జగనన్న కాలనీల్లో సౌకర్యాలు శూన్యం

ABN , First Publish Date - 2022-05-25T06:34:23+05:30 IST

ఊరికి దూరంగా ఉండడం, కనీస వసతులు లేకపోవడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదు.

జగనన్న కాలనీల్లో సౌకర్యాలు శూన్యం
నిర్మాణాలు ప్రారంభించని జెడ్‌.గంగవరంలోని జగనన్న కాలనీ

జెడ్‌.గంగవరం పంచాయతీలో ప్రారంభంకాని నిర్మాణాలు

పాపయ్యపాలెం, జి.కోడూరు, 

సుభద్రయ్యపాలెంలోనూ అదే పరిస్థితి

ఊరికి దూరంగా ఉండడం, 

నీటి వసతి లేక లబ్ధిదారుల అనాసక్తి 

మాకవరపాలెం, మే 24: ఊరికి దూరంగా ఉండడం, కనీస వసతులు లేకపోవడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు జరగడం లేదు. మండలంలోని జెడ్‌.గంగవరం పంచాయతీ పరిధిలో ఉన్న లేవుట్‌లో సుమారు 50 మందికి పట్టాలిచ్చారు. ఊరికి దూరంగా ఉండడంతో ఎవరూ నిర్మాణాలు ప్రారంభించలేదు. అలాగే పాపయ్యపాలెం, జి.కోడూరు, సుభద్రయ్యపాలెం గ్రామాల్లోని కొండల్లో పట్టాలు ఇవ్వడంతో అక్కడ కూడా నిర్మాణాలు ప్రారంభం కాలేదు. తూటిపాల గ్రామంలో 23 మందికి పట్టాలు ఇస్తే ఒకే ఒక్కరు ఇంటి నిర్మాణం చేపట్టారు. వజ్రగడ గ్రామంలో నీటి సదుపాయం లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టలేదు. జి.గంగవరంలో సిమెంట్‌ బిల్లులు రాకపోవడంతో పునాదులు తవ్వి వదిలేశారు. తామరం, బయ్యవరం, రాచపల్లి లేవుట్‌ల్లో అన్ని సౌకర్యాలు ఉండటంతో నిర్మాణాలు చేపట్టేందుకు అక్కడ లబ్ధిదారులు మొగ్గు చూపుతున్నారు. అలాగే మాకవరపాలెం లేవుట్‌లో 145 స్ధలాలకు గాను 90 మంది లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టినప్పటికి నీటి సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఓ ప్రైవేటు వ్యక్తి లేఅవుట్‌ సమీపంలోని నేలబావికి డీజిల్‌ ఇంజన్‌ ఏర్పాటు చేసి మూడు డమ్ముల నీరు రూ.200లకు విక్రయిస్తున్నాడు. పునాదుల ఫిల్లింగ్‌కి, నీటి కొనుగోలుకు ఎక్కువ ఖర్చు అవుతోందని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలోని 1,065 నిర్మాణాలకు గాను సుమారు 350 మంది మాత్రమే నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన వారు లేవుట్లు మార్పుచేయాలని, ఊరికి దగ్గర ఇవ్వాలని మరికొందరు, నీటి సదుపాయం కల్పిం చాలని ఇంకొందరు డిమాండ్‌ చేస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపట్టలేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీల్లో కనీస వసతులు కల్పించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-05-25T06:34:23+05:30 IST