AP News: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ యాప్.. మంత్రి బొత్స

ABN , First Publish Date - 2022-08-19T00:03:00+05:30 IST

Vijayawada: ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం ఫేషియల్ యాప్ అన్ని ప్రభుత్వ శాఖలో త్వరలో అమలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa

AP News: అన్ని ప్రభుత్వ శాఖల్లో ఫేషియల్ యాప్.. మంత్రి బొత్స

Vijayawada: ఉపాధ్యాయుల అటెండెన్స్ కోసం ఫేషియల్ యాప్ అన్ని ప్రభుత్వ శాఖలో త్వరలో అమలవుతుందని మంత్రి  బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) చెప్పారు. ఉపాధ్యాయ సంఘాలతో భేటి అయిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. ‘‘ఫేషియల్ యాప్‌పై ప్రభుత్వం ఒక విధానం తీసుకుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఇది త్వరలో అమలు అవుతుంది. తొలుత ఉపాధ్యాయులు వినియోగించాలని చెప్పాం. సమన్వయ లోపం‌ వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. అందుకే  ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం పెట్టాం. వారికి ఉన్న సందేహాలకు సమాధానాలు ఇచ్చాను. ఈ నెలాఖరు కల్లా అందరూ అవగాహన పెంచుకోవాలని చెప్పాను. లక్షా 90 వేలలో లక్ష మంది ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. విధులకు ఆలస్యంగా హాజరయినా ఇంకా ఎవరికీ మెమో ఇవ్వలేదు. మూడు సార్లు దాటి నాలుగోసారి ఆలస్యంగా వస్తే ఆఫ్ డే లీవ్‌గా పరిగణిస్తాం. ఉద్యోగరీత్యా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేం అండగా ఉంటాం. ఉపాధ్యాయులంతా తమ సెల్‌ఫొన్లలో యాప్ వాడాల్సిందే’’నని బొత్స చెప్పారు. సమన్వయ లోపం ఎందుకు వచ్చిందని ఆంధ్రజ్యోతి విలేకరి అడిగిన ప్రశ్నకు బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తప్పులు జరిగితే మేము సరి చేసుకుంటాం. మీకు మాత్రం వివాదమే కావాలి. ఇదే రాసుకోండి’’ అని బొత్స వ్యాఖ్యానించారు. 


ఫ్యాప్టో (FAPTO)  ఛైర్మన్ యన్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ..‘‘ ఫేషియల్ యాప్, ఇతర యాప్‌లు వద్దని చెప్పాం. ఫేషియల్ యాప్ వాడేందుకు డివైస్‌లు ఇవ్వాలని కోరాం.ఈ పదిహేను రోజులు యాప్ పరిశీలించి మా అభ్యంతరాలు చెబుతాం. పర్యవేక్షణ అధికారులను పెంచకుండా యాప్‌లతో మా పని తీరు  చెబుతారా? బోధనేతర పనులు అప్పగించ వద్దని కోరాం. అధికారులు ఒత్తిడి చేయడం వల్లే కొంతమంది యాప్‌ వాడుతున్నారు’’ అని చెప్పారు. 

Updated Date - 2022-08-19T00:03:00+05:30 IST