమికల్‌ గోదాంలు భారీ ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి.

అగ్ని ప్రమాదాల అడ్డ.. జీడిమెట్ల

 నిర్వాహకుల నిర్లక్ష్యంతో రోడ్డున పడుతున్న కుటుంబాలు  ఫ చూసీచూడనట్లు వ్యవహరిస్తోన్న అధికారులు 

జీడిమెట్ల, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలో అక్రమంగా వెలిసిన కెమికల్‌ గోదాంలు భారీ ప్రమాదాలకు నిలయాలుగా మారుతున్నాయి. నగర శివార్లలోని రసాయన పరిశ్రమలు తమ ఉత్పత్తుల ద్వారా వెలువడే వ్యర్థ రసాయనాలను ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌లకు తరలించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పనికావడంతో  కొందరు మధ్యవర్తుల ద్వారా జీడిమెట్ల, ఎస్‌వీ కోపరేటివ్‌సొసైటీ, రాంరెడ్డినగర్‌, గంపలబస్తీ, సుభా్‌షనగర్‌, దూలపల్లి రోడ్డు ప్రాంతాలలో భారీ ఎత్తున అక్రమ గోదాంలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఆ గోదాముల్లో కెమికల్స్‌ మిక్సింగ్‌లో ఎలాంటి అనుభవం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులతో పని చేయిస్తుండటంతో వీరు చేస్తున్న చిన్న తప్పిదాలకు ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు. 

క్షణ క్షణం.. భయం భయం..

నివాస ప్రాంతాల్లో అక్రమ కెమికల్‌ గోదాంలు ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలు క్షణ క్షణం భయం, భయంతో బతకాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మేడ్చల్‌ కలెక్టర్‌గా ఉన్న ఎం.వి.రెడ్డి స్వయంగా జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతంలో పర్యటించి అక్రమ కెమికల్‌ గోదాంలను వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆఘమేఘాల మీద కొన్ని గోదాంలు మూసివేసిన అధికారులు తర్వాత మరిచిపోయారు. గోదాంల యాజమాన్యాలు ఇచ్చే నెల వారీ మామూళ్లతో సరిపుచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. శనివారం జరిగిన భారీ ప్రమాదానికి కారమణమైన యాజమాన్యంతో పోలీసులు ఇప్పటికే లాలూచీ పడినట్టు తెలుస్తోంది. అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన గోదాంలను మూసేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

గతంలో చోటు చేసుకున్న సంఘటనలు.. 

  కొన్ని సంవత్సరాల క్రితం సుభాష్‌నగర్‌ గంపలబస్తీ ప్రాంతంలో ఉన్న స్యూటిక్‌ పరిశ్రమలో భారీ విస్పోటనం సంభవించి ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు. 

  ఎస్‌వీ కో-ఆపరేటివ్‌సొసైటీలోని సాయిబాబా ఆలయం సమీపంలోని ఓ కెమికల్‌ కంపెనీలో సంభవించిన భారీ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు కిలోమీటర్‌ మేర ఇంటి అద్దాలు పగిలిపోయాయి. 

  ఇటీవల గంపలబస్తీలోని కాంటా సమీపంలో ఓ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించి పెద్దఎత్తున ఆస్తి నష్టం జరిగింది. 

  దూలపల్లిరోడ్డు, ఎస్‌వీ కో- ఆపరేటివ్‌ సొసైటీ, జీడిమెట్ల పారిశ్రామికవాడలలో సంభవించిన ప్రమాదాలను ప్రజలు మరిచిపోవడం లేదు.

  గత సంవత్సరం సువెన్‌ ల్యాబ్‌లో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంతో ఎస్‌ఆర్‌నాయక్‌నగర్‌ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 

 జిల్లా కలెక్టర్‌ స్థాయి అధికారికి మాత్రమే కెమికల్‌ గోదాంలపై చర్యలు తీసుకునే హక్కు ఉందని, తమకు ఏ మాత్రం బాధ్యతలేదని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది చేతులు ఎత్తేస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిశ్రమల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.  ఇదేవిధంగా కొనసాగితే జీడిమెట్ల పారిశ్రామికవాడ ప్రాంతం మరో భోపాల్‌గా మారే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పరిశ్రమలపై నిఘా..

జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఉన్న బల్క్‌డ్రగ్‌, ఫార్మా, పార్ములేషన్‌ పరిశ్రమలపై గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పరిశ్రమలలో తనిఖీలు చేస్తున్నాం. గతంలో కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలతో కొన్ని గోదాంలను మూసివేశాం. తిరిగి కొన్ని యథావిధిగా నడుస్తున్నాయి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం.

  ప్రవీణ్‌కుమార్‌, ఈఈ, కాలుష్యనియంత్రణ బోర్డు

 అధికారులు విఫలం..

జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రసాయన పరిశ్రమలు అడ్డదారుల్లో విచ్చలవిడిగా విషవాయువులను వదులుతున్నాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు.

         కె.రంగారావు, బీజేపీ కార్మిక నాయకుడు

Updated Date - 2021-04-19T06:35:51+05:30 IST