పంచాయతీల్లో వసతులు కరువు

ABN , First Publish Date - 2022-05-04T05:22:04+05:30 IST

ప్రజలకు సకల వసతులు కల్పిస్తాం..

పంచాయతీల్లో వసతులు కరువు

  • మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక ఇబ్బందుల్లో మహిళా ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు 
  • ప్రభుత్వం నిధులు మంజూరు చేసి నిర్మించాలని వేడుకోలు


యాచారం :  ప్రజలకు సకల వసతులు కల్పిస్తాం.. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం.. ఒకసారి అవకాశమివ్వండని జనాలతో ఓట్లు వేయించుకున్న సర్పంచులు.. కనీసం పంచాయతీ కార్యాలయంలో వసతులు  కల్పించడంలో విఫలమవుతున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలలో కనీసం మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో కార్యాలయానికి వచ్చే మహిళా ప్రజాప్రతినిధులు, ఇతర ఉద్యోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

యాచారం మండలంలోని 24 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో 14 పంచాయతీల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. మండల పరిధిలో అధికంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులుగా మహిళలే ఉన్నారు. పంచాయతీలలో సర్వసభ్య, పాలకవర్గ సమావేశాలు జరిగే సమయంలో మూత్రశాలలు, మరుగుదొడ్లు అందుబాటులో లేక మహిళలు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ నిధుల నుంచి మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో డీపీవోల ద్వారా ఉత్తర్వులుజారీ చేసింది. చిన్నతూండ్ల, ధర్మన్నగూడ, అయ్యవారిగూడ, తమ్మలోనిగూడ, తక్కళ్లపల్లితండా, కేస్లీతండా తదితర గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. పంచాయతీ కార్యదర్శి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యాలయంలో ఉండి పనులు చేస్తుంటారు. మరుగుదొడ్లు లేక అత్యవసర సమయాల్లో మహిళా పంచాయతీ కార్యదర్శులు సమీపంలోని ఇళ్లలోకి, పాఠశాలల్లోకి వెళ్లాల్సి వస్తుంది. నల్లవెల్లి, మొండిగౌరెల్లి, మంతన్‌గౌరెల్లి, కుర్మిద్ద, కొత్తపల్లి తదితర గ్రామపంచాయతీలలో మూత్రశాలలు, మరుగుదొడ్డి ఉన్నా సరైన నీటివసతి లేదు. నిధులు లేక లేకపోవడంతో నీటి వసతి కల్పించుకోలేక పోతున్నామని సర్పంచ్‌, వార్డుసభ్యులు చెబుతున్నారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు కలెక్టర్‌ ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 


పక్కా భవనాల మాటేమిటి?

యాచారం మండలంలోని కొన్ని పంచాయతీలకు అసలు పక్కా భవనాలే లేవు. తక్కళ్లపల్లి, కేస్లీతండా, అ య్యవారిగూడ, ధర్మన్నగూడ గ్రామపంచాయతీలకు పక్కా భవనాలు లేక బీసీ కమ్యూనిటీ భవనాలు, డ్వాక్రా భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వందశాతం పన్నులు వసూలు చేస్తే పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మించడం కోసం నిధులు ఇస్తామని రెండేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ప్రకటన చూసిన సర్పంచులు తమ సొంత పైసలు పన్నుల కోసం వెచ్చించారు. వందశాతం పన్నులు వసూలు చేసినా పంచాయతీలకు పక్కా భవనాల నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపడం లేదని ఆయా గ్రామాల సర్పంచులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కా భవనాల నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని జిల్లా అధికారులతోపాటు కలెక్టర్‌కు వినతి పత్రాలందించినా ఫలితం లేకుండా పోయిందని సర్పంచులు చెబుతున్నారు. భవన నిర్మాణం కోసం రూ.50లక్షల నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సర్పంచులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


మా గోస ఎవరికి చెబితే తీరుతుందో అర్థమైతలేదు

మాది ముందే కొత్త గ్రామపంచాయతీ కార్యాలయం. మేం డ్వాక్రా పొదుపు సంఘ భవనంలో పంచాయతీ కార్యాలయం కొనసాగిస్తున్నాం. అందులో మూత్రశాల, మరుగుదొడ్డి లేదు. వాటిని నిర్మించడానికి అధికారులు నిధులు లేవంటున్నారు. మాగోస ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. మూత్రశాల, మరుగుదొడ్డి లేక ఆడవాళ్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వందశాతం పన్నులు చెల్లించినా పంచాయతీ భవనం లేకపోగా.. డ్వాక్రా భవనంలో మరుగుదొడ్డి, మూత్రశాల కట్టించడంలో అధికారులు మెతకవైఖరి అవలంబించడం దారుణం.

- గంగ, సర్పంచ్‌, అయ్యవారిగూడ


14 పంచాయతీల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు లేవు

మండలంలోని 24 గ్రామపంచాయతీలుండగా 14 గ్రామపంచాయతీ భవనాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేవు. దీంతో మహిళా ప్రజాప్రతినిధులు, అధికారులు  ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర సమయాల్లో పంచాయతీ భవనానికి దగ్గరగా ఉన్న ఇళ్లలోకి వెళ్లాల్సి వస్తుంది. కొన్ని పంచాయతీల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు ఉన్నా నీటివసతి లేదు. కలెక్టర్‌ స్పందించి తక్షణమే పంచాయతీ భవనాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించడం కోసం నిధులు విడుదల చేయాలి. 

- కొప్పు సుకన్యబాషా, యాచారం ఎంపీపీ 


Read more